National Highway 65
-
గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే ఏర్పాటు చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్ టు విజయవాడ జాతీయరహదారి(65)లో మల్కాపూర్ నుంచి విజయవాడ వరకు ఉన్న స్ట్రెచ్‌ను గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేగా చేయాలని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రధాని నరేంద్రమోదీని కోరారు. అత్యంత రద్దీ ఉన్న ఈ రూట్లో రోజురోజుకు వాహనాల సంఖ్య పెరుగుతున్న పరిస్థితులను దష్టిలో ఉంచుకొని వీలైనంత త్వరగా ప్రాజెక్టు చేపట్టాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలోని ప్రైవేట్ యూనివర్సిటీల దోపిడీ ఎక్కువైందని, ఈ విద్యాసంస్థలపై సీబీఐ, ఈడీ, ఇతర సంస్థలతో విచారణ చేయించాలని ప్రధాని మోదీని కోమటిరెడ్డి కోరారు. శుక్రవారం పార్లమెంట్లో ప్రధానిని కలిసిన సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. -
ఆరు లేన్లుగా ఎన్‌హెచ్-65.. నితిన్ గడ్కరీ హామీ!
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్–విజయవాడను కలిపే జాతీయ రహదారి-65ని ఆరు లేన్లుగా మార్చాలని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన సందర్భంగా భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గ సమస్యలపై ఎంపీ కోమటిరెడ్డి చర్చించారు. ఈ సందర్భంగా జాతీయ రహదారి-65పై వాహనాల రద్దీ పెరగడంతో నిత్యం ఎక్కడో ఒకచోట ప్రమాదాలు జరుగుతున్నాయని కేంద్రమంత్రి దృష్టికి కోమటిరెడ్డి తీసుకెళ్లారు. ఈ రహదారిపై గుర్తించిన 17 బ్లాక్స్పాట్ల మరమ్మ తు పనులను యుద్ధప్రాతిపదికన చేయాలని అభ్యర్థించారు. ఎన్‌హెచ్-65ను ఆరు లేన్లుగా మార్చే పనులను రాబోయే 2 నెలల్లోగా ప్రారంభిస్తామని గడ్కరీ హామీ ఇచ్చారని ఎంపీ కోమటిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇది కూడా చదవండి: టీఎస్ ఆర్టీసీ బంపర్ ఆఫర్.. -
హైదరాబాద్–విజయవాడ ఎన్‌హెచ్-65పై నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు..
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి నం.65లో నందిగామ సెక్షన్‌కు సంబంధించి ఇప్పటికే నాలుగు లేన్లు ఉన్నందున ప్రస్తుతానికి ఆరు లేన్ల అవసరం లేదని కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం లోక్‌సభలో తెలిపారు. ఎంపీలు కోమటిరెడ్డి, ఉత్తమ్‌ల ప్రశ్నలకు మంత్రి ఈ మేరకు సమాధానం ఇచ్చారు. ఈ సెక్షన్‌లోని 40 కి.మీ.నుంచి 221.5 కి.మీ. వరకు మొత్తం 181.5 కిలోమీటర్ల పొడవైన రహదారి నాలుగు లేన్లుగా ఉందని వివరించారు. ఇప్పుడు ఉన్న ట్రాఫిక్‌కు నాలుగు లేన్లు సరిపోతాయని పేర్కొన్నారు. కాగా 15వ కిలోమీటర్ నుంచి 40వ కిలోమీటర్ వరకు ఆరు లేన్ల పనులు ఇప్పటికే ప్రారంభమ య్యాయని తెలిపారు. అంతేగాక ఎన్‌హెచ్–65లోని నందిగామ–ఇబ్రహీంపట్నం–విజయవాడ సెక్షన్ (పొడవు 49.2 కి.మీ.)ను 2004లోనే నాలుగు లేన్లుగా చేశామన్నారు. ఎన్‌హెచ్ 65లో 17 ప్రమాదకర ప్రాంతాలను గుర్తించామన్నారు. అక్కడ పేవ్మెంట్ మార్కింగ్, సైన్ బోర్డులు, సోలార్ బ్లింకర్లు, రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు వంటి ప్రమాద నివారణ చర్యలను ఇప్పటికే పూర్తి చేశామన్నారు. అలాగే ప్రమాదాల నివారణకు శాశ్వత చర్యలు కూడా తీసుకుంటామని గడ్కరీ లిఖితపూర్వకంగా తెలిపారు. -
Hyderabad: రోడ్ టెర్రర్.. ఈ ఏడాది జాతీయ రహదారులపై 1,445 ప్రమాదాలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని జాతీయ రహదారులలో ఈ ఏడాదిలో ఇప్పటివరకు 1,445 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వీటిలో 679 మంది మరణించారు. 1,411 మందికి గాయాలయ్యాయి. సైబరాబాద్ ఎన్‌హెచ్‌లలో అత్యధికంగా ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఇక్కడ 672 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వీటిలో 178 ఘోరమైన ప్రమాదాలు కాగా.. మొత్తం 189 మంది మృత్యువాత పడ్డారు. 640 మందికి గాయాలయ్యాయి. రాచకొండ పరిధిలోని ఎన్‌హెచ్‌లలో 642 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. 162 మంది మరణించగా, 644 మంది క్షతగాత్రులయ్యారు. హైదరాబాద్ పరిధిలోని ఎన్‌హెచ్‌లలో 131 రోడ్డు ప్రమాదాలు జరగగా.. 28 మంది మరణించారు. 127 మంది క్షతగాత్రులయ్యారు. డేంజర్ జోన్ విజయవాడ హైవే.. ఈ ఏడాది అత్యధిక రోడ్డు ప్రమాదాలు విజయవాడ జాతీయ రహదారిలోనే జరిగాయి. ఎన్‌హెచ్– 65లో 527 యాక్సిడెంట్లు జరగగా.. 131 మంది మరణించారు. 500 మందికి గాయాలయ్యాయి. ఆ తర్వాత ఎక్కువ ప్రమాదాలు వరంగల్ రోడ్డులో చోటుచేసుకున్నాయి. ఎన్‌హెచ్–163లో 356 ప్రమాదాలు జరగగా.. 92 మంది మృత్యువాత పడ్డారు. 349 మంది క్షతగాత్రులయ్యారు. మేడ్చల్ రహదారిలోని ఎన్‌హెచ్–44లో 317 ప్రమాదాలలో 90 మంది మరణించగా, 302 మందికి గాయాలయ్యాయి. శ్రీశైలం జాతీయ రహదారి 765లో 229 యాక్సిడెంట్లలో 59 మంది చనిపోగా, 249 మంది గాయాల పాలయ్యారు. రాచకొండ పరిధిలోని జగదేవ్‌పూర్ ఎన్‌హెచ్–161లో ఈ ఏడాది 16 ప్రమాదాలలో ఏడుగురు మరణించగా.. 11 మంది గాయపడ్డారు. హైదరాబాద్‌లోని ఎన్‌హెచ్– 65లో అత్యధికం హైదరాబాద్ కమిషనరేట్‌లో అత్యధిక ప్రమాదాలు ఎన్‌హెచ్– 65లో, అత్యల్పంగా ఎన్‌హెచ్–163లో చోటు చేసుకున్నాయి. ఈ ఏడాది ఎన్‌హెచ్–65లో 46 రోడ్డు ప్రమాదాల్లో 15 మంది చనిపోగా, 37 మంది క్షతగాత్రులయ్యారు. ఎన్‌హెచ్–163లో 17 యాక్సిడెంట్లలో ఇద్దరు మరణించగా.. 18 మందికి గాయాలయ్యాయి. ఎన్‌హెచ్–44లో 42 ప్రమాదాల్లో 8 మంది మృత్యువాత పడ్డారు. 44 మందికి దెబ్బలు తగిలాయి. ఎన్‌హెచ్–765లో 26 ప్రమాదాలలో ముగ్గురు మరణించారు. 28 మందికి గాయాలయ్యాయి. చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం... 10 మంది దుర్మరణం సైబరాబాద్‌లో ఎన్‌హెచ్–44లో.. సైబరాబాద్‌లో అత్యధిక ప్రమాదాలు ఎన్‌హెచ్–44లో జరగగా.. అత్యల్పంగా ఎన్‌హెచ్–765లో జరిగాయి. ఎన్‌హెచ్–44లో 275 యాక్సిడెంట్లు కాగా 82 మంది చనిపోయారు. 258 మందికి గాయాలయ్యాయి. ఎన్‌హెచ్–765లో 106 ప్రమాదాలలో 35 మంది మృత్యువాత పడగా.. 105 మంది క్షతగాత్రులయ్యారు. ఎన్‌హెచ్–65లో 158 ప్రమాదాలు జరిగాయి. 42 మంది మరణించగా.. 143 మందికి గాయాలయ్యాయి. ఎన్‌హెచ్–163లో 133 ప్రమాదాలు కాగా.. 30 మంది మృత్యువాత పడగా.. 134 మంది క్షతగాత్రులయ్యారు. రాచకొండలోనూ ఎన్‌హెచ్–65లోనే.. రాచకొండలోనూ అత్యధిక ప్రమాదాలు ఎన్‌హెచ్–65లో, అత్యల్పంగా ఎన్‌హెచ్– 161లో జరిగాయి. ఎన్‌హెచ్–65లో 323 రోడ్డు ప్రమాదాలు జరగగా.. ఇందులో 67 ప్రమాదాలు ఘోరమైన ప్రమాదాలు. వీటిల్లో 74 మంది మరణించారు. 320 మంది గాయపడ్డారు. ఎన్‌హెచ్– 161లో 16 రోడ్డు ప్రమాదాలలో 7 మంది చనిపోగా.. 11 మంది గాయపడ్డారు. ఎన్‌హెచ్ 163లో ఈ ఏడాది 206 రోడ్డు ప్రమాదాలు జరగగా.. 60 మంది మరణించారు. 197 మంది క్షతగాత్రులయ్యారు. ఎన్‌హెచ్–765లో 97 రోడ్డు ప్రమాదాలలో 21 మంది మృత్యువాత పడగా.. 116 మందికి గాయాలయ్యాయి. ప్రమాదాలకు అనేక కారణాలు.. జాతీయ రహదారులపై డ్రైవర్లు 15 నుంచి18 గంటల పాటు ఏకధాటిగా డ్రైవింగ్ చేయడం ప్రమాదాలకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. చాలా మంది డ్రైవర్లకు ఎన్‌హెచ్‌లపై లైన్ డ్రైవింగ్ నిబంధనలు తెలియకపోవడమూ ఓ కారణమే. ఓవర్ టేక్ చేయడంతోనూ ప్రమాదాలు జరుగుతున్నాయి. మద్యం తాగి వాహనాలు నడపడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. – టి. శ్రీనివాస రావు, డీసీపీ, సైబరాబాద్ ట్రాఫిక్ -
ప్రాణాలను బలిగొంటున్న హైవే క్రాసింగ్‌లు
సాక్షి, మునగాల : తొమ్మిదవ నంబర్ జాతీయ రహదారిని నాలుగులేన్లుగా తీర్చిదిద్ది 65వ నంబర్ జాతీయ రహదారిగా మార్చిన జీఎమ్మార్ సంస్థ క్రాసింగుల ఏర్పాటులో నియమాలు పాటించకపోవడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుం టున్నాయి. ముఖ్యంగా మండల పరిధిలో 25కి.మీ. పరిధిలో విస్తరించి ఉన్న జాతీయ రహదారిపై ఉన్న ఏడు గ్రామాల్లో ఆరు ఆరు క్రాసింగులను ఏర్పాటు చేశారు. వీటిలో సగానికిపైగా అనధికారికంగా ఏర్పాటు చేసినవే ముఖ్యంగా మం డల కేంద్రంలో సివిల్ ఆసుపత్రి ఎదురుగా అనధికారికంగా ఉన్న క్రాసింగ్ ప్రమాదకరంగా మారింది. నెలకు ఐదారు ప్రమాదాలు ఈ ప్రాంతంలో జరుగుతూనే ఉన్నాయి. మండల పరిధిలోని జాతీయ రహదారిపై ఉన్న క్రాసింగ్‌ల వద్ద గత అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు ఐదు నెలల కాలంలో 16మంది మృత్యువాత పడగా 38మంది గాయపడిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఆకుపాముల శివారులో రిలయన్స్ బంక్ ఎదురుగా నిర్మించిన క్రాసింగ్ అత్యంత ప్రమాదకరంగా మారింది. ముకుందాపురం వద్ద బస్టాండ్ సెం టర్, హరిజన కాలనీ ఎదురుగా ఏర్పాటు చేసిన డివైడర్ల వద్ద ఎటువంటి సిగ్నల్స్ ఏర్పాటు చేయకపోవడంతో తరచూ ప్రమాదాలు నెలకొంటున్నాయి. ముకుందాపురం వద్ద జాతీయ రహదారిపై అండర్ పాస్ బ్రిడ్జీలతో పాటు సర్వీసు రోడ్లు ఏర్పాటు చేయాలని ఇటీవల గ్రామస్తులు 15రోజుల పాటు రిలే నిరాహారదీక్ష కూడా చేపట్టారు. జాతీయరహాదారిపై అతివేగంతో ప్రయాణించే వాహనాలు రోడ్డు దాటుతున్న పాదచారులు, ద్విచక్ర వాహనదారులను ఢీకొట్టడంతో వారి ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. నిత్యం జరిగే ప్రమాదాల వల్ల జాతీయ రహదారిపై ఉన్న గ్రామాల ప్రజలు భయాందోళనల మధ్య కాలం వెళ్లదీస్తున్నారు. సిగ్నల్స్ ఏర్పాటు చేయాలి జాతీయ రహదారిపై ఉన్న క్రాసింగ్‌ల వద్ద సిగ్నల్స్ ఏర్పాటు చేస్తే కొంత మేరకు ప్రమాదాలు నివారించే అవకాశముంది. సదరు క్రాసింగుల వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో ఆరాటపడే అధికార యంత్రాంగం అటు పిమ్మట జాగ్రత్త చర్యలు చేపట్టకపోవడం శోచనీయం. మండల కేంద్రంలో దాదాపు కి.మీ పొడవున ఉన్న ఫ్లైఓవర్ బ్రిడ్జిని ఏర్పాటు చేసిన జీఎమ్మార్ సంస్థ కేవలం ఒక అండర్ వెహికల్ పాస్ బ్రిడ్జిని ఏర్పాటు చేయడంతో మండల కేంద్రానికి వచ్చే ఆయా గ్రామాల ప్రజలు తప్పని పరిస్థితులలో క్రాసింగులను దాటి వెళ్లాల్సి వస్తుంది. ఫలితంగా ప్రమాదాలు జరగుతున్నాయి. అండర్‌పాస్ ఏర్పాటు చేయాలి జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన క్రాసింగుల వద్ద తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ముకుం దాపురం వద్ద జరిగే ప్రమాదాలు ఎక్కువ. తక్షణమే ముకుందాపురం వద్ద అండర్‌పాస్ బ్రిడ్జి నిర్మాణంతో పాటు ఇరువైపులా సర్వీసు రోడ్లు ఏర్పాటు చేయాలి – పందిరి నాగిరెడ్డి, ముకుందాపురం గ్రామస్తుడు సిగ్నల్స్ ఏర్పాటు చేయాలి ప్రస్తుతం జాతీయ రహాదారిపై ఉన్న క్రాసింగుల వద్ద సిగ్నల్స్ ఏర్పాటు చేస్తే కొంతమేర ప్రమాదాలు అరికట్టవచ్చు, అదే విధంగా గ్రామాల సరిహద్దులలో వాహానాల వేగాన్ని అదుపు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. హైవేపై క్రాసింగ్‌ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. – మాదంశెట్టి మహేష్ -
కారులో పారిశ్రామికవేత్త మృతదేహం
-
కారులో ఎన్నారై మృతదేహం
సాక్షి, విజయవాడ : నందిగామ మండలం ఐతవరం సమీపంలో 65 నెంబర్ జాతీయ రహదారి పక్కన ఓ అనుమానాస్పద మృతదేహం లభ్యమైంది. కారులో రక్తపు మడుగులో పడివున్న మృతదేహాన్ని పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున గుర్తించారు. మృతుడు విజయవాడకు చెందిన పారిశ్రామికవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరాంగా నిర్ధారించారు. జయరాం ఓ ఫార్మా కంపెనీ ఎండీగా విధులు నిర్వర్తిస్తున్నాడని పోలీసులు తెలిపారు. కారులో మద్యం సీసాలు లభ్యమయ్యాయని, జయరాం హత్యకు గురైనట్టు నిర్ధారణకు వచ్చినట్టు పోలీసులు వెల్లడించారు. సీసీటీవీ ఆధారంగా దర్యాప్తు ముమ్మురం చేశామని తెలిపారు. జయరాం కారును మరో వ్యక్తి నడుపుతున్నట్టు తేలిందని పేర్కొన్నారు. జయరాం తలపై బలమైన గాయం ఉందని వివరించారు. కారు నడిపిన వ్యక్తి పరారీలో ఉన్నాడని, అతన్ని పట్టుకుంటామని తెలిపారు. మృతుని బ్యాంక్ లావాదేవీలు, కాల్ డేటాపై దృష్టి పెట్టామని వెల్లడించారు. జయరాంకు ఎవరితోనైనా ఆస్తి తగాదాలున్నాయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. రెండు రోజుల క్రితం జయరాం హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లినట్టు వాచ్మెన్ చెప్పాడని అన్నారు. గతరాత్రి రాత్రి 12గంటల సమయంలో రోడ్డు ప్రక్కన కారులో మృతదేహం ఉందన్న సమాచారం అందడంతో ఘటనాస్థలానికి చేరుకున్నామని తెలిపారు. అమెరికాలో ఉన్న మృతుని భార్యాపిల్లలకు సమాచారమిచ్చామని, జయరాం నెల క్రితమే అమెరికా నుంచి స్వదేశానికి వచ్చాడని పోలీసులు వెల్లడించారు. -
పంతంగి టోల్‌ప్లాజా వద్ద సంక్రాంతి రద్దీ
చౌటుప్పల్: సంక్రాంతి పండుగ కోసం తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలు తమ స్వస్థలాలకు బయలుదేరటంతో 65వ నంబరు జాతీయ రహదారి రద్దీగా మారింది. నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్ద శుక్రవారం వాహనాలు బారులు తీరాయి. రద్దీ పెరగడంతో వాహనదారులు ఇబ్బంది పడకుండా టోల్ సిబ్బంది, పోలీసులు చర్యలు తీసుకున్నారు. శనివారం తెల్లవారుజాము నుంచి ట్రాఫిక్ మరింత పెరిగే అవకాశం ఉంది. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
చౌటుప్పల్ (మునుగోడు) : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన మండలంలోని ధర్మోజిగూడెం గ్రామ స్టేజి వద్ద 65వ నెంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని జైకేసారం గ్రామానికి చెందిన జోగు రవి (22)లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. లారీని ధర్మోజిగూడెం స్టేజి వద్ద ఉన్న టైర్ల పంచర్ దుకాణం వద్ద నిలిపాడు. అనంతరం ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్లేందుకు రోడ్డు క్రాస్ చేస్తుండగా హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆటో వేగంగా వచ్చి ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన రవి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు. -
కొత్త ఆప్.. ఎన్‌హెచ్-65
కోదాడటౌన్ : ప్రమాదాలు జరిగినపుడు క్షతగాత్రుల ప్రా ణాలు కాపాడటానికి మొదటి అరగంట సమయం ఎంతో కీలకం. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులకు వైద్యసౌకర్యాలు అందజేయడం వల్ల విలువైన ప్రాణాలు కాపాడవచ్చని వైద్యులు చెపుతున్నారు. ప్రమాదాలకు కారణమవుతున్న 65వనంబర్ జాతీయ రహదారిపై తక్షణం స్పందించేందుకు హైదరాబాద్‌కు చెందిన మైఅఫిసియెట్ అనే సంస్థ కార్పొరేట్ సోషల్ రెస్సాన్స్‌బిలిటీ (సీఎస్ఆర్) కింద నూతనంగా ‘ఎన్‌హెచ్-65’ పేరుతో నూతన మొబైల్ అప్లికేషన్‌ను అభివృద్ధి చేసింది. దీనిని మరో రెండువారాల్లోగా అందుబాటులోకి ఈ సంస్థ తేనుంది. ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న వారు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎలాపని చేస్తుందంటే... ఈ ఆండ్రాయిడ్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న వారు విజయవాడ నుంచి హైదరాబాద్ వరకు 270 కిలోమీటర్ల దూరం ఉన్న జాతీయ రహదారిపై ప్రయాణించేటప్పుడు ఎక్కడ ప్రమాదానికి గురైన, పక్కవారు ప్రమాదానికి గురైన వెంటనే చిన్న బటన్ నొక్కడం ద్వారా కంట్రోల్‌రూంకు సమాచారం అందుతుంది. కేవలం సమాచారమే కాకుండా ప్రమాద చిత్రాన్ని, ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని కూడ తెలుపుతుంది. అంతే కాకుండా అంబులెన్స్ అక్కడకు ఎలా చేరుకోవాలో కూడ గైడ్ చేస్తుంది. హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇచ్చినపుడు ప్రమాదం వివరాలు వివరించడంతోపాటు ప్రమాదం జరిగిన ప్రదేశం చెప్పడం.. వారు దానిని నమోదు చేసుకొని స్పందించే వరకు విలువైన సమయం వృథా అవుతుంది. దీని వల్ల అలాంటి విలువైన సమయం వృథా కాకుండా కాపాడుకోవచ్చని వైద్యులు, ఆప్ డెవలపర్స్ చెపుతున్నారు. అదే విదంగా నేరాలు జరిగినపుడు, కిడ్నాప్ వంటి సంఘటనలు జరిగినపుడు బాధితులు తక్షణమే దీని ద్వారా పోలీసులకు, కంట్రోల్ రూంకు సమాచారం ఇవ్వవచ్చు. దీనికి వచ్చే స్పందనను బట్టి ఇతర హైవేలలో దీనిని ఉపయోగంలోకి తేనున్నారు. దీంతోపాటు ఇదే సంస్థ మరో కొత్త ఆప్‌ను డ్రైవర్ల కోసం అభివృద్ధి చేస్తోం ది. ఈ అప్లికేషన్ ఉన్న డ్రైవర్ స్పీడ్ లిమిట్స్ దాటగానే ఇది హెచ్చరిస్తుంది. ప్రమాదం జరిగే అవకాశం ఉందని తగు జాగ్రత్తలు తీసుకోవాలని డ్రైవర్‌ను హెచ్చరిస్తుందని, దీనిని కూడా త్వరలోనే అందుబాటులోకి తేనున్నట్లు కంపెనీ ప్రతినిధులు చెపుతున్నారు. ఎంతో ఉపయోగం ప్రమాదాలు జరిగినపుడు వెంటనే తగిన సమాచారం అందడంలో కొంత ఆలస్యం అవుతుంది. దీనివల్ల క్షతగాత్రులు విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు. అందుబాటులోకి రానున్న నూతన అప్ ద్వారా వెంటనే ప్రమాద స్థలానికి చేరుకొనే అవకాశం ఉంది. అందే విధంగా దోపిడీలు జరిగినపుడు కూడ దీనిని ఉపయోగించుకొనే అవకాశం పరిశీలించాలి. -
కారు, బైక్ ఢీ: ఒకరి మృతి
కృష్ణా(ఇబ్రహీంపట్టణం): బైక్‌ను కారు ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు ప్రాణాలొదిలాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్టణం మండలంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. మండలంలోని దొనబండ గ్రామంలో 65 నంబరు జాతీయ రహదారిపై బైక్‌పై వెళుతున్న షేక్ జానీ(22)ను వెనక నుంచి కారు ఢీకొట్టింది. దీంతో జానీ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిది మండలంలోని జూపుడి గ్రామంగా పోలీసులు నిర్ధరించారు. -
తెల్లారిన బతుకులు
జహీరాబాద్ : తెల్లవారక ముందే వారి బతుకులు తెల్లారాయి. పీర్ల పండుగకు హాజరయ్యేందుకు ముంబై నుంచి వరంగల్‌కు వస్తుండగా.. మృత్యువు కంటెయినర్ రూపంలో ముగ్గురిని బలిగొంది. మృతుల్లో ఇద్దరు మంబై వాసులు కాగా మరో వ్యక్తి వరంగ ల్ జిల్లా వాసి. ఈ సంఘటన మండలంలోని బూచనెల్లి గ్రామ శివారులో 65వ జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. చిరాగ్పల్లి ఎస్ఐ విజయ్‌కుమార్ కథనం మేరకు.. వరంగల్ జిల్లా రేగొండ మండలం గోడికొత్తపల్లి గ్రామానికి చెందిన గోవర్ధన్ (26) ముంబైలోని ఓ ప్రాంతంలో కల్లు దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. అయితే అదే ప్రాంతానికి చెందిన హసన్అలీ (48), అన్వర్ అన్సారి (43)లు మిత్రులు కాగా ఇద్దరూ కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చే సేవారు. కాగా వీరికి గోవర్ధన్ తో పరిచయం ఏర్పడింది. అయితే గోవర్దన్ తన సొంత గ్రామంలో జరిగే పీర్ల పండుగకు హసన్, అన్సారీలను ఆహ్వానించాడు. దీంతో ముగ్గురూ కలిసి మంగళవారం రాత్రి పొద్దుపోయాక వరంగల్ జిల్లా రేగొండ మండలం గోడికొత్తపల్లికి కారులో బయలుదేరారు. అయితే వీరు ప్రయాణిస్తున్న కారు జహీరాబాద్ సమీపంలోని బూచనెల్లి గ్రామ శివారులోకి రాగానే ఎదురుగా వస్తున్న కంటెయినర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో కారును డ్రైవ్ చేస్తున్న హసన్అలీ, పక్కనే కూర్చొన్న వరంగల్‌కు చెందిన గోవర్ధన్‌లు అక్కడికక్కడే మృతి చెందారు. వెనుక సీట్లో కూర్చొన్న అన్వర్ అన్సారి తీవ్రంగా గాయపడి జహీరాబాద్ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రమాద సమాచారం అందుకున్న జహీరాబాద్ సీఐ సాయి ఈశ్వర్‌గౌడ్, చిరాగ్పల్లి ఎస్ఐ విజయకుమార్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను జేసీబీ సాయంతో బయటకు తీయించారు. అయితే సంఘటనా స్థలంలో లభించిన రూ.3 లక్షలను పోలీసులు భద్రపర్చారు. ప్రమాద స్థలంలో లభించిన ఫోన్ నంబర్ల ఆధారంగా బాధిత కుటుంబాలకు సమాచారం అందించినట్లు వారు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విజయ్‌కుమార్ తెలిపారు.