శనివారం బూట్లతో ఆలయం మెట్లు ఎక్కుతున్న చంద్రబాబు నాయుడు
సాక్షి, అమరావతి/విజయనగరం టౌన్: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం, కోదండరామస్వామి అలయంలో శ్రీరాముని విగ్రహం ధ్వంసం ఘటన వెనక తెలుగుదేశం పార్టీ కుట్ర స్పష్టంగా బయటపడింది. మహిళలకు ఇళ్ల పట్టాలిస్తూ ముఖ్యమంత్రి జగన్ అనితర సాధ్యమైన రీతిలో ముందుకెళుతుండటంతో విజయనగరంలోని ఆయన బహిరంగ సభను అడ్డుకోవాలన్న కుట్రతోనే మొదట దీనికి తెగబడినట్లు తెలియవస్తోంది. రకరకాల కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు... 20 మందికిపైగా వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అందులో టీడీపీ కుట్ర కోణం స్పష్టంగా బయటపడినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని ముందే తెలుసుకున్న చంద్రబాబు... తమ పాత్ర బయటపడుతుందన్న భయంతో రెండు రోజులుగా అక్కడ జనాన్ని పోగేస్తూ వచ్చారు.
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల నుంచి భారీగా జనాన్ని సమీకరించి ఆలయం దగ్గర రచ్చ చేయాలని, తద్వారా తమ పాత్ర బయటపడకుండా చేసి రాజకీయ లబ్ధి పొందాలని భావించారు. ఇందులో భాగంగానే... అప్పటికే అక్కడికి చేరుకున్న 2,500 మందికి పైగా జనంతో శనివారం ‘షో’ చేయబోయారు. కానీ ఈ విషయం తెలుసుకుని అప్పటికే అక్కడకు వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు, పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి వీరిని అడ్డుకోవటంతో బాబు ఆటలు సాగలేదు. అనంతరం పోలీసులు కూడా దర్యాప్తును ముమ్మరం చేసి.. ఇదంతా టీడీపీ నేతలు ఒక పన్నాగం ప్రకారం చేసిందేనని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.
అసలు ఏం జరిగిందంటే...
రామతీర్థం ప్రధానాలయానికి సుమారు 500 మీటర్ల దూరంలో నీలాచలం కొండ మీద శ్రీ కోదండరామస్వామి ఆలయంలోని సీతారామలక్ష్మణుల విగ్రహాల్లో ఈ నెల 28 అర్ధరాత్రి కొందరు దుండగులు శ్రీరాముని విగ్రహాన్ని ద్వంసం చేశారు. సాధారణంగా రోజూ అక్కడకు పూజారి ఉదయం 8 గంటలకు వెళ్లి మధ్యాహ్నం 12కు వెనక్కి వచ్చేస్తారు. అప్పటి నుంచి ఎవ్వరూ ఉండరు. దీన్ని అదనుగా తీసుకున్న దుండగులు ఖండించిన శిరస్సును సీతమ్మ కొలనులో పడేశారు. ఈ దుశ్చర్యను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం విశాఖ రేంజ్ డీఐజీ రంగారావు, విజయనగరం ఎస్పీ రాజకుమారి పర్యవేక్షణలో 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. వారు దర్యాప్తు చేస్తుండగా... స్థానిక టీడీపీ నేతలు కొందరు హడావుడి చేసి, కోనేరులో వెదికినట్లుగా వెదికి, అందులోంచి తల భాగాన్ని బయటకు తీయటం వారి అనుమానాల్ని మరింత పెంచింది.
అనంతరం ఈ శిరస్సు భాగాన్ని వెనుక నుంచి కోసినట్లు పోలీసులు గుర్తించారు. ఆధారాల కోసం మళ్ళీ నీలాచలం కొండపైన పరిశీలించారు. మాగ్నెట్లతో కోనేరులో సెర్చ్ చెయ్యగా యాక్సా బ్లేడు దొరికింది. వారు పగులగొట్టిన తాళం కూడా ఆలయం బయట పోలీసులకు దొరికింది. నిజానికి డిసెంబరు 25న కొండపైకి కరెంటొచ్చింది. 29న సిసి కెమెరాలు ఏర్పాటు చేయటానికి అంతా సిద్ధం చేశారు. ఈ విషయం తెలిసి తెల్లారక ముందే విగ్రహాన్ని ద్వంసం చేశారంటే అదంతా పక్కా సమాచారంతోనే జరిగి ఉంటుందనేది పోలీసుల భావన. పైగా 30న గుంకలాంలో 12,301 మందికి ఇళ్లపట్టాలివ్వటానికి సీఎం వైఎస్ జగన్ వస్తున్న నేపథ్యంలో ఇది జరగటాన్ని బట్టి... ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలనే ఉద్దేశంతో పక్కా పథకం ప్రకారమే చేశారన్నది వారి దర్యాప్తులో ప్రాథమికంగా తేలినట్లు సమాచారం.
అనుమానితుల కోసం టీడీపీ యాగీ...
విచారణ నిమిత్తం పోలీసులు అదుపులోకి తీసుకున్న అనుమానితుల్లో రామతీర్థం గ్రామానికి చెందిన టీడీపీ మాజీ ఉపసర్పంచ్, మాజీ వార్డు మెంబర్, మరికొందరు తెలుగుదేశం పార్టీకి చెందిన వారున్నారు. మొత్తం 21 మందికి పైగా పోలీసుల అదుపులో ఉన్నారు. ఇది తెలుసుకున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు హుటాహుటిన రామతీర్థం పర్యటనకు రావటం... రాక ముందే 3 రోజులుగా జనాన్ని పోగేయటం ఇక్కడ గమనార్హం. దీన్నిబట్టి తమ వారి పాత్ర ఏమాత్రం లేదని జనాన్ని నమ్మించడానికే ఈ అక్కర్లేని రాద్దాంతానికి ప్రయత్నించారన్నది తెలియకమానదు.
కాగా పోలీసుల అదుపులో ఉన్న టీడీపీ నేతలను ఎట్టిపరిస్థితుల్లోనూ బయటపడేయాలని, అందుకోసం ఎలాంటి ఉద్యమానికైనా వెనుకాడవద్దని ఈ సందర్భంగా తమ పార్టీ వారికి చంద్రబాబు సూచించటం గమనార్హం. దీంతోపాటు పోలీసులు విచారణ కోసం పిలిచి 24 గంటలు కూడా గడవకముందే అనుమానితుడైన టీడీపీ నేత భార్య న్యాయస్థానాన్ని ఆశ్రయించి హెబియస్ కార్పస్ పిటిషన్ వేసినట్లు సమాచారం. ఇదంతా టీడీపీ పెద్దలు దగ్గరుండి చేయించడం విశేషం. జరిగింది ముమ్మాటికీ కుట్రేనని, దానివెనుక టీడీపీ వారున్నారని... అయితే పూర్తి సాక్ష్యాధారాలు సేకరించాకగానీ ఈ విషయాన్ని నిర్థారించలేమని పోలీసులు చెబుతున్నారు.
ఉద్దేశపూర్వకంగా అలజడుల సృష్టికే..
రాష్ట్రంలో వరుసగా ఆలయాలలో ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో దేవదాయ శాఖ ఆ«దీనంలోని అన్ని ఆలయాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రభుత్వం గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. దాదాపు అన్ని ఆలయాల్లో ఈ ఏర్పాటు ప్రక్రియ పూర్తికావొచి్చంది. 20 వేలకు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటయ్యాయి కూడా. ఈ నేపథ్యంలో... శ్రీరాముని విగ్రహం ధ్వంసం జరిగిన రామతీర్థం ఆలయానికి విద్యుత్ సౌకర్యం లేకపోతే.. అక్కడ కూడా సీసీ కెమెరాలు పెట్టడానికి కొండపైకి ప్రభుత్వం కొత్త విద్యుత్ లైన్లు వేసింది. ఒక్క రోజులో కెమెరాలు ఏర్పాటు చేస్తారనగా ఈ దుర్ఘటన జరగటం గమనార్హం. ఈ ఆలయ ట్రస్టు బోర్డు ఛైర్మన్‌గా ఇప్పటిదాకా టీడీపీ నేత, మాజీ మంత్రి అశోక గజపతిరాజు కొనసాగుతుండగా... ఇటీవల తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం శ్రీరాంనగర్‌లోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ధ్వంసం జరిగిన వరసిద్ధి విఘ్నేశ్వరస్వామి ఆలయం కూడా దేవాదాయ శాఖ ఆదీనంలో లేని ఒక ప్రైవేట్ ఆలయం. ఇది టీడీపీ సీనియర్ నేత గన్ని కృష్ణ అజమాయిషీలో ఉండటం గమనార్హం.
చైర్మన్ పదవి నుంచి అశోక గజపతి తొలగింపు
రామతీర్థం ఆలయంలో శ్రీరాముని విగ్రహ ధ్వంసం ఘటనకు వ్యవస్థాపక ధర్మకర్త హోదాలో రామతీర్థం ఆలయ చైర్మనుగా కొనసాగుతున్న కేంద్ర మాజీమంత్రి అశోక గజపతి రాజు నిర్లక్ష్యం కూడా కారణమని దేవదాయ శాఖ పేర్కొంది. సంఘటన జరిగి రోజులు గడుస్తున్నా, కనీసం ఆ ఆలయాన్ని ఆయన సందర్శించలేదు. సరికదా.. దానిపై సరైన రీతిలో స్పందించలేదు. దీంతో ఆయన్ను ఆ పదవి నుంచి తొలగిస్తూ దేవదాయ శాఖ కార్యదర్శి గిరిజా శంకర్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. దీనికితోడు విజయనగరంలోని శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం, తూర్పు గోదావరి జిల్లా మందపల్లిలోని మందేశ్వరస్వామి ఆలయం చైర్మన్ పదవుల నుంచి కూడా అశోక గజపతిరాజును తొలగించారు.
Comments
Please login to add a commentAdd a comment