
నినాదాలు రాసుకున్న తన ఆటోతో డ్రైవర్ బాబు
సాక్షి, జహీరాబాద్ : మండలంలోని చిన్న హైదరాబాద్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ బరూర్‌బాబు తన ఆటో ద్వారా ప్రజా ఉపయోగ కార్యక్రమాలను నిర్వహిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. అంతే కాకుండా తన ఆటోపై సమాజానికి ఉపయోగపడే సందేశాలను రాయించుకుని అందరిరికీ ఆదర్శంగా నిలిచారు. ఆటో ద్వారా పేదలకు సేవలు సైతం అందిస్తున్నారు.
ఇచ్చినంతే తీసుకుని..
ముఖ్యంగా ఉచిత వైద్య శిబిరాలకు వెళ్లే రోగులు ఇచ్చినంతనే డబ్బు తీసుకుంటున్నారు. డబ్బులు ఇవ్వని వారికి వత్తిడి చేయడం లేదు. గ్రామంలో అర్ధరాత్రి అత్యవసర వైద్యం కోసం ఆటో అవసరం అయినా వెంటనే అంగీకరించి ఆస్పత్రికి చేర్చుతున్నాడు. ఇచ్చినంతమే డబ్బు తీసుకుంటున్నాడు. పేదరికంలో ఉన్న వారు డబ్బులు ఇవ్వకున్నా సేవలు అందిస్తున్నారు. రహదారిపై ఎవరైనా ప్రమాదాలకు గురైతే వెంటనే స్పందించి క్షతగాత్రులను వైద్యం నిమిత్తం ఆస్పత్రికి చేర్చుతుంటాడు.
హరితహారంలో నాటేందుకు అవసరమైన మొక్కలను సైతం తన ఆటో ద్వారా సుమారు 5 కిలో మీటర్ల వరకు నర్సరీ నుంచి ఉచితంగా సరఫరా చేస్తుంటాడు. ఎవరికైనా అత్యవసరంగా రక్తం అవసరం అయినా తన వంతు సహాయ పడతాడు. ఇందు కోసం అవసరమైన ఏర్పాట్లు సైతం చేసి శభాష్ అనిపించుకుంటాడు. తను పేదరికంలో ఉన్నా ఇతరుడు సహాయపడడంలో ఉన్న తృప్తి మరి దేంట్లో ఉండదంటారు బాబు. డ్రైవర్ వృత్తిని నిర్వహిస్తూ తనవంతు అయిన సహాయం చేయడంలో ముందుటాడు.