జహీరాబాద్: తన ప్రియురాలిని కలుసుకునేందుకు భర్త అడ్డంకిగా మారాడని భావించిన ప్రియుడు ఆమె భర్తను హత్యచేయించినట్లు డీఎస్పీ గణపతి జాదవ్ తెలిపారు. శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ మేరకు వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. కోహీర్ మండలంలోని దిగ్వాల్ గ్రామానికి చెందిన సయ్యద్ కరీం(26)ను ఈనెల 2వ తేదీన మహ్మద్ ముబీన్(26) అనే నిందితుడు తన స్నేహితుడికి సుపారి ఇచ్చి హత్య చేయించాడు. నిందితుడు ముబీన్ మృతుడి భార్యతో కలిసి 1నుంచి 8వ తరగతి వరకు జహీరాబాద్ పట్టణంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు. ముబీన్ అప్పటి నుంచి మృతుడి భార్యను ప్రేమిస్తున్నాడు. మృతుడు కరీం బతుకుదెరువు గురించి సౌది దేశం వెళ్లిన సమయంలో అతడి భార్య జహీరాబాద్‌లోని తల్లిగారింటికి వచ్చింది. దీంతో ముబీన్ ఆమెతో కలిసేవాడు. సుమారు 8 నెలల క్రితం మృతుడు కరీం సౌదీ దేశం నుంచి పూర్తిగా తిరిగి వచ్చాడు.
ఆరు నెలల క్రితం జహీరాబాద్ పట్టణంలోని గార్డెన్ ఫ్యామిలీ దాబా సమీపంలో హైటెక్ ఎస్.ఎస్ రేయిలింగ్ షాపును పెట్టుకున్నాడు. అప్పటి నుంచి ముబీన్ తన ప్రియురాలిని కలుసుకునేందుకు ఇబ్బంది పడుతున్నాడు. దీంతో కరీంను ఎలాగైనా చంపించాలనే నిర్ణయానికి వచ్చాడు. ఇందుకు పథకం వేసి తన స్నేహితుడు అయిన జహీరాబాద్ పట్టణానికి చెందిన అబ్దుల్ సమద్(30)ని ఆశ్రయించాడు. సమద్ స్కూల్ బ్యాగులు కుట్టుకుని జీవనం సాగించేవాడు. అతడు వ్యాపారం సక్రమంగా చేయనందున అప్పుల పాలయ్యాడు. మద్యంకు బానిసగా మారాడు. ముబీన్ సమద్ బలహీనతలను గమనించి తన బాధలను చెప్పుకున్నాడు. కరీంను చంపినట్లయితే రూ.3లక్షలు సూపారి కింద ఇస్తానని, ఈ డబ్బుతో అప్పులు తీర్చుకోవడంతో పాటు వ్యాపారం అభివృద్ధి చేసుకోమని నమ్మబలికాడు. దీంతో సమద్ తన అప్పులు తీరుతాయని భావించి ముబీన్ సూచన మేరకు కరీంను హత్యచేసేందుకు నిర్ణయించుకున్నాడు. సమద్‌కు రూ.10వేలు ముట్టచెప్పాడు ముబీన్. ముబీన్‌ను నమ్మి ఈనెల 2వ తేదీన రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ముబీన్ తన పల్సర్ మోటారు సైకిల్‌పై సమద్‌ను కూర్చోబెట్టుకుని ఆదర్శనగర్ క్రాసింగ్ వద్ద విడిచి పెట్టాడు. సమద్ తన వెంట కొబ్బరి బొండాం నరికే కత్తిని ప్యాంట్‌లో పెట్టుకుని కరీం దుకాణం వద్దకు వెళ్లాడు.
వెళ్లి ఖాశీంపూర్ గ్రామంలో గల దర్గా వద్ద రేయిలింగ్ చేయాలని కరీంను రమ్మని కోరాడు. అతడిని బయటకు పిలిచి తన వెంట తెచ్చుకున్న కత్తితో గొంతుపై రెండు సార్లు నరికాడు. ఇంకా కొట్టబోగా చేతులు అడ్డం పెట్టాడు. దీంతో దాడిలో కరీం రెండు చేతులు, భుజానికి గాయాలయ్యాయి. కుడికాలుపై కూడా వేటు వేశాడు. దీంతో అక్కడే కుప్పకూలి మృతిచెందాడు. కరీం చనిపోయాడని నిర్దారించుకున్నాక వారు వేసుకున్న పథకం ప్రకారం.. బీదర్ క్రాస్ రోడ్డువద్ద ముబీన్, సమద్‌లు కలుసుకున్నారు. అనంతరం మోటారు సైకిల్‌పై కర్ణాటకలోని మన్నా ఎక్కెల్లికి పారిపోయారు. శుక్రవారం ఇరువురు తమ ఇళ్ల వద్దకు రాగా అరెస్టు చేసి మోటారు సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వివరించారు. మృతుడు కరీంకు 4 సంవత్సరాల క్రితం వివాహం కాగా, వారికి ఒక కుమార్తె ఉంది. ఈ సంఘటన మూడు కుటుంబాలను విచ్ఛిన్నం చేసింది. సమావేశంలో సీఐ సైదేశ్వర్, ఎస్సై రాజశేఖర్‌లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment