జహీరాబాద్: స్థానిక బాగారెడ్డి స్టేడియం గ్రౌండ్‌లో స్టుడెంట్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న అండర్-19 అంతర్ జిల్లా ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో జంటనగరాలకు చెందిన జట్లు సెమీ ఫైనల్‌కు చేరుకున్నాయి. ఆదివారం లీగ్, నాకౌట్ దశలో జరిగిన పోటీల అనంతరం హైదరాబాద్, రంగారెడ్డి జట్లతో పాటు వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లా జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధించాయి.
సోమవారం జరిగనున్న సెమీ ఫైనల్ పోటీల్లో రంగారెడ్డి జట్టుతో మహబూబ్‌నగర్ జట్టు, హైదరాబాద్ జట్టుతో వరంగల్ జట్లు తలపడనున్నాయి. అనంతరం ఫైనల్ పోటీ నిర్వహిస్తారు. లీగ్ పోటీల నుంచి ఫైనల్ పోటీల వరకు ఆయా జిల్లాల క్రీడాకారులు కనబర్చిన ప్రతిభ ఆధారంగా రాష్ట్ర జట్టును ఎంపిక చేయనున్నారు. టోర్నమెంట్‌ను ఆర్గనైజింగ్ సెక్రటరీ ఫెడ్రిక్, అబ్జర్వర్ రవికుమార్‌లు పర్యవేక్షించారు. పీడీలుగా గోపిసింగ్, మచ్చేందర్, ధన్‌రాజ్, అజిమొద్దీన్‌లు వ్యవహరించారు.