విలపిస్తున్న కుటుంబ సభ్యులు, బంధువులు
ప్రకాశం ,పెద్దదోర్నాల: కంభంలో కలకలం సృష్టించిన మోహన్‌రెడ్డి కిడ్నాప్ విషాదాంతమైంది. మూడు రోజులుగా కనిపించకుండాపోయిన మోహన్‌రెడ్డి దుండగుల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. మృతదేహం జిల్లా సరిహద్దు ప్రాంతంలోని రోళ్లపెంట గిరిజన గూడేనికి సమీపం రోడ్డు పక్కనున్న లోయలో సుమారు 50 అడుగుల దూరంలో పడి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. వివరాలు.. కంభం పట్టణంలో నివాసం ఉంటున్న మోహన్‌రెడ్డి ఈ నెల 29వ తేదీ నుంచి కనబడటం లేదన్న బంధువుల ఫిర్యాదుతో డివిజన్‌లోని పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. జగన్ అదృశ్యం వెనుక అన్ని కోణాలను లోతుగా దర్యాప్తు చేసిన పోలీసు అధికారులు మృతుడి భార్యతో పాటు అమెతో సన్నిహితంగా మెలిగే కంభం పట్టణానికి చెందిన ఓ డాక్టర్, వీరితో పాటు కర్నూలు పట్టణంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ బంధువును గురువారం పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో జగన్‌మోహన్‌రెడ్డిని హతమార్చినట్టు నిందితులు అంగీకరించినట్లు సమాచారం. ఈ క్రమంలో నిందితుల నుంచి నిజం రాబట్టిన పోలీసులు మృతదేహాన్ని పడేసిన ప్రాంతాన్ని శుక్రవారం ఉదయం గుర్తించారు. జిల్లా సరిహద్దు ప్రాంతం రోళ్లపెంట గిరిజన గూడెంలోని అటవీ శాఖకు సంబందించిన బేస్ క్యాంపునకు కూతవేటు దూరంలో కర్నూలు జిల్లా పరిధిలోకి వచ్చే అటవీ ప్రాంతలో జగన్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.(భర్త కిడ్నాప్..అదుపులో భార్య, వైద్యుడు..)
సంఘటన స్థలానికి భారీగా చేరుకున్న సన్నిహితులు
నల్లమల అటవీ ప్రాంతంలో మోహన్ మృతదేహం బయట పడిందన్న సమాచారం తెలియడంతో మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు పలు వాహనాల్లో భారీగా సంఘటన స్థలానికి చేరుకున్నారు. కర్నూల్ రహదారి పక్కన లోయలోని 50 అడుగుల దూరంలో మరింత లోతుకు దొర్లకుండా చెట్టు సాయంతో ఆగి ఉన్న జగన్‌మోహన్‌రెడ్డి మృతదేహాన్ని చూసి ఒక్కసారిగా గుండెలవిసేలా రోదించారు. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనకు నల్లమల అటవీ ప్రాంతం సజీవ సాక్ష్యంగా నిలిచింది. అనంతరం స్థానిక గిరిజనుల సహకారంతో పోలీసులు మృతదేహానికి రోడ్డుపై చేర్చి పోస్టుమార్టం కోసం మార్కాపురం ఏరియా వైద్యశాలకు తరలించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన మార్కాపురం డీఎస్పీ నాగేశ్వరరెడ్డి విలేకరులతో మాట్లాడారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో హత్య జరిగినట్లు భావిస్తున్నామని, మృతుడి భార్యతో పాటు, మరికొందరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. సంఘటన స్థలం వద్ద మార్కాపురం, యర్రగొండపాలెం సీఐలు శ్రీధర్‌రెడ్డి, మారుతీకృష్ణ, పెద్దదోర్నాల ఎస్‌ఐ సుబ్బారావు, ఏఎస్‌ఐ వెంకటేశ్వర్లు, కంభం ఏఎస్‌ఐ రంగస్వామి పర్యవేక్షించారు.
వైద్యుడే ప్రధాన నిందితుడు?
ఎల్.కోట గ్రామానికి చెందిన వైద్యుడు, జనసేన పార్టీ నాయకుడు డాక్టర్ బాలవెంకట నారాయణ గతేడాది కంభంలో వైద్యశాల ప్రారంభించాడు. వైద్యశాల సమీపంలో నివాసం ఉంటున్న మోహన్‌రెడ్డి భార్యతో వైద్యుడికి వివాహేతర సంబంధం ఏర్పడింది. జగన్ తన భార్యను మందలించినా ఆమె ప్రవర్తనలో మార్పు లేకపోవడంతో అక్కడి నుంచి స్థానిక సింధూరి సూపర్ మార్కెట్ వెనుక ఉన్న అపార్ట్‌మెంట్‌లోకి కాపురం మారారు. అయినా వైద్యుడికి ఆమెకు మధ్య ఉన్న వివాహేతర సంబంధం కొనసాగింది. మోహన్‌రెడ్డిని అడ్డు తొలిగించుకునేందుకు ఆయన భార్య రజని..డాక్టర్‌తో కలిసి పథకం ప్రకారం మోహన్‌ను కిడ్నాప్ చేసి హత్య చేసి పెద్దదోర్నాల సమీపంలోని అడవుల్లో మృతేహాన్ని పడేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన జనసేన పార్టీ కార్యకర్తలు శనివారం సాయంత్రం కంభంలోని వైద్యశాల వద్ద డాక్టర్ ఏర్పాటు చేసిన జనసేన పార్టీ ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు.
ఆస్పత్రి వద్ద జనసేన ఫ్లెక్సీలు తొలగిస్తున్నఆ పార్టీ కార్యకర్తలు
డబ్బు కోసమా?
మృధుస్వభావైన మోహన్‌రెడ్ది ఆర్థిక లావాదేవీలన్నీ భార్యకే అప్పగించేవాడని బంధువుల ద్వారా తెలిసింది. జేసీబీ, ట్రాక్టర్లు, తదితర వ్యాపారాలు చేస్తుండటంతో అధిక మొత్తంలోనే డబ్బులు వచ్చేవి, వచ్చిన ఆ డబ్బులన్నీ భార్య చేతికే ఇచ్చేవాడు. వాటితో పాటు ఆమె వద్ద సుమారు కేజీకిపైగా బంగారు నగలు కూడా ఉన్నాయి. హత్యకు గురైన మోహన్ పేరు మీద పెద్ద మొత్తంలో ఇన్సూరెన్స్‌లు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కిడ్నాప్ తర్వాత అనంతరం ఇంట్లోని నగలు, డబ్బులు సైతం కనబడక పోవడంతో హత్య వెనుక పెద్ద కుట్ర ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివాహేతర సంబంధం ఒక్కటే హత్యకు కారణమా, డబ్బు, ఆస్తి కోసం అంతమొందించారా అన్న వివరాలు పోలీసులు వెల్లడించాల్సి ఉంది. మార్కాపురం వైద్యశాలలో మృతదేహానికి శనివారం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment