
సాక్షి, అమరావతి: వినాయక చవితి వేడుకలు, ఇతర సమయాల్లో ప్రతిపక్ష పార్టీలు భగవంతుడి పేరుతో రాజకీయాలు, అసత్య ప్రచారాలను మానుకోవాలని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ సూచించారు. రాష్ట్ర సచివాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ చవితి ఉత్సవాలపై అసత్య ప్రచారం చేస్తున్న విపక్షాల వైఖరిపై మండిపడ్డారు. వారు చేస్తున్న దుష్ప్రచారం భగవంతుడిపై చేస్తున్నారని గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు.
దేవుడితో ఆటలొద్దని హెచ్చరించారు. భగవంతునికి ఆగ్రహం వస్తే ఏమి జరుగుతుందో తెలుసుకోవాలని అన్నారు. గణేష్ మండపాల ఏర్పాటులో ప్రభుత్వం కొత్తగా ఎలాంటి నిబంధనలు పెట్టలేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న నిబంధనలే ఇప్పుడూ ఉన్నాయన్నారు. కాగా అన్ని ప్రధాన అమ్మవారి దేవాలయాల్లో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పలు ఆలయాల ఈవోలు, డిప్యూటీ, అసిస్టెంట్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. ఆలయాల్లో ఏర్పాట్లు, ప్రత్యేక కార్యక్రమాలపై ఆరా తీశారు. ఈ సమావేశంలో దేవదాయ శాఖ కమిషనర్ హరి జవహర్‌లాల్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment