సాక్షి, విజయవాడ : నందిగామ మండలం ఐతవరం సమీపంలో 65 నెంబర్ జాతీయ రహదారి పక్కన ఓ అనుమానాస్పద మృతదేహం లభ్యమైంది. కారులో రక్తపు మడుగులో పడివున్న మృతదేహాన్ని పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున గుర్తించారు. మృతుడు విజయవాడకు చెందిన పారిశ్రామికవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరాంగా నిర్ధారించారు. జయరాం ఓ ఫార్మా కంపెనీ ఎండీగా విధులు నిర్వర్తిస్తున్నాడని పోలీసులు తెలిపారు. కారులో మద్యం సీసాలు లభ్యమయ్యాయని, జయరాం హత్యకు గురైనట్టు నిర్ధారణకు వచ్చినట్టు పోలీసులు వెల్లడించారు.
సీసీటీవీ ఆధారంగా దర్యాప్తు ముమ్మురం చేశామని తెలిపారు. జయరాం కారును మరో వ్యక్తి నడుపుతున్నట్టు తేలిందని పేర్కొన్నారు. జయరాం తలపై బలమైన గాయం ఉందని వివరించారు. కారు నడిపిన వ్యక్తి పరారీలో ఉన్నాడని, అతన్ని పట్టుకుంటామని తెలిపారు. మృతుని బ్యాంక్ లావాదేవీలు, కాల్ డేటాపై దృష్టి పెట్టామని వెల్లడించారు. జయరాంకు ఎవరితోనైనా ఆస్తి తగాదాలున్నాయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. రెండు రోజుల క్రితం జయరాం హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లినట్టు వాచ్‌మెన్ చెప్పాడని అన్నారు. గతరాత్రి రాత్రి 12గంటల సమయంలో రోడ్డు ప్రక్కన కారులో మృతదేహం ఉందన్న సమాచారం అందడంతో ఘటనాస్థలానికి చేరుకున్నామని తెలిపారు. అమెరికాలో ఉన్న మృతుని భార్యాపిల్లలకు సమాచారమిచ్చామని, జయరాం నెల క్రితమే అమెరికా నుంచి స్వదేశానికి వచ్చాడని పోలీసులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment