
శభాష్.. దేవీసింగ్
- డ్రాపౌట్ లేని గిరిజన బడి
- హరిత వనంలా పాఠశాల..
- విద్యార్థుల్లో క్రమశిక్షణ
- హెచ్‌ఎం కృషి ఫలితం..
జహీరాబాద్ టౌన్:చుట్టూ పచ్చని మొక్కలు.. ఆహ్లాదకర వాతావరణం.. ఉపాధ్యాయుల అంకిత భావం.. గిరిజన విద్యార్థుల్లో క్రమశిక్షణ.. అంతా కలగలిపి.. రాయిపల్లి(డి) తండా బడి..ముఖ్యంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కృషితో పాఠశాల ప్రగతి వైపు పయనిస్తోంది. జహీరాబాద్ మండలంలో 20కి పైగా గిరిజన తండాలున్నాయి. చాలా వరకు బడులన్నీ మొక్కుబడిగా నడుస్తున్నాయి. హెచ్‌ఎం. దేవిసింగ్ కృషి వల్ల రాయిపల్లి(డి) పాఠశాల ఆదర్శంగా నిలుస్తోంది. వెయ్యి జనాభా ఉన్న ఈ తండాలో ఒకటి నుంచి 5 వరకు తరగతులు ఉన్నాయి.
హెచ్‌ఎంగా దేవీసింగ్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత రూపురేఖలు మారాయి. పాఠశాలలో 60 మంది వరకు విద్యార్థులు ఉంటే ఇంటింటికెళ్లి డ్రాప్ అవుట్‌లను గుర్తించి వారిని బడిలో చేర్పించారు. ప్రస్థుతం విద్యార్థుల సంఖ్య 112కు చేరింది. ఇప్పడు తండాలో డ్రాప్‌అవుట్ పిల్లలు లేకపొవడం గమన్హరం.
శుభ్రత కోసం వారానికి రెండు సార్లు పాఠశాల ఆవరణలో కల్లాపి చల్లుతారు. తరగతులను చక్కగా నిర్వహిస్తూ క్రమశిక్షణలో విద్యార్థులు నడుచుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. మధ్యాహ్న భోజన సమయంలో తప్పకుండా ప్రార్థన చేయిస్తారు. నీటి కొరత లేకుండా చర్యలు తీసుకున్నారు. బోరు చెడిపొతే వెంటనే సొంత డబ్బుతో మరమ్మతులు చేయించి నీటి సమస్య రాకుండా చూసుకుంటున్నారు.
పాఠశాల ఆవరణలో పండ్లు, కూరగాయాలు, ఇతర మొక్కలను పెంచుతూ హరిత హారంగా మార్చారు. బాల బాలికలకు వేరు వేరుగా మరుగుదొడ్ల ఏర్పాటుచేసి వాటి పర్యవేక్షణ కోసం ఆయాను నియమించారు. ఈ సంవత్సరం నుంచి ఇంగ్లీష్ మీడియం నడుపుతున్నారు. పాఠశాల గోడలకు మహాత్ముల బొమ్మలను పెయింటింగ్ చేయించారు. రూ.60 వేల ఖర్చుతో హెచ్‌ఎం పాఠశాల అభివృద్ధి కోసం పలు రకాల పనులను చేయించి తండా వాసులతో శభాష్ అనిపించుకుంటున్నారు.
అందిరి సహకారంతో...
పాఠశాల ఉపాధ్యాయులు, తండావాసుల సహకారంతో పాఠశాలను ప్రగతి పథం వైపు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నా. తాను పదవీ బాధ్యతలు తీసుకోక ముందు తరగతి గదుల్లో మందుబాటిళ్లు, చెత్త చెదారం, పశువుల నిలయంగా ఉండేది. అందరి కృషితో హరిత క్షేత్రంగా తీర్చిదిద్దుతున్నా. పలు శాఖల అధికారులు పాఠశాలను సందర్శించి అభినందిచడం చాలా సంతోషాన్ని కలిగిస్తోంది.సదుపాయలతో పాటు విద్యాప్రమాణాలు పెంచేందుకు తన వంతు కృషి చేస్తా. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నందన అదనపు తరగతి అవసరం ఉంది.