నీటి కోసం రోడ్డెక్కిన మహిళలు
ఖాళీ బిందెలతో రాస్తారోకో
తాండూరు రోడ్డుపై స్తంభించిన రాకపోకలు
జహీరాబాద్ : చిన్నహైదరాబాద్ గ్రామ పంచాయతీ పరిధిలో గల రాంనగర్ కాలనీ, జహీరాబాద్ మున్సిపల్ పరిధి కింద ఉన్న 12వ వార్డులో గల డ్రైవర్స్ కాలనీ ప్రజలు మంచినీటి సమస్య తీర్చాలని ఆందోళనకు దిగారు. ఆదివారం జహీరాబాద్ నుంచి తాండూరు వెళ్లే రోడ్డుపై గంట పాటు మహిళలు ఖాళీ బిందెలతో బైఠాయించారు. దీంతో వాహనాల రాక పోకలకు ఆటంకం కలి గింది. తమ కాలనీల్లో తీవ్ర మంచినీటి సమస్య నెలకొన్నా ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను తీర్చాలని పలు మార్లు ప్రజా ప్రతినిధులను కోరినా ఫలితం లేదని తెలిపారు. విధి లేని పరిస్థితుల్లో ఆందోళనకు దిగాల్సి వచ్చిందన్నారు. నీటి సమస్యను తీర్చేందుకు గాను కొత్తగా బోరును తవ్వించాలని డిమాండ్ చేశారు. అంత వరకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందించాలన్నారు. లేనట్లయితే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. నీటి సమస్యను పరిష్కరించేందుకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామని ఆయా కాలనీలకు చెందిన ముఖ్యులు సూచించడమేకాకుండా.. వారు ఫోన్‌లో అధికారులను సంప్రదించారు. సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని అధికారులు హామీ ఇవ్వడంతో ప్రజలు ఆందోళన విరమించారు.