అల్లం.. సస్యరక్షణతో మేలు | Ginger is good .. Correction | Sakshi
Sakshi News home page

అల్లం.. సస్యరక్షణతో మేలు

Published Fri, Sep 16 2016 9:03 PM | Last Updated on Mon, Sep 4 2017 1:45 PM

అల్లం.. సస్యరక్షణతో మేలు

అల్లం.. సస్యరక్షణతో మేలు

- తెగులు నివారిస్తే అధిక దిగుబడి
- ఎనిమిది నెలల పంట
- పెట్టుబడి అధికం
- ఏడీఏ వినోద్‌కుమార్‌ సలహాలు, సూచనలు


జహీరాబాద్‌ ప్రాంతంలో రైతులు అల్లం పంటను అధిక విస్తీర్ణంలో సాగుచేస్తున్నారు. సారవంతమైన ఎర్ర నేలల్లో అల్లం దిగుబడి అధికంగా ఉంటుంది. నీరు నిల్వ ఉండని నల్ల రేగడిలోనూ పండుతుంది. ఎనిమిది నెలలకు చేతి కొచ్చే ఈ పంట సాగుకు ఖర్చు అధికం. దిగుబడి కూడా అంతేస్థాయిలో ఉండడంతో రైతులు అల్లం సాగుపై ఆసక్తి చూపుతున్నారు. సేంద్రియ ఎరువుతో సాగుచేస్తూ యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు సాధ్యమని జహీరాబాద్‌ వ్యవసాయ శాఖ ఏడీ వినోద్‌కుమార్‌ (సెల్‌: 72888 24499) తెలిపారు.
- జహీరాబాద్‌ టౌన్‌

విత్తన రకాలు:
- అల్లంలో మారన్, మెదక్, సుపభ్ర, సురచి, సురభి, వైనాడ్, నదియా వంటి రకాలున్నాయి.
- జహీరాబాద్‌ ప్రాంత నేలలకు మారన్‌ రకం అనుకూలం.
- ఆరోగ్యవంతమైన తల్లి మొక్క నుంచి విత్తనం సేకరించాలి.
- విత్తనం పొడుగు 4.5 సె.మీ., 30 గ్రాముల బరువు రెండు నుంచి మూడు కన్నులండాలి.
- 500 గ్రాముల ఎం 45 మందును తగినంత నీటిలో కలిపి అల్లం విత్తనం నానబెట్టాలి.
- విత్తనం నుంచి చిన్న చిన్న మొలకలు మొలిచేంతవరకు అంటే రెండు రోజులపాటు ఆరబెట్టాలి.
- ఎకరానికి 8 క్వింటాళ్ల విత్తనం అవసరం.

సాగు విధానం:
- సారవంతమైన ఎర్ర, నల్ల రేగడి నేలలు అల్లం సాగుకు అనుకూలం.
- పొలాన్ని లోతువరకు దున్ని దుక్కిచేసుకోవాలి.
- ఎకరానికి 10 టన్నుల పశువుల (సేంద్రియ) ఎరువు, 300 నుంచి 500 కిలోల వేప పిండి, 200 గ్రాముల సింగల్‌ సూపర్‌ ఫాస్పేట్‌ 25 గ్రాముల మైక్రో న్యూట్రిన్స్‌ కలిపి తయారు చేసిన బెడ్‌పై వేయాలి.
- బెడ్‌ను తడిగా చేసి ముందుగా సిద్ధం చేసుకున్న విత్తనం నాటాలి.
- క్రమం తప్పకుండా నీటి తడులు పెడుతుండాలి.
- డ్రిప్‌ విధానం చాలా మంచిది.

యాజమాన్య పద్ధతులు:
- విత్తనం నాటిన 25-40 రోజుల మధ్య 3 కిలోల అమోనియా సల్ఫేట్‌, 0.5 గ్రాముల పాస్పరిక్‌ యాసిడ్, ఒక గ్రాము మిరెట్‌ ఆఫ్‌ పొటాష్‌లను కలిపి డ్రిప్‌ పైపుల ద్వారా నీటిలో వదలాలి.
- 40-100 రోజుల వ్యవధిలో 1.5 కిలోల యూరియా, 0.25 గ్రాముల పాస్పరిక్‌ యాసిడ్, ఒక గ్రాము మిరెట్‌ ఆఫ్‌ పొటాష్‌ కలిపి రెండు నెలల పాటు పంటకు అందించాలి.
- 100-150 రోజుల వ్యవధిలో యూరియా 1.5 కిలోలు, కాల్షియం నైట్రేట్‌ 1 కి.గ్రా, మ్యారిట్‌ ఆఫ్‌ పొటాష్‌ లేదా సల్ఫేట్‌ 1.5 గ్రాములు కలిపి నీటి ద్వారా అందించాలి.
- 150-180 రోజుల మధ్య మ్యారిట్‌ ఆఫ్‌ పొటాష్‌ ఒక గ్రాము వేయాలి.

తెగులు నివారణ:
రైజోమ్‌వాట్‌: ఈ తెగులు ఆశిస్తే మొక్క ఎండిపోతుంది. ఆకులు పసుపు రంగుగా మారుతాయి. ఈ తెగులు ఆశిస్తే మాటల్‌ ఎక్సిల్‌ 2 కి.గ్రా మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
రైజోమాప్లే:  ఈ తెగులు సోకితే అల్లం కుళ్లిపోతుంది. ఎకరానికి 4 కిలోల ఫ్లోరేడ్‌ గ్రానివల్స్‌ను వేయాలి.
లీఫ్‌ బైట్‌: ఈ తెగుల కారణంగా ఆకులపై చిన్న చిన్న మచ్చలు ఏర్పడతాయి. ఈ తెగులు ఆశించకుండా పొలాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. కార్బన్‌డిజమ్‌ కిలోను లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. అల్లం పంటలో అంతర పంటలు కూడా సాగుచేసుకోవచ్చు. ముఖ్యంగా మినుము, పెసర, మొక్కజొన్న తదితర పంటలు వేసుకోవచ్చు. మామిడి తోటల్లో కూడా అల్లం పంటను సాగుచేసుకోవచ్చు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement