జహీరాబాద్‌ రైల్వే స్టేషన్ కు కొత్త హంగులు  | Construction of Second Platform at Zahirabad Railway Station | Sakshi
Sakshi News home page

జహీరాబాద్‌ రైల్వే స్టేషన్ కు కొత్త హంగులు

Published Sun, Nov 3 2019 11:36 AM | Last Updated on Sun, Nov 3 2019 11:37 AM

Construction of Second Platform at Zahirabad Railway Station - Sakshi

స్టేషన్ లో నిర్మిస్తున్న ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి

జహీరాబాద్‌ : స్థానిక రైల్వే స్టేషన్‌ ఆధునికీకరణ పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. సుధీర్ఘ కాలం తర్వాత పెండింగ్‌ పనులు చేపట్టారు. జిల్లాలోనే ఏకైక అతిపెద్దది కావడంతో మోడల్‌ రైల్వే స్టేష¯Œ గా తీర్చిదిద్దేందుకు 2010 సంవత్సరంలో నిధులు మంజూరు చేశారు. అప్పట్లో స్టేషన్‌ లో పలు అభివృద్ధి పనులు చేపట్టినా ప్రధాన పనులను మాత్రం పెండింగ్‌లో పెట్టారు. ఎట్టకేలకు తొమ్మిదేళ్ల తర్వాత పెండింగ్‌ పనులకు మోక్షం కలిగింది. ప్రస్తుతం సుమారు రూ.3 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రైల్వే స్టేషన్‌  జహీరాబాద్‌ పట్టణం నడి బొడ్డున ఉండడంతో రెండు వైపుల ప్రాంతాలకు వెళ్లి, రావడం కష్టంగా మారింది. అండర్‌ బ్రిడ్జిలను నిర్మించినా అవి ఏ మాత్రం సౌకర్యంగా లేకపోవడంతో ప్రజలు స్టేషన్‌ కు ఇరు వైపులా వెళ్లేందుకు రైల్వే ట్రాక్‌ను దాటుతున్నారు. 

వీటిని పరిగణలోకి తీసుకుని జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌ ప్రత్యేక చొరవ తీసుకుని పెండింగ్‌ పనులను పూర్తి చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ నెలాఖరు వరకల్లా ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి, రెండో ప్లాట్‌ఫాంలను ప్రారంభించి వినియోగంలోకి తెచ్చేందుకు అధికార యంత్రాంగం కృషి చేస్తోంది. ఈ మేరకు పనులు చురుకుగా సాగుతుండడంతో ప్రజలు, ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జహీరాబాద్‌ రైల్వే స్టేషన్‌ లో 26 రైళ్లు ఆగుతున్నాయి. ఆయా రైళ్లలో ప్రయాణించే వారికి ఇప్పుడు నిర్మిస్తున్న ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి, రెండో ప్లాట్‌ఫాం సౌకర్యంగా మారనుంది.
 
ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జితో తీరనున్న ఇబ్బందులు 
రైల్వే ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణంతో జహీరాబాద్‌ పట్టణ ప్రజల, ప్రయాణికుల ఇబ్బందులు తీరనున్నాయి. పట్టణంలోని రెండు వైపులా ప్రాంతాలకు రాక పోకలు సాగించే ప్రజలకు ఇక ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి ఉపయోగపడనుంది. నిలుచున్న రైళ్ల కింద నుంచి దాటుకుని వెళ్లే ఇబ్బందులు ఇక శాశ్వతంగా దూరం కానున్నాయి. పాఠశాల విద్యార్థులు, వ్యాపారులు, ఉపాధి కోసం ఆయా ప్రాంతాలకు వెళ్లే వారికి ఎంతో సౌకర్యంగా మారనుంది.  

రెండో ప్లాట్‌ఫాంతో సౌకర్యం 
ప్రస్తుతం స్టేషన్‌ లో ఒకే ప్లాట్‌ ఫాం ఉండడంతో రెండో ప్లాట్‌ఫాంపై నిలిచే రైళ్లలో నుంచి కిందిగి దిగే సమయంలో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. లగేజీని తీసుకుని కిందికి దిగే అవకాశం లేకపోవడంతో తప్పనిసరిగా ఇతరుల సహాయం తీసుకోవాల్సి వస్తోంది. రెండో ప్లాట్‌ఫాం నిర్మాణం జరగనందునే ఈ పరిస్థితి కలుగుతోంది. ప్రస్తుతం రెండో ప్లాట్‌ఫాం పనులు వేగంగా సాగుతున్నాయి. పనులు చివరి దశలో ఉన్నాయి. పనులు పూర్తయితే ప్రయాణికులు రైలులో నుంచి కిందికి దిగేందుకు సౌకర్యంగా మారనుంది.  
 
ఆకట్టుకుంటున్న బొమ్మలు  
జహీరాబాద్‌ రైల్వే స్టేషన్‌ కు రంగులద్దే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. హైదరాబాద్‌ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన 15 మంది కళాకారులు స్టేషన్‌ లో గోడలపై రంగులు, బొమ్మలు వేసే పనులు చేపట్టారు. పర్యావరణం, నీటి పొదుపు, ప్లాస్టిక్‌ వాడకం వద్దు, స్వచ్ఛ భారత్, పచ్చదనం తదితర వాటి ప్రాధాన్యతను చాటిచెప్పే విధంగా చిత్రాలు, నినాదాలతో తీర్చిదిద్దుతున్నారు. అంతే కాకుండా పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ఉపయోగపడే జంతువులు, పక్షుల చిత్రాలను ప్లాట్‌ ఫాం గోడలు, స్టేషన్‌  గోడలపై తీర్చిదిద్దుతున్నారు. రేల్వే స్టేషన్‌ కు వచ్చే ప్రయాణికులను ఆయా చిత్రాలు ఆకట్టుకోనున్నాయి. 

ప్రజల ఇబ్బందులు తీరనున్నాయి 
రైల్వే స్టేషన్‌ లో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి, రెండో ప్లాట్‌ఫాం నిర్మాణం పనులు త్వరలో పూర్తై వినియోగంలోకి రానున్నాయి. వీటిని పూర్తి చేయించేందుకు నేను ప్రత్యేక చొరవ తీసుకుని రైల్వే శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడా. రైల్వే శాఖ అధికారులు సానుకూలంగా స్పందించి పనులను ప్రారంభించారు. పనులు త్వరలో పూర్తి చేయించి ప్రారంభింపజేసి ప్రజలకు ఉపయోగంలోకి తెస్తాం. ప్రయాణికులతో పాటు పట్టణ ప్రజలకు ఎంతో సౌకర్యం కలుగనుంది.  –బీబీ పాటిల్,జహీరాబాద్‌ ఎంపీ  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement