జహీరాబాద్ టౌన్: సంఘ విద్రోహశక్తులను అరికట్టడానికి.. నేరాలను నియంత్రించడానికి పోలీసు వ్యవస్థను పటిష్టపరుస్తున్నట్లు రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. శుక్రవారం జహీరాబాద్‌కు వచ్చిన సందర్భంగా స్థానిక అతిథిగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నేరాల సంఖ్య పెరుగుతోందని, నేరం జరిగిన వెంటనే దోషులను పట్టుకునేందుకు ఆధునిక పరిజ్ఞానంతోకూడిన వాహనాలను సమకూరుస్తున్నామన్నారు.
ఈ మేరకు 1650 ఇన్నోవా కార్లు,1,500 మోటారు సైకిళ్లను కొనుగోలు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. హైదారాబాద్, సైబరాబాద్‌తో పాటు జిల్లాలకు కూడా ఈ వాహనాలను అందజేస్తామన్నారు. ప్రశాంత వాతావరణం ఉన్న చోటే అభివృద్ధి జరుగుతుందని, ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జహీరాబాద్ ప్రాంతంలో శాంతిభద్రతల సమస్య లేదని, సరిహద్దులో ఉన్నందున పోలీసు నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. గత ప్రభుత్వాల కారణంగా కరెంట్ సమస్య తలెత్తిందని ఆరోపించారు.
గత ప్రభుత్వాలకు ముందుచూపు లేకపోవడంతో కరెంట్ కష్టాలు వచ్చాయన్నారు. వారు చేసిన తప్పిదాన్ని కప్పిపుచ్చుకునేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రెండేళ్లవరకు కరెంట్ కష్టాలుంటాయని ఎన్నికల సమయంలోనే సీఎం కేసీఆర్ స్పష్టం చేశారని ఆయన గుర్తుచేశారు. కరెంట్ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఈ మేరకు చత్తీస్‌గఢ్ నుంచి కరెంట్ కొనుగోలుకు ప్రయత్నాలు జరుతున్నాయని చెప్పారు.
చత్తీస్‌గఢ్‌లో కొత్త గ్రిడ్ ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. రూ. లక్షలోపు రైతు రుణాలను తప్పకుండా మాఫీ చేస్తామని హోం మంత్రి పేర్కొన్నారు. రుణాల రీ షెడ్యూల్‌పై రిజర్వు బ్యాంకు మెలికలు పెట్టడం సరికాదన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా రుణ మాఫీ చేసి తీరుతామన్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందాలన్న ఉద్దేశంతోనే ఈ నెల 19న సర్వే నిర్వహిస్తోందన్నారు. గత ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను దోపిడీ చేశాయని ఆరోపించారు. హోంమంత్రి మొదటిసారి జహీరాబాద్ కు రావడంతో టీఆర్‌ఎస్ నాయకులు ఆయనను ఘనంగా సన్మానించారు.
పోలీసు వ్యవస్థ పటిష్టతకు చర్యలు
Published Sat, Aug 9 2014 12:22 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement
Advertisement