జహీరాబాద్: మండలంలోని జాడీమల్కాపూర్ గ్రామ శివారులోని పెద్దవాగు జలమంతా పక్క రాష్ట్రానికి పరుగులు పెడుతోంది. సాగునీరు కళ్లముందే కర్ణాటకకు వెళుతున్నా, ఏం చేయలేని దుస్థితి జిల్లా రైతన్నలది. పెద్దవాగుపై ఎత్తి పోతల ప్రాజెక్ట్ నిర్మిస్తే సుమారు రెండు వేల ఎకరాల మేర వ్యవసాయ భూములను సాగులోకి తీసుకువచ్చే అవకాశం ఉంది.
అయినా ఈ విషయంలో పాలకులు పట్టించుకోకపోవడంతో సిరులు కురిపించాల్సిన భూములు బీళ్లుగా మారుతున్నాయి. జాడి మల్కాపూర్ గ్రామ శివారులోని తూర్పు దిశలో త మ్మలి గడ్డ ప్రాంతంలో ప్రాజెక్ట్‌ను నిర్మించేందుకు పూర్తిగా అనువుగా ఉన్నప్పటికీ పాలకులు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. వాగుకు ఇరువైపులా కొండలు ఉండడంతో ప్రాజెక్ట్‌ను నిర్మించి, ఎత్తి పోతల పథకం ద్వారా పొలాలకు నీటిని అందించవచ్చని స్థానిక రైతులు చెబుతున్నారు.
ఎత్తిపోతల నిర్మాణం ద్వారా జాడి మల్కాపూర్, సజ్జారావుపేట తండాకు నీరందించే అవకాశం ఉంది. జాడి మల్కాపూర్ గ్రామంలో 3 వేల ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా, అందులో 1,600 ఎకరాలకు ఎత్తిపోతల పథకం ద్వారా నీరందించే వీలుంది. ఇదే గ్రామ పంచాయతీ పరిధిలోకి వచ్చే సజ్జారావు పేట తండాలో 1,500 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా, అందులో 700 ఎకరాలకు నీరందించే వీలుంటుంది. ప్రభుత్వం, అధికారులు ఎత్తిపోతల ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో ప్రత్యేక శ్ర ద్ధ తీసుకుని ఎత్తిపోతల ద్వారా పొలాలకు నీటిని అందించేందుకు చర్యలు తీసుకోవాలని రైతాంగం కోరుతోంది.
జలమంతా వృథాయే
కోహీర్ మండలంలోని గొటిగార్‌పల్లి గ్రామంలోనిపెద్దవాగు ప్రాజెక్టు ఒక్క భారీ వర్షానికే పూర్తిగా నిండి.పోతోంది. దీంతో అదనపు జలమంతా జహీరాబాద్ మండలంలోని మల్‌చల్మ, జాడీమల్కాపూర్ గ్రామాల మీదుగా కర్ణాటక రాష్ట్రంలోకి చేరుకుంటోంది. కర్ణాటకలోని చండ్రంపల్లి ప్రాజెక్ట్‌కు ఇదే వాగు ప్రధాన వనరుగా ఉంటోంది. కృష్ణా బెసిన్ కింద దీనిని గుర్తించారు. వేసవి కాలంలోనూ ఈ వాగు ప్రవహిస్తూ చండ్రంపల్లి ప్రాజెక్టుకు జీవ వనరుగా ఉంది. ఈ వాగుపై ఎత్తి పోతల ప్రాజెక్ట్ నిర్మిస్తే మన జిల్లా రైతులకు ఎంతో మేలు జరుగుతుంది.
చుక్క నీటిని కూడా నిల్వచేయలేని పరిస్థితి
ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం మాట ఎలా ఉన్నా, కనీసం చుక్క నీటిని కూడా సద్వినియోగం చేసుకునే దిశలో అధికార యంత్రాంగం కృషి చేయడం లేదు. పెద్దవాగుపై ప్రాజెక్టు నిర్మాణానికి అనుకూలంగా ఉన్నా, ప్రభుత్వం శ్రద్ధ చూపలేక పోతోంది. నీటిని కొంత మేరకైనా సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా వాగుపై మూడు ప్రాంతాల్లో చెక్‌డ్యాంల నిర్మాణం కోసం నీటి పారుదల శాఖ దశాబ్ద కాలం క్రితం ప్రతిపాదించినా, ఇప్పటి వరకు నిధులు మంజూరు కాలేదు. పెద్ద వాగుపై అవసరం ఉన్న చోట కనీసం చెక్‌డ్యాంలను నిర్మించినా భూగర్భ జలాలు వృద్ధి చెందే అవకాశం ఉందని రైతులు అంటున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
జలం.. దక్కని ఫలం!
Published Mon, Nov 10 2014 11:36 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement