రిపోర్టుల్లో దాగిన మిస్టరీ
రిపోర్టుల్లో దాగిన మిస్టరీ
Published Sat, Oct 15 2016 4:55 PM | Last Updated on Fri, Nov 9 2018 4:19 PM
దివ్య కేసు దర్యాప్తులో తీవ్రజాప్యం
100 రోజులు దాటినా కొలిక్కి రాని వ్యవహారం
ఆందోళన చెందుతున్న మృతురాలి తల్లిదండ్రులు
కోహీర్: జహీరాబాద్ నియోజకవర్గంలో సంచలనం సృష్టించిన విద్యార్థిని దివ్య మరణం మిస్టరీ 100 రోజులు దాటినా వీడలేదు. కేసు విచారిస్తున్న రైల్వే పోలీసులు రిపోర్టుల కోసం ఎదురుచూస్తున్నారు. హత్యగా భావిస్తున్న తల్లిదండ్రులు దర్యాప్తులో జరుగుతున్న జాప్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాలేజీకి వెళ్లి మృతి
కోహీర్ మండలం మద్రి గ్రామానికి చెందిన దివ్య జూన్ 30 తేదిన కళాశాలకు వెళ్లి తిరిగి రాలేదు. తర్వాత రోజు ఉదయం మద్రి శివారులో రైలుపట్టాలపై దివ్య శవం పడిఉంది. విషయం తెలుసుకొన్న విద్యార్థి, మహిళా సంఘాలు దివ్య మరణం ముమ్మాటికీ హత్యేనని, దోషులను తక్షణమే శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేశారు. అధికారులకు వినతిపత్రాలు సైతం అందించారు. దివ్య తల్లిదండ్రులు ఎస్పీని కలిసి.. ఆమె మరణంపై పలు అనుమాలు వ్యక్తం చేశారు. తమ కుమార్తె చదువులో చురుకైందని, ఎస్సెస్సీలో స్కూల్ ఫస్టు వచ్చిందని, ఎంతో ధైర్యవంతురాలని.. ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఎవరో హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రించడానికి రైలుపట్టాలపై పడేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. కేసును సివిల్ పోలీసులకు అప్పగించి, దర్యాప్తు వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. కాగా, దివ్య జూన్ 30 తేది రాత్రి 8.20 గంటల వరకు జహీరాబాద్‌లో ఉన్నట్లు ప్రత్యక్షసాక్షుల కథనం ద్వారా తెలుస్తోంది.
రోడ్డు మరమ్మతుల కారణంగా జహీరాబాద్– కోటమర్పల్లి వయా మద్రి, గురుజువాడ బస్సు రద్దు చేశారు. దీంతో రాత్రి సమయంలో దివ్య జహీరాబాద్ నుంచి మద్రికి ఒంటరిగా వచ్చే అవకాశం లేదు. బహుశా తెలిసిన వ్యక్తుల వెంట వచ్చి మోసపోయి ఉంటుందని భావిస్తున్నారు. ఆ రోజు రాత్రి ఎవరితో వచ్చిందో తెలిస్తే కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. రైలు పట్టాలపై శవం లభించడంతో రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. తల్లిదండ్రులను, స్థానికంగా కొందరిని విచారించారు. అయితే, పూర్తిస్థాయిలో దర్యాప్తు జరపాలంటే పోస్టుమార్టం నివేదికలు తప్పనిసరి అవసరమని రైల్వే పోలీసులు స్పష్టం చేస్తున్నారు.
Advertisement
Advertisement