బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పుష్పగుచ్ఛం అందిస్తున్న ఎంపీ బీబీ పాటిల్
సాక్షి, న్యూఢిల్లీ: బీఆర్‌ఎస్‌కు చెందిన జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీజేపీలో చేరారు. శుక్రవారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ ఛుగ్, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్, సీనియర్ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి, కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌లు పాటిల్‌కు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. కాగా, జహీరాబాద్ లోక్‌సభ టికెట్‌పై పాటిల్‌కు నడ్డా హామీ ఇచ్చినట్లు తెలిసింది. బీజేపీలో చేరడానికి ముందే బీబీ పాటిల్ బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు.
జహీరాబాద్ ఎంపీగా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ.. బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌కు తన రాజీనామా లేఖను పంపారు. ఈ సందర్భంగా పాటిల్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో తన నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి జరిగిందని, అయితే మరింత అభివృద్ధిని కాంక్షిస్తూ తాను బీజేపీలో చేరానని తెలిపారు. బీఆర్‌ఎస్ మునుగుతున్న నావ అని, త్వరలో ఆ పార్టీకి చెందిన మరికొందరు నేతలు బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని కె.లక్ష్మణ్ తెలిపారు. కాగా, బీఆర్‌ఎస్ బీబీబీ.. అంటే బాప్, బేటా, బిటియా (తండ్రి, కుమారుడు, కూతురు) పార్టీగా మారిందని తరుణ్ ఛుగ్ ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment