జహీరాబాద్‌లోని ట్రైడెంట్ చక్కెర కర్మాగారం
- పంట మద్దతు ధరపై ఏటా ఇదే పరిస్థితి
- సకాలంలో ప్రకటించని ట్రైడెంట్ యాజమాన్యం
- క్రషింగ్‌కు సమీపిస్తున్న గడువు
- టన్నుకు రూ.2,600 చెల్లిస్తామంటూ లీకులు
- రూ.2,723 చెల్లించాలని రైతుల డిమాండ్
- స్పష్టత కరువు..ఆందోళనలో రైతులు
జహీరాబాద్: చెరకు మద్దతు ధర నిర్ణయంలో ఏటా ఇదే పరిస్థితి. క్రషింగ్ సీజన్ సమీపిస్తున్నా జహీరాబాద్‌లోని ‘ట్రైడెంట్’ యాజమాన్యం మద్దతు ధర ప్రకటించక పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. టన్నుకు రూ.2,600 చెల్లిస్తామంటూ లీకులిచ్చింది. ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదంటున్నారు రైతులు. గత ఏడాదికి సంబంధించి సరఫరా చేసిన చెరకు పంటకు ఇప్పటికీ మద్దతు ధరను నిర్ణయించకపోవడం రైతులను నిరాశకు గురిచేస్తోంది. ధరలో కోత విధించడం, బకాయిలు పేరుకుపోవడం వంటి సమస్యలతో ఈ ప్రాంత రైతులు సతమతమవుతున్నారు.
చెరకు మద్దతు ధర కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. గతంలో 8.5 చక్కెర శాతంపై కనీస మద్దతు ధరను ప్రకటించేవారు. 2010లో ఈ విధానాన్ని మార్చారు. ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ కింద 9.5 శాతం రికవరీపై కనీస మద్దతు ధరను ప్రకటిస్తున్నారు. కర్మాగారంలో రికవరీ శాతం పెరిగితే దానికి అనుగుణంగా ధరను లెక్కకట్టి యాజమాన్యాలు రైతులకు చెల్లించాలి. ఇంతకన్నా తక్కువ ధరకు కొనడానికి యాజమాన్యం, ఏజెంట్లు ఒప్పందం చేసుకోరాదని క్లాస్ 3(2) చట్టం చెబుతోంది.
1961 షుగర్ కేన్ రెగ్యులేషన్ ఫర్ పర్చేజ్ అండ్ సప్లై యాక్టు ప్రకారం ఫాం 3లో రైతులతో, రైతు సంఘాలతో యాజమాన్యం చేసుకున్న చెరకు ఒప్పందంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధర గాని, రైతులు చేసుకున్న ఒప్పందంలో ఏది ఎక్కువ ధర ఉంటే దాన్ని అమలు చేయాలి. 2015-16 క్రషింగ్ సీజన్‌కు గాను కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరను పరిగణనలోకి తీసుకుంటే కర్మాగారానికి వచ్చిన రికవరీ ఆధారంగా కొనుగోలు పన్ను రూ.60 కలుపుకుని రైతులకు టన్నుకు రూ.2,723 మేర ధరను యాజమాన్యం చెల్లించాల్సి ఉంటుందని రైతులు అంటున్నారు.
ఇప్పటివరకు రైతులకు టన్నుకు రూ.2,455 మాత్రమే యాజమాన్యం చెల్లించింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం నికరంగా రూ.208 రావాలని, పర్చేజ్ ట్యాక్సు కలుపుకుంటే టన్నుకు రూ.268 మేర యాజమాన్యం చెల్లించాలని వారంటున్నారు. సంగారెడ్డిలోని గణపతి షుగర్స్ యాజమాన్యం ప్రభుత్వం నిర్ణయించిన ధరను పరిగణనలోకి తీసుకుని రికవరీ ఆధారంగా చెరకు ధరను చెల్లించిందని వారు గుర్తు చేస్తున్నారు.
రూ.8 కోట్ల మేర బకాయిలు
కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరను పరిగణనలోకి తీసుకుంటే రైతులకు ట్రైడెంట్ యాజమాన్యం రూ.8 కోట్ల మేర బకాయి పడింది. 2015-16 క్రషింగ్ సీజన్‌కు కర్మాగారం 3 లక్షల టన్నుల మేర చెరకు పంటను గానుగాడించింది. ఈ సీజన్‌కు కర్మాగారం 11శాతం చక్కెర రికవరీ సాధించింది. బకాయిల చెల్లింపులో మాత్రం ఏటా యాజమాన్యం జాప్యం చేస్తోందని రైతులు వాపోతున్నారు. 2014-15 సీజన్‌కు సంబంధించిన బకాయిలను 2015-16 క్రషింగ్ సీజన్‌ను ప్రారంభించిన అనంతరమే చెల్లించిందని వారు గుర్తుచేశారు. ఇలా బకాయిలను ఏడాది పొడుగునా చెల్లించకుండా ఉంటే తామెలా బతకాలని రైతులు ప్రశ్నిస్తున్నారు.
బిల్లుల చెల్లింపులోనూ జాప్యం
క్రషింగ్ నిమిత్తం చెరకును కర్మాగారానికి తరలించినా నెలల తరబడి బిల్లులను చెల్లించకుండా యాజమాన్యం దాటవేస్తోందని రైతులు చెబుతున్నారు. 2015-16 క్రషింగ్ సీజన్ అక్టోబర్‌లో ప్రారంభిస్తున్నా బిల్లులను చెల్లించే విషయానికి వస్తే ఉదాసీనంగా వ్యవహరిస్తోందని విమర్శిస్తున్నారు. చెరకును సరఫరా చేసిన 14 రోజుల్లోగా యాజమాన్యం బిల్లులు చెల్లించాలని క్లాజ్ 3ఏ నిబంధన ఉన్నా అమలు కావడం లేదు.
బిల్లులను సకాలంలో చెల్లించని పక్షంలో 15శాతం వడ్డీ లెక్కకట్టి ఇవ్వాలని షుగర్ కేన్ చట్టం చెబుతోంది. జనవరిలో మొదటి విడత కింద టన్నుకు రూ.2,225 మేర బిల్లులను చెల్లించిందని, వడ్డీని మాత్రం ఎగ్గొట్టిందని వారంటున్నారు. క్లాజ్ 8 ప్రకారం భూమి శిస్తు మాదిరిగా యాజమాన్యం వద్ద వసూలు చేసే వీలుందని రైతులు గుర్తుచేస్తున్నారు.
పన్ను విషయంలో స్పష్టతేదీ?
చెరకు కొనుగోలు పన్ను విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదు. కొనుగోలు పన్ను కింద ప్రభుత్వం రైతులకు ప్రభుత్వం టన్నుకు రూ.60 చెల్లిస్తుంది. ఈ ఏడాదికి సంబంధించి ఇప్పటి వరకు జీఓ విడుదల కాలేదు. దీన్ని పరిగణనలోకి తీసుకోకుండా యాజమాన్యం చెరకు ధరను చెల్లించాలి. ఇప్పటివరకు పర్చేజ్ ట్యాక్సును కలుపుకుని యాజమాన్యం చెరకు ధరను చెల్లిస్తూ వస్తోంది. ప్రభుత్వం ఈ బాధ్యతను యాజమాన్యానికి ఇవ్వడం వల్లే ఇలా చేస్తోందనే విమర్శలున్నాయి. ప్రభుత్వమే నేరుగా పర్చేజ్ ట్యాక్సును తమ ఖాతాలో జమచేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
పూర్తి బిల్లులను సాధించుకుంటాం
కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరను పరిగణనలోకి తీసుకోవడంతోపాటు కర్మాగారం సాధించిన రికవరీ ఆధారంగా చెరకు బిల్లలను సాధించుకుంటాం. యాజమాన్యం తక్కువ ధర చెల్లించి చేతులు దులుపుకోవాలనే ప్రయత్నం చేస్తోంది. దీనిపై న్యాయ పోరాటం చేస్తాం. అధికారుల అసమర్థత వల్లే రైతులు దయనీయ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. రైతులు అప్పులు చేసి పంటలను పండించుకుంటున్నారు. దీన్ని యాజమాన్యం గుర్తించి షుగర్ కేన్ చట్టం ప్రకారం బిల్లులు చెల్లించాలి. - ఎం.పాండురంగారెడ్డి, రైతు సంఘం నాయకుడు, జహీరాబాద్
చట్ట ప్రకారం ధర చెల్లించాల్సిందే
షుగర్ కేన్ యాక్టు ప్రకారం యాజమాన్యం రైతులకు ధర ఇవ్వాల్సిందే. ఇందులో మినహాయింపు ఉండదు. యాజమాన్యానికి రూ.45 మేర సబ్సిడీ రావాల్సి ఉంది. ప్రస్తుతం మార్కెట్లో చక్కెర ధర బాగానే ఉంది. ప్రభుత్వం నిర్ణయించిన ధరను పరిగణనలోకి తీసుకుని, కర్మాగారం సాధించిన రికవరీ మేరకు రైతులకు బిల్లులు చెల్లించాలి. బిల్లుల చెల్లింపులో జాప్యంపై గత జూన్‌లో యాజమాన్యానికి నోటీసులు జారీ చేశాం. - రాజశేఖర్, కేన్ రెగ్యులేటర్ ఇన్‌స్పెక్టర్
ట్రైడెంట్ చక్కెర కర్మాగారం, జహీరాబాద్