సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని జాతీయ రహదారులలో ఈ ఏడాదిలో ఇప్పటివరకు 1,445 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వీటిలో 679 మంది మరణించారు. 1,411 మందికి గాయాలయ్యాయి. సైబరాబాద్ ఎన్‌హెచ్‌లలో అత్యధికంగా ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఇక్కడ 672 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వీటిలో 178 ఘోరమైన ప్రమాదాలు కాగా.. మొత్తం 189 మంది మృత్యువాత పడ్డారు. 640 మందికి గాయాలయ్యాయి. రాచకొండ పరిధిలోని ఎన్‌హెచ్‌లలో 642 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. 162 మంది మరణించగా, 644 మంది క్షతగాత్రులయ్యారు. హైదరాబాద్ పరిధిలోని ఎన్‌హెచ్‌లలో 131 రోడ్డు ప్రమాదాలు జరగగా.. 28 మంది మరణించారు. 127 మంది క్షతగాత్రులయ్యారు.
డేంజర్ జోన్ విజయవాడ హైవే..
ఈ ఏడాది అత్యధిక రోడ్డు ప్రమాదాలు విజయవాడ జాతీయ రహదారిలోనే జరిగాయి. ఎన్‌హెచ్– 65లో 527 యాక్సిడెంట్లు జరగగా.. 131 మంది మరణించారు. 500 మందికి గాయాలయ్యాయి. ఆ తర్వాత ఎక్కువ ప్రమాదాలు వరంగల్ రోడ్డులో చోటుచేసుకున్నాయి. ఎన్‌హెచ్–163లో 356 ప్రమాదాలు జరగగా.. 92 మంది మృత్యువాత పడ్డారు. 349 మంది క్షతగాత్రులయ్యారు. మేడ్చల్ రహదారిలోని ఎన్‌హెచ్–44లో 317 ప్రమాదాలలో 90 మంది మరణించగా, 302 మందికి గాయాలయ్యాయి. శ్రీశైలం జాతీయ రహదారి 765లో 229 యాక్సిడెంట్లలో 59 మంది చనిపోగా, 249 మంది గాయాల పాలయ్యారు. రాచకొండ పరిధిలోని జగదేవ్‌పూర్ ఎన్‌హెచ్–161లో ఈ ఏడాది 16 ప్రమాదాలలో ఏడుగురు మరణించగా.. 11 మంది
గాయపడ్డారు.
హైదరాబాద్‌లోని ఎన్‌హెచ్– 65లో అత్యధికం
హైదరాబాద్ కమిషనరేట్‌లో అత్యధిక ప్రమాదాలు ఎన్‌హెచ్– 65లో, అత్యల్పంగా ఎన్‌హెచ్–163లో చోటు చేసుకున్నాయి. ఈ ఏడాది ఎన్‌హెచ్–65లో 46 రోడ్డు ప్రమాదాల్లో 15 మంది చనిపోగా, 37 మంది క్షతగాత్రులయ్యారు. ఎన్‌హెచ్–163లో 17 యాక్సిడెంట్లలో ఇద్దరు మరణించగా.. 18 మందికి గాయాలయ్యాయి. ఎన్‌హెచ్–44లో 42 ప్రమాదాల్లో 8 మంది మృత్యువాత పడ్డారు. 44 మందికి దెబ్బలు తగిలాయి. ఎన్‌హెచ్–765లో 26 ప్రమాదాలలో ముగ్గురు మరణించారు. 28 మందికి గాయాలయ్యాయి.
చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం... 10 మంది దుర్మరణం
సైబరాబాద్‌లో ఎన్‌హెచ్–44లో..
సైబరాబాద్‌లో అత్యధిక ప్రమాదాలు ఎన్‌హెచ్–44లో జరగగా.. అత్యల్పంగా ఎన్‌హెచ్–765లో జరిగాయి. ఎన్‌హెచ్–44లో 275 యాక్సిడెంట్లు కాగా 82 మంది చనిపోయారు. 258 మందికి గాయాలయ్యాయి. ఎన్‌హెచ్–765లో 106 ప్రమాదాలలో 35 మంది మృత్యువాత పడగా.. 105 మంది క్షతగాత్రులయ్యారు. ఎన్‌హెచ్–65లో 158 ప్రమాదాలు జరిగాయి. 42 మంది మరణించగా.. 143 మందికి గాయాలయ్యాయి. ఎన్‌హెచ్–163లో 133 ప్రమాదాలు కాగా.. 30 మంది మృత్యువాత పడగా.. 134 మంది క్షతగాత్రులయ్యారు.
రాచకొండలోనూ ఎన్‌హెచ్–65లోనే..
రాచకొండలోనూ అత్యధిక ప్రమాదాలు ఎన్‌హెచ్–65లో, అత్యల్పంగా ఎన్‌హెచ్– 161లో జరిగాయి. ఎన్‌హెచ్–65లో 323 రోడ్డు ప్రమాదాలు జరగగా.. ఇందులో 67 ప్రమాదాలు ఘోరమైన ప్రమాదాలు. వీటిల్లో 74 మంది మరణించారు. 320 మంది గాయపడ్డారు. ఎన్‌హెచ్– 161లో 16 రోడ్డు ప్రమాదాలలో 7 మంది చనిపోగా.. 11 మంది గాయపడ్డారు. ఎన్‌హెచ్ 163లో ఈ ఏడాది 206 రోడ్డు ప్రమాదాలు జరగగా.. 60 మంది మరణించారు. 197 మంది క్షతగాత్రులయ్యారు. ఎన్‌హెచ్–765లో 97 రోడ్డు ప్రమాదాలలో 21 మంది మృత్యువాత పడగా.. 116 మందికి గాయాలయ్యాయి.
ప్రమాదాలకు అనేక కారణాలు..
జాతీయ రహదారులపై డ్రైవర్లు 15 నుంచి18 గంటల పాటు ఏకధాటిగా డ్రైవింగ్ చేయడం ప్రమాదాలకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. చాలా మంది డ్రైవర్లకు ఎన్‌హెచ్‌లపై లైన్ డ్రైవింగ్ నిబంధనలు తెలియకపోవడమూ ఓ కారణమే. ఓవర్ టేక్ చేయడంతోనూ ప్రమాదాలు జరుగుతున్నాయి. మద్యం తాగి వాహనాలు నడపడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి.
– టి. శ్రీనివాస రావు, డీసీపీ, సైబరాబాద్ ట్రాఫిక్
Comments
Please login to add a commentAdd a comment