
ఫరీదుద్దీన్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్న ఎంపీ బీబీ పాటిల్
అంచెలంచెలుగా ఎదిగిన ఫరీదుద్దీన్
జహీరాబాద్: మాజీ మంత్రి ఎం.డి.ఫరీదుద్దీన్ గురువారం ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపంసహరణ గడువు ముగియడంతో ఒకే ఒక నామినేషన్ దాఖలైనందున ఫరీదుద్దీన్ ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించి ధృవీకరణ పత్రం అందజేశారు. జహీరాబాద్‌కు చెందిన ఎం.డి.ఫరీదుద్దీన్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ జీవితం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారు.
2014లో అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇటీవల జరిగిన పాలేరు అసెంబ్లీ స్థానం నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేసి గెలుపొందడంతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది. దీంతో మైనార్టీ వర్గానికి చెందిన ఎం.డి.ఫరీదుద్దీన్ పేరును ముందస్తుగానే ఎమ్మెల్సీ పదవికి టీఆర్‌ఎస్ అధిష్టాన వర్గం ఖరారు చేసిన విషయం తెలిసిందే.
సర్పంచ్ స్థాయి నుంచి
జహీరాబాద్ మండలంలోని హోతి(బి) గ్రామానికి చెందిన ఫరీదుద్దీన్ గ్రామ సర్పంచ్ పదవి నుంచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1985 నుంచి 1990 సంవత్సరం వరకు సర్పంచ్‌గా, ఎంపీపీ ఉపాధ్యక్షుడిగా పని చేశారు. 1990 నుంచి 1999 వరకు జహీరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగారు. 1990 నుంచి 1995 వరకు ఇప్పపల్లి ఏపీసీఎస్ ఛైర్మన్‌గా పని చేశారు.
1999 సంవత్సరంలో మొదటి సారిగా జహీరాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. 2004 ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం ఫరీదుద్దీన్‌కే ఎమ్మెల్యే టికెట్‌ను కేటాయించగా గెలుపొంది దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి మంత్రి వర్గంలో స్థానం పొందారు. మైనార్టీ సంక్షేమం, వక్ఫ్, ఉర్దూ అకాడమీ, ఫిషరీస్, సహకార శాఖల మంత్రిగా పని చేశారు.
ప్రముఖుల శుభాకాంక్షలు
టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీగా ఎన్నికైన మాజీ మంత్రి ఎం.డి.ఫరీదుద్దీన్‌కు ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, టీఆర్‌ఎస్ రాష్ర్ట కార్యదర్శి దేవేందర్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మురళీకృష్ణాగౌడ్, మాజీ జడ్పీటీసీ ఆర్.అరవిందరెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు వైజ్యనాథ్, జి.విజయకుమార్, పాండురంగారెడ్డి, షేక్ ఫరీద్‌లతో పాటు పలువురు హైదరాబాద్‌లో ఫరీదుద్దీన్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
జహీరాబాద్‌లో సంబరాలు
ఫరీదుద్దీన్ స్వస్థలమైన జహీరాబాద్‌లో టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు బాణ సంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. గురువారం సాయంత్రం పార్టీ నాయకులు పట్టణంలోని భవానీ మందిర్ క్రాస్ రోడ్డు వద్ద బణ సంచా కాల్చి స్వీట్లు పంచుకున్నారు. సంబరాల్లో మున్సిపల్ మాజీ ఛైర్మన్ అల్లాడి నర్సింహులు కార్యకర్తలతో కలిసి సంబరాలు చేసుకున్నారు.