
మాట్లాడుతున్న సీఐ నాగరాజు, వెనుక నిందితులు
- వీడిన కేసు మిస్టరీ
- ఐదుగురు నిందితుల రిమాండ్
- సీఐ నాగరాజు వెల్లడి
జహీరాబాద్ టౌన్: వేధింపులను భరించలేకే కొందరు వ్యక్తులు ఓ వ్యక్తిని హతమార్చారు. వివాహేతర బంధాన్ని నిలిపివేయాలని చెప్పినా వినకపోవడంతో సదరు వ్యక్తులు అంతమొందించినట్టు పోలీసులు తెలిపారు. ఈ హత్య కేసుతో సంబంధం ఉన్న ఐదుగురిని పోలీసులు మంగళవారం రిమాండ్‌కు పంపారు.
జహీరాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ డి.నాగరాజు వెల్లడించిన హత్య కేసు వివరాలు ఇలా... మండలంలోని మన్నాపూర్‌కు చెందిన వెంకటవిజయ్ పట్టణంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో నివాసముంటూ జేసీబీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.
పట్టణంలోని బాగారెడ్డి పల్లికి చెందిన బుజ్జమ్మను భర్త వదిలేయడంతో ఆమెతో వెంకట్‌విజయ్ వివాహేతర సంబధాన్ని కొనసాగిస్తున్నాడు. విషయం తెలిసిన బుజ్జమ్మ సోదరులు అక్కను మందలించారు. దీంతో ఆమె వెంకట్‌విజయ్‌తో కొంతకాలంగా దూరంగా ఉంటుంది. వెంకట్‌విజయ్ అప్పుడప్పుడు తాగి ఆమె ఇంటికి వచ్చి అల్లరిచేస్తుండగా మందలించి పంపించేవారు.
ఈ క్రమంలో వెంకట్‌విజయ్ ఈనెల 2వ తేదీ రాత్రి ఆమె ఇంటికి వెళ్లాడు. బుజ్జమ్మ ఆమె తమ్ముళ్లు శ్రీనివాస్, కుమార్, అరుణ్‌కుమార్‌తో పాటు బేగరి సురేష్, గడికి చెందిన చిలపల్లి అరుణ్‌కుమార్‌లు ఇంటి వద్ద రాత్రంతా చితకబాదారు. మరుసటి రోజు పట్టణ సమీపంలోని రాంనగర్ ప్రాంతంలో గల దాల్‌మిల్ వద్ద గల అటవీ ప్రాంతంలోని తీసుకెళ్లారు.
అక్కడే మద్యం తాగి కర్రలతో వెంకట్‌విజయ్‌ను చితకబాది హత్య చేశారని సీఐ తెలిపారు. శవంపై చెట్టు కొమ్మలు వేసి పరారైనట్టు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి ఐదుగురు నిందితులను అరెస్టు చేసి కోర్టులో రిమాండ్ చేశామన్నారు. అయితే సురేష్ పరారీలో ఉన్నాడని సీఐ వివరించారు. విలేకరుల సమావేశంలో జహీరాబాద్ టౌన్ ఎస్‌ఐ రాజశేఖర్ పాల్గొన్నారు.