
జహీరాబాద్ పట్టణం
- కొత్త రెవెన్యూ డివిజన్‌గా ప్రతిపాదన?
- వారంలో అధికారికంగా ప్రకటించే అవకాశం
- మొగుడంపల్లి కేంద్రంగా కొత్తగా మండలం
జహీరాబాద్: జహీరాబాద్ కేంద్రంగా కొత్తగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదించింది. వారంలో ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. రెవెన్యూ డివిజన్ ఏర్పాటుతో నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక సాకారం కానుంది. సర్కార్ కొత్త జిల్లాల ఏర్పాటుకు నిర్ణయించినందున అందులో భాగంగానే రెవెన్యూ డివిజన్ కేంద్రాలనూ ప్రతిపాదించింది.
జహీరాబాద్ కొత్త రెవెన్యూ డివిజన్ కిందకు నియోజకవర్గంలోని జహీరాబాద్, కోహీర్, ఝరాసంగం, న్యాల్‌కల్ మండలాలతో పాటు కొత్తగా ఏర్పడనున్న మొగుడంపల్లి మండలం చేరనుంది. జహీరాబాద్ పాత తాలూకా పరిధిలో ఉన్న రాయికోడ్ కూడా ఇదే డివిజన్ కిందకు రానుంది. ప్రస్తుతం ఈ మండలం ఆందోల్ నియోజకవర్గంలో ఉంది. ఇదే నియోజకవర్గంలోని మునిపల్లి మండలం కూడా జహీరాబాద్ రెవెన్యూ డివిజన్ కేంద్రం పరిధిలో చేరనుంది. ఈ రెండు మండలాలు జహీరాబాద్ నియోజకవర్గానికి సరిహద్దుగా ఉన్నాయి.
దూరాభారమైన సంగారెడ్డి
ప్రస్తుతం జహీరాబాద్ నియోజకవర్గం సంగారెడ్డి రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉంది. దీంతో పనుల నిమిత్తమై ప్రజలు సంగారెడ్డికి వెళ్లి వచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నారు. జహీరాబాద్ మండలంలోని గుడుపల్లి గ్రామం సంగారెడ్డికి 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. కోహీర్ మండలం మనియార్‌పల్లి గ్రామం 65 కిలో మీటర్లు, న్యాల్‌కల్ మండలంలోని హుసేన్‌నగర్ 85 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఇవేకాకుండా అనేక గ్రామాల ప్రజలు సంగారెడ్డి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఈనేపథ్యంలో జహీరాబాద్ రెవెన్యూ డివిజన్ డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది.
సాధన కోసం 50 రోజుల దీక్ష
జహీరాబాద్ కాకుండా మరో ప్రాంతానికి రెవెన్యూ డివిజన్ కేంద్రం తరలిపోతున్నదనే ప్రచారం నియోజకవర్గ ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసింది. దీంతో అఖిల పక్షాల నేతలు దీక్షలకు పూనుకున్నారు. 48 రోజుల పాటు రిలే దీక్షలు, రెండు రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేశారు.
కొత్త మండల కేంద్రంగా మొగుడంపల్లి
జహీరాబాద్ నియోజకవర్గంలోని మొగుడంపల్లి గ్రామం కొత్త మండల కేంద్రంగా అవతరించనుంది. గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రతిపాదించింది. జహీరాబాద్ మండలం 66 గ్రామాలతో అతి పెద్ద మండలంగా ఉన్నందున దీన్ని రెండుగా విభజించేందుకు నిర్ణయించారు. కాగా, మొగుడంపల్లి మండల కేంద్రంలో చేరేందుకు జహీరాబాద్‌కు దగ్గరగా ఉన్న గ్రామాల ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఏయే గ్రామాలను కొత్త మండల కేంద్రంలో చేర్చుతారనే విషయమై ఇంకా తేలాల్సి ఉంది.