![Village Sarpanch Upset By Members Grabbed Electric Wires Zaheerabad - Sakshi](/styles/webp/s3/article_images/2022/05/5/power.jpg.webp?itok=i6wFNU7W)
న్యాల్‌కల్(జహీరాబాద్): గ్రామ పంచాయతీ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు, ఖర్చుల వివరాలు సభ్యులు అడగడంతో మనస్తాపానికి గురైన ఓ సర్పంచ్ విద్యుత్ తీగలను పట్టుకునాన్నాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్ మండల పరిధి రేజింతల్ గ్రామంలోజరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం పంచాయతీ కార్యాలయంలో పాలకవర్గ సమావేశం బుధవారం నిర్వహించారు. సర్పంచ్ కుత్బుద్దీన్, కార్యదర్శి, వార్డు సభ్యులు హాజరయ్యారు. ‘పంచాయతీ అభివృద్ధికి ఎన్ని నిధులొచ్చాయి? ఏయే పనులు చేపట్టారు?’ వివరాలు కావాలని సభ్యులు నిలదీశారు.
దీంతో అభివృద్ధి పనులను వివరించాలని రికార్డులను పంచాయతీ కార్యదర్శికి సర్పంచ్ ఇచ్చారు. ఆమె వివరాలు వెల్లడిస్తున్న సమయంలో వార్డు సభ్యులు, సర్పంచ్‌కు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ‘గ్రామాభివృద్ధి కోసం పంచాయతీ నిధులతో పాటు ఇతర నిధులను తీసుకొచ్చినా నిలదీస్తారా? అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నా నన్నే అనుమానిస్తారా?’ అంటూ తీవ్ర మనస్తాపానికి గురైన సర్పంచ్ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయాడు. రైతు వేదిక దగ్గరకు వెళ్లి అక్కడున్న విద్యుత్ ట్రాన్స్‌పార్మర్ తీగలను పట్టుకున్నాడు.
విద్యుదాఘాతంతో కింద పడిపోయాడు. విషయాన్ని గమనించిన పలువురు చికిత్స నిమిత్తం గంగ్వార్ చౌరస్తాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య సిబ్బంది బీదర్‌కు తీసుకువెళ్లాలని సూచించారు. దీంతో బీదర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారని గ్రామస్తులు తెలిపారు. ‘సభ్యులు ప్రశ్నిస్తే సమాధానం చెప్పాలే కాని విద్యుత్ తీగలు పట్టుకోవడం ఏమిటి’ అని స్థానికులు చర్చించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment