
మహారాణిపేట (విశాఖ దక్షిణ): సింహాచలం దేవస్థానం భూముల జాబితా నుంచి వందలాది ఎకరాలు మాయం కావడంపై విచారణ మరింత లోతుగా సాగుతోంది. పంచగ్రామాల భూ జాబితా నుంచి 740 ఎకరాల గల్లంతు కావడంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. దేవదాయ శాఖ అదనపు కమిషనర్ చంద్రకుమార్, ఉప కమిషనర్ ఇ.పుష్పవర్దన్ బుధవారం టర్నర్ సత్రం ఉప కమిషనర్ కార్యాలయంలో విచారణ చేపట్టారు.
దేవదాయ శాఖ ఆస్తుల జాబితా, 22 ఏ జాబితా, ఇతర రికార్డులను అధికారులు తనిఖీ చేశారు. అడంగల్ కాపీలు, టెన్ వన్ రికార్డులను కూడా పరిశీలిస్తున్నారు. 2016 డిసెంబర్–2017 ఫిబ్రవరి మధ్య 740 ఎకరాల భూమిని జాబితాల నుంచి తప్పించినట్టు అధికారులు గుర్తించారు. ఏ ప్రాంతాల్లోని భూములను జాబితాల నుంచి తప్పించారనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. 2010 రికార్డుల ప్రకారం దేవస్థానానికి 11,118 ఎకరాల భూమి ఉండగా.. 2016 నాటికి 10,278 ఎకరాలు మాత్రమే ఉన్నాయి. మొత్తం వ్యవహారంపై విచారణ అధికారులు రెండు రోజుల్లో దేవదాయ శాఖ నివేదిక సమర్పించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment