- మోదీ వద్దకు అఖిల పక్షాన్ని తీసుకెళ్లాలి
- తెలుగు రాష్ట్రాల సీఎంలను డిమాండ్ చేసిన ఆర్.కృష్ణయ్య
జహీరాబాద్: జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు దక్కినప్పుడే తగిన న్యాయం చేకూరుతుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. గురువారం మెదక్ జిల్లా జహీరాబాద్ వచ్చిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. 70వ స్వాతంత్య్ర వేడుకలు జరుపుకున్నా దేశంలోని 70కోట్ల మంది బీసీలకు తగిన ఫలాలు దక్కలేదన్నారు. విద్య, ఉద్యోగ రంగాల్లో తప్ప ఇతర రంగాల్లో కోటా దక్కడం లేదన్నారు. బీసీలకు సరైన వాటా కోసం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చొరవ తీసుకుని అఖిలపక్షం, బీసీ సంఘాలను ప్రధాని మోదీ వద్దకు తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా బీసీలకు ఏ రంగంలో కూడా తగిన న్యాయం జరగడం లేదన్నారు.
రాజకీయ రంగంలో కేవలం 12 శాతం మంది ఉన్నారన్నారు. ఉద్యోగ రంగంలో 9 శాతమే దక్కిందన్నారు. పార్లమెంట్‌లో బీసీ బిల్లును ప్రవేశ పెట్టాలన్నారు. విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లను 50 శాతానికి పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఆంగ్లో ఇండియన్లకు ఇస్తున్నట్లుగానే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులను అత్యంత వెనుకబడిన కులాల వారిని నామినేట్ చేయాలని కోరారు. 90 శాతం కులాలకు చట్ట సభల్లో ప్రాతినిధ్యం లేకుండా పోయిందన్నారు. బీసీలకు పారిశ్రామిక పాలసీని ప్రకటించాలని, 500 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయాలన్నారు. 12 బీసీ కార్పొరేషన్లు, ఫెడరేషన్లు ఉన్నా బీసీలకు రుణాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో బీసీ సంఘం నాయకులు బీరయ్య యాదవ్, జి.గుండప్ప, ఎంజీ రాములు, జి.భాస్కర్, శ్రీనివాస్ ఖన్న, సుభాష్, విశ్వనాథ్ యాదవ్, రమేష్ బాబు, సుధీర్ భండారీ పాల్గొన్నారు.
'బీసీలకు రిజర్వేషన్లు దక్కాలి'
Published Thu, Aug 25 2016 8:31 PM | Last Updated on Mon, Sep 4 2017 10:52 AM
Advertisement
Advertisement