rasta roco
-
దగాపడ్డ పత్తి రైతు
సాక్షి, పెద్దపల్లి: పత్తి రైతుకు మళ్లీ కష్టకాలం వచ్చింది. ఆరుగాలం కష్టపడి, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొని పండించిన పంటకు కనీస ధర రాని దుస్థితి నెలకొంది. వ్యాపారులు కుమ్మక్కై రైతులను దోచుకునేందుకు సిద్ధమయ్యారు. నాణ్యత, తేమ శాతం సాకుతో క్వింటాల్‌కు రూ. వెయ్యి మాత్రమే ఇస్తామంటూ నిలువు దోపిడీకి తెరతీశారు. దీంతో గుండెలు మండిన రైతులు నిరసనకు దిగారు. పత్తి ఏరడానికైన కూలీ కూడా రావడం లేదంటూ రోడ్డెక్కారు. పత్తిని తగలబెట్టడమో.. మందు తాగి చావడమో తప్ప తమకు గత్యంతరం లేదని ఆందోళన చేశారు. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ దీనికి వేదికైంది. పత్తి కొనుగోళ్లు చేపట్టిన తొలిరోజే.. తేమ శాతం ఎక్కువగా ఉందంటూ సీసీఐ చేతులెత్తేయగా, వ్యాపారులు కుమ్మక్కై దారుణంగా ధర తగ్గించడంతో రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. నిర్ఘాంతపోయిన రైతన్న పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో సోమవారం సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అయితే రైతులు తెచ్చిన పత్తిలో తేమ 12 శాతం కన్నా అధికంగా ఉందంటూ సీసీఐ అధికారులు కొనుగోలు చేయలేదు. సాంకేతిక లోపం పేరుతో ఆన్‌లైన్‌నూ పక్కన పెట్టారు. ఇదే అదనుగా వ్యాపారులు దోపిడీకి దిగారు. క్వింటాల్‌కు రూ.1,000 నుంచి రూ.1,500 ఇస్తామని రైతులకు షాకిచ్చారు. మొదటి రోజు మార్కెట్‌కు 297 మంది రైతులు పత్తి తీసుకురాగా.. 89 మంది రైతులకు సంబంధించిన పత్తికి రూ.1,000 నుంచి రూ.1,500 వరకే ధర నిర్ణయించారు. దీంతో రైతులు ఆందోళనకు దిగారు. రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేశారు. పెద్దపల్లి టౌన్ సీఐ వచ్చి రైతులకు నచ్చజెప్పి ఆందోళనను విరమింపచేశారు. అటు వ్యాపారులు కూడా రూ.2 వేల పైన చెల్లించి పత్తి కొనుగోలుకు ముందుకువచ్చారు. ఇదో పెద్ద కుట్ర వాస్తవానికి పత్తి మద్దతు ధర క్వింటాల్‌కు రూ.4,320. నాణ్యత లేకుంటే సాధారణంగా రూ.2 వేల నుంచి రూ. 3 వేల వరకు చెల్లిస్తుంటారు. కానీ సోమవారం పెద్దపల్లి మార్కెట్లో వ్యాపారులు కేవలం రూ.1,000 మాత్రమే చెల్లిస్తామనడం వెనుక కుట్ర ఉందని రైతులు పేర్కొంటున్నారు. కొంతమంది మిల్లర్లు, మార్కెట్లోని వ్యాపారులు కుమ్మక్కై కావాలనే ధరను తగ్గించేశారని.. దాంతో రైతులు మార్కెట్దాకా రాకుండా మిల్లర్లకే విక్రయిస్తారన్న ఉద్దేశంతో కుట్ర పన్నారని మండిపడుతున్నారు. మార్కెట్లో తాము ధర పెంచి కొనుగోలు చేసినా.. తర్వాత మిల్లర్లు కొనకపోతే నష్టపోతామని, అందుకే వాళ్లు చెప్పినట్లు చేస్తున్నామని ఓ వ్యాపారి బహిరంగంగానే పేర్కొనడం గమనార్హం. ఖమ్మంలోనూ ఆందోళన ఖమ్మం వ్యవసాయం: పత్తికి తగిన ధర కల్పించాలని, సీసీఐ ద్వారా కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో రైతులు, వామపక్షాల నేతలు సోమవారం ధర్నా చేశారు. తేమ నిబంధనను సడలించి పత్తి కొనుగోళ్లు చేయించాలని.. క్వింటాల్‌కు రూ.7 వేలు మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. పత్తి కొనుగోళ్లలో అన్యాయం, సీసీఐ కేంద్రం ప్రారం భంపై మాట్లాడేందుకు రైతులు, నేతలు సోమవారం యార్డులోని కార్యాలయానికి వెళ్లగా సూపర్వైజర్లు మాత్రమే ఉండడంతో.. మార్కెట్ అధికారి రావాలంటూ ధర్నాకు దిగారు. మార్కెట్ కార్యదర్శి, సీసీఐ అధికారి యార్డుకు చేరుకుని రైతులు, నేతలతో మాట్లాడారు. రెండు రోజుల్లో రైతు సంఘాల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. మా రక్తం తాగుతరా? ఈ మార్కెట్ ఎందుకు?.. మమ్మల్ని మోసం చేయడానికా? మా రక్తం తాగడానికి పెట్టిన్రా.. క్వింటాల్‌కు వెయ్యి ఇస్తరా.. పత్తి ఏరడానికి కూలీలకైన ఖర్చు కూడా కాదు.. ఇగ మందు తాగి చావడమే దిక్కు.. – మహిళా రైతు దామ కనకవ్వ, పెద్దపల్లి జిల్లా సబ్బితం నాణ్యత లేనందునే.. ఇటీవలి వర్షాలతో పత్తి నాణ్యత దెబ్బతిన్నది. దాంతో ధర పెట్టడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. కొద్దిరోజులైతే మళ్లీ రైతులు అనుకున్నంత ధర వస్తుంది.. – గంట రమేశ్, ట్రేడర్, పెద్దపల్లి -
నీటి కోసం రోడ్డెక్కిన మహిళలు
ఖాళీ బిందెలతో రాస్తారోకో తాండూరు రోడ్డుపై స్తంభించిన రాకపోకలు జహీరాబాద్ : చిన్నహైదరాబాద్ గ్రామ పంచాయతీ పరిధిలో గల రాంనగర్ కాలనీ, జహీరాబాద్ మున్సిపల్ పరిధి కింద ఉన్న 12వ వార్డులో గల డ్రైవర్స్ కాలనీ ప్రజలు మంచినీటి సమస్య తీర్చాలని ఆందోళనకు దిగారు. ఆదివారం జహీరాబాద్ నుంచి తాండూరు వెళ్లే రోడ్డుపై గంట పాటు మహిళలు ఖాళీ బిందెలతో బైఠాయించారు. దీంతో వాహనాల రాక పోకలకు ఆటంకం కలి గింది. తమ కాలనీల్లో తీవ్ర మంచినీటి సమస్య నెలకొన్నా ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను తీర్చాలని పలు మార్లు ప్రజా ప్రతినిధులను కోరినా ఫలితం లేదని తెలిపారు. విధి లేని పరిస్థితుల్లో ఆందోళనకు దిగాల్సి వచ్చిందన్నారు. నీటి సమస్యను తీర్చేందుకు గాను కొత్తగా బోరును తవ్వించాలని డిమాండ్ చేశారు. అంత వరకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందించాలన్నారు. లేనట్లయితే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. నీటి సమస్యను పరిష్కరించేందుకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామని ఆయా కాలనీలకు చెందిన ముఖ్యులు సూచించడమేకాకుండా.. వారు ఫోన్లో అధికారులను సంప్రదించారు. సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని అధికారులు హామీ ఇవ్వడంతో ప్రజలు ఆందోళన విరమించారు. -
పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలి
ఖమ్మం: పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలంటూ సీపీఐ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరు మండల కేంద్రంలో, ఖమ్మం జిల్లా వేలేరుపాడులో పెద్ద ఎత్తున గురువారం రాస్తారోకో చేపట్టారు. పోలవరం బాధితులకు న్యాయం జరిగేలా ప్యాకేజీ ప్రకటించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమాల్లో పశ్చిమ గోదావరి సీపీఐ నేతలు వసంతరావు, సీతారామిరెడ్డి, వేలేరుపాడుకు చెందిన ఎండీ మునీరు, కారం గారెయ్య, ప్రసాద్, నిర్వాసితులు పాల్గొన్నారు. (వేలేరుపాడు) -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
నిజాంసాగర్ : మండల కేంద్రానికి సమీపంలోని పెద్దపూల్ బ్రిడ్జిపై శనివారం మధ్యాహ్నం జరిగిన రో డ్డు ప్రమాదంలో నీరుడి సాయిలు (30) మరణించాడు. బ్రిడ్జిపై ఉన్న గుంతల వల్లే ప్రమాదం సంభవించిందని ఆరోపిస్తూ మృతుడి బంధువు లు రాస్తారోకో చేశారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మాగి గ్రామానికి చెందిన నీరుడి సాయిలు గాయత్రి కర్మాగారంలో పర్మినెంట్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. కర్మాగారంలో డ్యూటీ ముగిసిన తర్వాత ఇంటి నుంచి బైక్‌పై మండల కేంద్రానికి బయలుదేరాడు. మండల కేంద్రానికి సమీపంలో ఉన్న మంజీర నది బ్రిడ్జిపైన ఏర్పడిన గుంతల్లోంచి బైక్ వెళుతున్నప్పుడు కిందపడిపోయాడు. ఆ సమయంలో ఎదురుగా వచ్చిన వాహనం అతడి తల, వీపు భాగాలపైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మరణించాడు. ఆ దారిలో వెళ్తున్న వారు దీనిని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై అంతిరెడ్డి సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి వచ్చారు. ప్రమాదానికి కారణమైన వాహనాల కోసం గాలించారు. మృతుడి బంధువుల రాస్తారోకో పెద్దపూల్ బ్రిడ్జిపై జరిగిన రోడ్డు ప్రమాదానికి కారణమైన వారిని పట్టుకోవాలని డిమాండ్ చేస్తూ మృతుడి బంధువులు, మాగివాసులు సం ఘటన స్థలం వద్ద రాస్తారోకోకు దిగారు. సాయి లు మృతికి ఆర్‌ఆండ్‌బీ అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. బ్రిడ్జిపై గుంతలను పూడ్చాలని పలుమార్లు కోరినా పట్టించుకోలేదన్నారు. మృతుడి కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాలుగు గంటలపాటు ఆందోళన కొనసాగింది. బాన్సువాడ రూరల్ సీఐ రమణారెడ్డి అక్కడి చేరుకొని బాధితులతో మాట్లాడి, శాంతింపజేశా రు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
సర్కారు తీరుపై రైతుల ఆగ్రహం
రాయపర్తి : మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా వ్యవసాయానికి ఎనమిది గంటల కరెంట్ అందిస్తామని చెప్పిన ప్రభుత్వం కనీసం రెండు గంటలైనా ఇవ్వకుండా కోతలు విధించడాన్ని నిరసిస్తూ రైతులు సోమవారం మండల కేంద్రంలోని వరంగల్-ఖమ్మం రాష్ట్ర ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. పంట రుణాలను మాఫీ చేస్తామని చెప్పి నేటికీ అమలు చేయడంలేదంటూ బ్యాంక్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ఆందోళనలో సుమారు 500 మంది రైతులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాస్తారోకో కారణంగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న ఎస్సై భరత్‌సుమన్ అక్కడికి చేరుకుని రైతులను సముదాయిం చడానికి ప్రత్నించినా ఫలితం దక్కలేదు. న్యాయం జరిగే వరకు ఇక్కడినుంచి కదిలేది లేదని భీష్మించారు. దీంతో ఎస్సై ట్రాన్స్‌కో అధికారులకు ఫోన్ చేసి కరెంటు కోతల విషయం మాట్లాడగా ఇందులో తమ ప్రమేయం ఏమీలేదని, ప్రభుత్వం ఎలా చెబితే అలా చేస్తామని స్పష్టం చేశారు. అయితే సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతామని చెప్పినా ఆందోళన విరమించలేదు. దీంతో ఎస్సై కొంతమందిని అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో రైతులతోపాటు ఎంపీపీ గుగులోతు విజయనామా, సర్పంచ్‌లు ఎండీ.ఉస్మాన్, రెంటాల గోవర్ధన్‌రెడ్డి, కంది ప్రభాకర్, బిల్లా వెంకట్‌రెడ్డి, సోమిరెడ్డి, పర్పాటి రవీందర్‌రెడ్డి, శ్రీనివాస్, బొమ్మినేని రవీందర్‌రెడ్డి, సరికొండ బుచ్చిరెడ్డి, యాకయ్య తదితరులు పాల్గొన్నారు. రాస్తారోకో, ధర్నా సందర్భంగా మొత్తం 18 మంది రైతులను అరెస్ట చేసినట్లు ఎస్సై భరత్‌సుమన్ చెప్పారు.