రాయపర్తి : మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా వ్యవసాయానికి ఎనమిది గంటల కరెంట్ అందిస్తామని చెప్పిన ప్రభుత్వం కనీసం రెండు గంటలైనా ఇవ్వకుండా కోతలు విధించడాన్ని నిరసిస్తూ రైతులు సోమవారం మండల కేంద్రంలోని వరంగల్-ఖమ్మం రాష్ట్ర ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. పంట రుణాలను మాఫీ చేస్తామని చెప్పి నేటికీ అమలు చేయడంలేదంటూ బ్యాంక్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ఆందోళనలో సుమారు 500 మంది రైతులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
రాస్తారోకో కారణంగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న ఎస్సై భరత్‌సుమన్ అక్కడికి చేరుకుని రైతులను సముదాయిం చడానికి ప్రత్నించినా ఫలితం దక్కలేదు. న్యాయం జరిగే వరకు ఇక్కడినుంచి కదిలేది లేదని భీష్మించారు. దీంతో ఎస్సై ట్రాన్స్‌కో అధికారులకు ఫోన్ చేసి కరెంటు కోతల విషయం మాట్లాడగా ఇందులో తమ ప్రమేయం ఏమీలేదని, ప్రభుత్వం ఎలా చెబితే అలా చేస్తామని స్పష్టం చేశారు.
అయితే సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతామని చెప్పినా ఆందోళన విరమించలేదు. దీంతో ఎస్సై కొంతమందిని అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో రైతులతోపాటు ఎంపీపీ గుగులోతు విజయనామా, సర్పంచ్‌లు ఎండీ.ఉస్మాన్, రెంటాల గోవర్ధన్‌రెడ్డి, కంది ప్రభాకర్, బిల్లా వెంకట్‌రెడ్డి, సోమిరెడ్డి, పర్పాటి రవీందర్‌రెడ్డి, శ్రీనివాస్, బొమ్మినేని రవీందర్‌రెడ్డి, సరికొండ బుచ్చిరెడ్డి, యాకయ్య తదితరులు పాల్గొన్నారు. రాస్తారోకో, ధర్నా సందర్భంగా మొత్తం 18 మంది రైతులను అరెస్ట చేసినట్లు ఎస్సై భరత్‌సుమన్ చెప్పారు.
సర్కారు తీరుపై రైతుల ఆగ్రహం
Published Tue, Aug 5 2014 2:04 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
Advertisement
Advertisement