
మామ ఆధిపత్యం భరించలేక హత్యకు పథకం రచించిన మూడో అల్లుడు
సహకరించిన ముగ్గురు కుమార్తెలు, మరో ఇద్దరు అల్లుళ్లు
13మంది నిందితుల అరెస్ట్
వివరాలు వెల్లడించిన సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ
సూర్యాపేటటౌన్: గ్రామంలో ఆధిపత్యం కోసం మామను అతికిరాతంగా హత్య చేయించాడు సొంత అల్లుడు. నూతనకల్ మండలం మిర్యాల గ్రామంలో హత్యకు గురైన మాజీ సర్పంచ్ మెంచు చక్రయ్యగౌడ్ హత్య కేసులో 13 మంది నిందితులను పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సోమవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నరసింహ విలేకరులకు వెల్ల డించారు.
చక్రయ్యగౌడ్ ఆధిపత్యం సహించలేక..
మెంచు చక్రయ్యగౌడ్ గ్రామంలో పెద్దమనిషిగా చలామణి అవుతూ గ్రామ సర్పంచ్‌గా కూడా పనిచేశాడు. అతడికి ఐదుగురు కుమార్తెలు సంతానం. తన మూడో కుమార్తె కనకటి సునీతను కూడా సర్పంచ్‌గా, మూడో అల్లుడు కనకటి వెంకన్నను పీఏఏసీఎస్ చైర్మన్‌గా చేశాడు. అల్లుడు కనకటి వెంకన్న పీఏసీఎస్ చైర్మన్ అయిన్నప్పటి నుంచి నూతనకల్ మండలంలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు.
గ్రామంలో చక్రయ్యగౌడ్ ఆధిపత్యం ఉండటం వెంకన్న వర్గీయులు సహించలేకపోయారు. చక్రయ్యగౌడ్‌కు వ్యతిరేకంగా వెంకన్న వర్గీయులు ఒక గ్రూపుగా ఏర్పడడంతో వారి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల అనంతరం 2023లో చక్రయ్యగౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2024లో కనకటి వెంకన్న కూడా కాంగ్రెస్‌లోకి వచ్చాడు. అయినప్పటికీ గ్రామంలో చక్రయ్యగౌడ్ ఆధిపత్యం కొనసాగుతోంది. దీంతో ఎలాగైనా మామ చక్రయ్యగౌడ్‌ను అడ్డు తొలగించుకోవాలని కనకటి వెంకన్న నిర్ణయించుకున్నాడు.
బొడ్రాయి మహోత్సవంలో హత్యకు పథకం..
ఈ నెల 13న మిర్యాల గ్రామంలో బొడ్రాయి మహోత్సవం జరిగింది. గతంలో కనకటి వెంకన్న ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరిగేవి, చక్రయ్యగౌడ్ ఈసారి ఉత్సవాలను తన ఆధ్వర్యంలో జరపాలని బహిరంగంగా ప్రకటించడంతో వెంకన్న తట్టుకోలేకపోయాడు. దీంతో ఎలాగైనా చక్రయ్యగౌడ్‌ను హత్య చేయాలని తన వర్గీయులను కొంతమందిని వెంకన్న పురమాయించాడు. ఈ నెల 17వ తేదీ సాయంత్రం చక్రయ్యగౌడ్ తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లి వస్తుండగా.. అతడి మొదటి అల్లుడు కనకటి ఉప్పలయ్య, ఐదో అల్లుడు కనకటి లింగయ్యతో పాటు వెంకన్న అనుచరులైన కనకటి శ్రవణ్, కనకటి శ్రీకాంత్, గంధసిరి వెంకటేష్, పెద్దింటి మధు, పెద్దింటి గణేష్ అడ్డగించి మారణాయుధాలు, వెదురు కరల్రతో చక్రయ్యగౌడ్‌పై దాడి చేసి హత్య చేశారు.
ఇదంతా దూరంగా నుంచి గమనిస్తున్న వెంకన్న చక్రయ్యగౌడ్‌పై దాడి జరిగగానే అతడు చనిపోయాడని నిర్ధారించుకుని అక్కడి నుంచి అందరూ పారిపోయారు. ఈ హత్యపై నూతనకల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సోమవారం ఉదయం తుంగతుర్తి పరిధిలో వాహనాల తనిఖీల్లో భాగంగా.. చక్రయ్యగౌడ్ హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న అతడి మొదటి అల్లుడు కనకటి ఉప్పలయ్యతో పాటు హత్యకు కుట్ర పన్నిన మూడో అల్లుడు కనకటి వెంకన్న, వెంకన్న భార్య సునీత, మొదటి కుమార్తె కనకటి స్వరూప, ఐదో కుమార్తె కనకటి కల్యాణితో పాటు దిండిగల నగేశ్, జక్కి పరమేష్, మన్నెం రమేశ్, కనకటి వెంకన్న అలియాస్ మొండి వెంకన్న, కనకటి శ్రావ్య, కనకటి/వర్దెల్లి అనూష, జక్కి స్వప్న, భారీ సతీష్ రెండు కార్లలో వెళ్తుండగా పోలీసులు అదపులోకి తీసుకున్నారు.
వారిని విచారించగా.. చక్రయ్యగౌడ్‌ను హత్య చేసినట్లు నిజం ఒప్పుకున్నారు. నిందితుల నుంచి రెండు కార్లు, ఒక కర్ర, 10 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్టు ఎస్పీ తెలిపారు. ఈ కేసులో మొత్తం 42 మందిపై కేసు నమోదైందని, దర్యాప్తు కొనసాగుతుందని ఎస్పీ తెలిపారు. ప్రత్యక్షంగా హత్యలో పాల్గొన్న ఏడుగురు నిందితుల్లో కనకటి ఉప్పలయ్య మినహా మిగతా ఆరుగురు గతంలోనే కోర్టులో లొంగిపోయినట్లు సమాచారం.
కస్టడీ పిటీషన్ వేసి దర్యాప్తు చేస్తాం
ఈ హత్య కేసులో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్న ఎవరినీ వదిలిపెట్టకుండా కచ్చితమైన ఆధారాలు సేకరిస్తూ దర్యాప్తు పారదర్శకంగా చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. కస్టడీ పిటిషన్ వేసి నిందితులను కస్టడీలోకి తీసుకుని దర్యాప్తు చేస్తామన్నారు. నిందితులను పట్టుకున్న పోలీసులకు ఎస్పీ రివార్డు అందజేశారు. ఈ కేసు ఛేదించిన సూర్యాపేట డీఎస్పీ రవి, సీఐ డి. శ్రీను, ఎస్‌ఐలు మహేంద్రనాథ్, ఎం. వీరయ్య, ఆర్. క్రాంతికుమార్‌ను ఎస్పీ అభినందించారు.