దసరా పండుగ సందర్భంగా సొంత ప్రాంతాలకు, బంధువుల వద్దకు వెళ్లేవారు పోలీసులకు సమాచారం ఇచ్చి వెళ్లాలని మెదక్ జిల్లా జహీరాబాద్ ఎస్.ఐ. శివలింగం సూచించారు.
జహీరాబాద్ (మెదక్) : దసరా పండుగ సందర్భంగా సొంత ప్రాంతాలకు, బంధువుల వద్దకు వెళ్లేవారు పోలీసులకు సమాచారం ఇచ్చి వెళ్లాలని మెదక్ జిల్లా జహీరాబాద్ ఎస్.ఐ. శివలింగం సూచించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇళ్లకు తాళం వేసి వెళ్లడంతో దొంగతనాలు జరిగే అవకాశం ఉన్నందున సదరు ఇంటివారు పక్క ఇళ్లలోనివారికి చెప్పి వెళ్లాలని సూచించారు. కాలనీలకు సంబంధించి ఉండే కమిటీ సభ్యుల దృష్టికి కూడా తీసుకెళ్లాలన్నారు. తాళం కనబడకుండా డోర్ కర్టన్ వేయాలని ఆయన సూచించారు. ఎక్కువ రోజులు ఊరికి వెళ్లినట్లయితే పోలీసు స్టేషన్‌లో సమాచారం ఇచ్చి వెళ్తే ఆయా ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టేందుకు వీలుపడుతుందన్నారు. ఊరికి వెళ్లినట్లయితే ఇంట్లో బంగారు ఆభరణాలు, డబ్బులు పెట్టుకోవద్దన్నారు. వాటిని తమ వెంట తీసుకెళ్లాలని, లేనట్లయితే బ్యాంకులో వేసుకోవాలన్నారు.
అనుమాన వ్యక్తులు ఎవరైనా కాలనీల్లో సంచరించడం, బట్టల వ్యాపారం పేరుతో వచ్చే వారిపై అనుమానం ఉన్నా నంబర్-100 లేదా పోలీసు స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. అనామకులు ఎవరైనా బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి వివరాలు అడిగితే చెప్పరాదని సూచించారు. వారితో ఎక్కువగా మాట్లాడకుండా బ్యాంకులో వచ్చి కలుస్తాం అని సమాధానం చెబితే సరిపోతుందన్నారు. మహిళలు మెడలో బంగారం ఆభరణాలు వేసుకుని ఉంటే బయటకు వెళ్లే సమయంలో మెడను కొంగుతో కప్పుకోవాలని సూచించారు. మోటారు సైకిల్‌పై దొంగలు బంగారు ఆభరణాలు లాక్కెళ్లిన సంఘటనలు ఇటీవల చోటు చేసుకున్న సందర్భంలో ఎస్సై ఈ మేరకు పలు సూచనలు చేశారు. ప్రతి కాలనీలో పోలీసులు గస్తీ కూడా తిరుగుతారన్నారు. అయినా సెలవులో ఇతర ప్రాంతాలకు వెళ్లే వారు బంగారం, డబ్బు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు.