Narsimhareddy Naini
-
‘పాకిస్తాన్ దాడిని వాడుకొని మోదీ గెలిచారు’
సాక్షి, రామగుండం(కరీంనగర్) : ‘పాకిస్తాన్ దాడిని వాడుకొని మోదీ గెలిచాడు. కేంద్రంలో బీజేపీకి భారీ మెజార్టీ రావడం దురదృష్టకరం’ అని రాష్ట్ర మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వేస్టేషన్ ప్రాంగణంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి రావడంతో రైల్వే, ఎన్టీపీసీ పూర్తిగా ప్రయివేటుపరం అయ్యే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం పబ్లిక్ ప్రయివేట్ పార్టనర్షిప్(పీపీపీ) విధానాన్ని ప్రోత్సహిస్తోందని తెలిపారు. రాబోయే రోజుల్లో అన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటుపరం కానుండడంతో కార్మిక రంగం మేల్కొనాల్సిన అవసరం ఉందన్నారు. గోదావరిఖని విప్లవాలకు పురిటిగడ్డని, తాను సింగరేణి కార్మిక సంఘాల్లో 30 ఏళ్లు పనిచేశానని, సమీపంలోని కేశోరాం కర్మాగారంలో కూడా ఐదేళ్లు ఏకగ్రీవంగా తనను కార్మిక సంఘం నాయకుడిగా ఎన్నుకున్నారని గుర్తు చేశారు. దేశంలోనే రైల్వే వ్యవస్థ అతిపెద్ద కీలకమైన ట్రాన్స్‌పోర్టేషన్ వ్యవస్థ అని దీనిని ప్రైవేటీకరిస్తే సామాన్యుడికి రైలు ప్రయాణం ఖరీదవుతుందని అన్నారు. -
అసద్‌కు కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీకి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘మంచి స్నేహితుడు, లోక్‌సభ సభ్యుడు అసద్ సాబ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరు సంతోషం, ఆరోగ్యం, ప్రశాంతతతో సుదీర్ఘకాలం ప్రజా సేవలో కొనసాగాలి’ అని కేటీఆర్ ట్విట్టర్లో పోస్టు చేశారు. నాయినికి పుట్టినరోజు శుభాకాంక్షలు మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డికి రెండురోజులు ఆలస్యంగా కేటీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘మాజీ హోం మంత్రి, ఎమ్మెల్సీ నాయిని నర్సింహారెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మంచి ఆరోగ్యం, ప్రశాంతతతో మరెన్నో ఏళ్లు మీరు ప్రజా సేవలో కొనసాగాలి సర్’ అని ట్విట్టర్లో పోస్టు చేశారు. నాయిని ఆదివారం పుట్టినరోజు జరుపుకున్నారు. -
పోలీసు వ్యవస్థ పటిష్టతకు చర్యలు
జహీరాబాద్ టౌన్: సంఘ విద్రోహశక్తులను అరికట్టడానికి.. నేరాలను నియంత్రించడానికి పోలీసు వ్యవస్థను పటిష్టపరుస్తున్నట్లు రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. శుక్రవారం జహీరాబాద్‌కు వచ్చిన సందర్భంగా స్థానిక అతిథిగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నేరాల సంఖ్య పెరుగుతోందని, నేరం జరిగిన వెంటనే దోషులను పట్టుకునేందుకు ఆధునిక పరిజ్ఞానంతోకూడిన వాహనాలను సమకూరుస్తున్నామన్నారు. ఈ మేరకు 1650 ఇన్నోవా కార్లు,1,500 మోటారు సైకిళ్లను కొనుగోలు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. హైదారాబాద్, సైబరాబాద్‌తో పాటు జిల్లాలకు కూడా ఈ వాహనాలను అందజేస్తామన్నారు. ప్రశాంత వాతావరణం ఉన్న చోటే అభివృద్ధి జరుగుతుందని, ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జహీరాబాద్ ప్రాంతంలో శాంతిభద్రతల సమస్య లేదని, సరిహద్దులో ఉన్నందున పోలీసు నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. గత ప్రభుత్వాల కారణంగా కరెంట్ సమస్య తలెత్తిందని ఆరోపించారు. గత ప్రభుత్వాలకు ముందుచూపు లేకపోవడంతో కరెంట్ కష్టాలు వచ్చాయన్నారు. వారు చేసిన తప్పిదాన్ని కప్పిపుచ్చుకునేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రెండేళ్లవరకు కరెంట్ కష్టాలుంటాయని ఎన్నికల సమయంలోనే సీఎం కేసీఆర్ స్పష్టం చేశారని ఆయన గుర్తుచేశారు. కరెంట్ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఈ మేరకు చత్తీస్‌గఢ్ నుంచి కరెంట్ కొనుగోలుకు ప్రయత్నాలు జరుతున్నాయని చెప్పారు. చత్తీస్‌గఢ్‌లో కొత్త గ్రిడ్ ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. రూ. లక్షలోపు రైతు రుణాలను తప్పకుండా మాఫీ చేస్తామని హోం మంత్రి పేర్కొన్నారు. రుణాల రీ షెడ్యూల్‌పై రిజర్వు బ్యాంకు మెలికలు పెట్టడం సరికాదన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా రుణ మాఫీ చేసి తీరుతామన్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందాలన్న ఉద్దేశంతోనే ఈ నెల 19న సర్వే నిర్వహిస్తోందన్నారు. గత ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను దోపిడీ చేశాయని ఆరోపించారు. హోంమంత్రి మొదటిసారి జహీరాబాద్ కు రావడంతో టీఆర్ఎస్ నాయకులు ఆయనను ఘనంగా సన్మానించారు. -
తెలంగాణ ఘనత సోనియాదే
మహేశ్వరం: తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన ఘనత కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకే దక్కిందని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. సీమాంధ్రులు తెలంగాణ రాకుండా అడ్డుకున్నా చివరికి న్యాయమే గెలిచిం దని ఆయన పేర్కొన్నారు. గురువారం మండలంలోని రావిర్యాల గేటు శ్రీశైలం రహదారి సమీపంలోని ద్రాక్ష రైతుల సంఘం ఆధ్వర్యంలో మంత్రి నాయినికి, స్థానిక ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డికి అభినందన, సన్మాన సభ నిర్వహిం చారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కృషి చేస్తుందని ఉద్ఘాటిం చారు. రైతులకు లక్ష రూపాయల లోపు పంట రుణాలను మాఫీ చేస్తామని స్పష్టంచేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేరు స్తుందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెల కొన్న విద్యుత్ సమస్యను రెండేళ్లలో పరిష్కరిస్తామని చెప్పారు. మహేశ్వరంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హయాంలో రాష్ట్రంలో భారీగా వర్షాలు కురిశాయని పేర్కొన్నారు. ద్రాక్ష పం టల రైతులకు సబ్సిడీ రుణాలు అంది స్తామ్డన్నారు. ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. జిల్లాను గ్రేప్ హబ్‌గా తీర్చిదిద్దాలని సూచించారు. అంతకు ముందు జిల్లా ద్రాక్ష రైతులు తమ సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఆర్సీఐ డెరైక్టర్ జి.సతీష్‌రెడ్డి, అఫెడ డెరైక్టర్ బోధ మాధవరెడ్డి, ద్రాక్ష రైతుల సంఘం అధ్యక్షుడు రామ్మోహన్రావు, కందుకూరు, సరూర్‌నగర్ జెడ్పీటీసీ సభ్యులు ఎనుగు జంగారెడ్డి, జిల్లెల నరేందర్‌రెడ్డి, ద్రాక్ష రైతుల సంఘం నాయకులు సుదర్శన్‌రెడ్డి, అనిల్‌కుమార్, నర్సయ్య, పెద్దిరాజు, భగీరథ్‌సింగ్, సుధాకర్‌రెడ్డి, బుచ్చిరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, ద్రాక్ష రత్న అవార్డు గ్రహీత వెంకట్‌రెడ్డి, రత్నం గుప్తా, సోహైల్ పాల్గొన్నారు.