జహీరాబాద్ : తెల్లవారక ముందే వారి బతుకులు తెల్లారాయి. పీర్ల పండుగకు హాజరయ్యేందుకు ముంబై నుంచి వరంగల్‌కు వస్తుండగా.. మృత్యువు కంటెయినర్ రూపంలో ముగ్గురిని బలిగొంది. మృతుల్లో ఇద్దరు మంబై వాసులు కాగా మరో వ్యక్తి వరంగ ల్ జిల్లా వాసి. ఈ సంఘటన మండలంలోని బూచనెల్లి గ్రామ శివారులో 65వ జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.
చిరాగ్‌పల్లి ఎస్‌ఐ విజయ్‌కుమార్ కథనం మేరకు.. వరంగల్ జిల్లా రేగొండ మండలం గోడికొత్తపల్లి గ్రామానికి చెందిన గోవర్ధన్ (26) ముంబైలోని ఓ ప్రాంతంలో కల్లు దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. అయితే అదే ప్రాంతానికి చెందిన హసన్‌అలీ (48), అన్వర్ అన్సారి (43)లు మిత్రులు కాగా ఇద్దరూ కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చే సేవారు.
కాగా వీరికి గోవర్ధన్ తో పరిచయం ఏర్పడింది. అయితే గోవర్దన్ తన సొంత గ్రామంలో జరిగే పీర్ల పండుగకు హసన్, అన్సారీలను ఆహ్వానించాడు. దీంతో ముగ్గురూ కలిసి మంగళవారం రాత్రి పొద్దుపోయాక వరంగల్ జిల్లా రేగొండ మండలం గోడికొత్తపల్లికి కారులో బయలుదేరారు. అయితే వీరు ప్రయాణిస్తున్న కారు జహీరాబాద్ సమీపంలోని బూచనెల్లి గ్రామ శివారులోకి రాగానే ఎదురుగా వస్తున్న కంటెయినర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో కారును డ్రైవ్ చేస్తున్న హసన్‌అలీ, పక్కనే కూర్చొన్న వరంగల్‌కు చెందిన గోవర్ధన్‌లు అక్కడికక్కడే మృతి చెందారు.
వెనుక సీట్లో కూర్చొన్న అన్వర్ అన్సారి తీవ్రంగా గాయపడి జహీరాబాద్ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రమాద సమాచారం అందుకున్న జహీరాబాద్ సీఐ సాయి ఈశ్వర్‌గౌడ్, చిరాగ్‌పల్లి ఎస్‌ఐ విజయకుమార్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను జేసీబీ సాయంతో బయటకు తీయించారు. అయితే సంఘటనా స్థలంలో లభించిన రూ.3 లక్షలను పోలీసులు భద్రపర్చారు. ప్రమాద స్థలంలో లభించిన ఫోన్ నంబర్ల ఆధారంగా బాధిత కుటుంబాలకు సమాచారం అందించినట్లు వారు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ విజయ్‌కుమార్ తెలిపారు.
తెల్లారిన బతుకులు
Published Thu, Nov 6 2014 1:14 AM | Last Updated on Sat, Sep 2 2017 3:55 PM
Advertisement