MLA R. Krishnaiah
-
మెడికల్ కౌన్సెలింగ్‌ను నిలిపేయాలి: ఆర్.కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: మెడికల్ సీట్ల కేటాయింపులో బీసీ విద్యార్థులకు అన్యా యం జరుగుతోందని బీసీ సంక్షేమ సంఘం నేత, టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ఓపెన్ కోటాలో సీటు సాధించిన బీసీ విద్యార్థులను రిజర్వ్డ్ స్థానాల్లో భర్తీ చేస్తున్నారని, దీంతో బీసీలకు సీట్లు తగ్గుతున్నాయని ఆరోపించారు. మెడికల్ కౌన్సెలింగ్‌ను నిలిపివేయాలని కోరుతూ సీఎం కేసీఆర్‌కు సోమవార ఆయన లేఖ రాశారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఓపెన్ కోటాలో సీటు సాధిస్తే..కాలేజీ మార్పు చేసుకున్నప్పటికీ సదరు విద్యార్థి ఓపెన్ కేటగిరీలోనే ఉండాలన్నా రు. కానీ కేటాయింపులో అలా జరగడం లేదని.. దీనిపై జోక్యం చేసుకోవాలని సీఎంను కోరారు. -
‘రిజర్వేషన్ల అమలుపై సమగ్ర విచారణ చేయాలి’
హైదరాబాద్: రాజ్యాంగ బద్ధంగా ఏర్పడ్డ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిజర్వేషన్లు పాటించకపోవడం దారుణమని బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. గురుకుల టీచర్ల రిక్రూట్మెంట్లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను సక్రమంగా అమలు చేయలేదని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నిరుద్యోగులు ఖైరతాబాద్‌లోని బీసీ కమిషన్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆర్.కృష్ణయ్య మద్దతు తెలిపారు. అనంతరం బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులకు వినతిపత్రం ఇచ్చారు. నియామకాల్లో ఓపెన్ కాంపిటేషన్ లాస్ట్ కటాఫ్ మార్కుల తర్వాత రిజర్వేషన్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా.. ఓపెన్ కాంపిటేషన్‌లో రావాల్సిన మెరిట్ అభ్యర్థులను కూడా రిజర్వేషన్లో భర్తీ చేయడంతో రిజర్వేషన్లకు పూర్తిగా గండికొట్టినట్టయ్యిందన్నారు. ఈ విధానం వల్ల సుమారు 400 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, టీజీటీ జేఏసీ అధ్యక్షుడు శ్రీను పాల్గొన్నారు. ఘంటా చక్రపాణిని పదవి నుంచి తొలగించాలి: టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణిని తక్షణమే ఆ పదవి నుంచి తొలగించాలని ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఆందోళన అనంతరం మీడియాతో మాట్లాడుతూ నష్టపోయిన విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతూ అభ్యర్థులు కమిషన్ వద్దకు వెళితే ముందస్తు అరెస్టులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఉద్యోగ నియామకాల భర్తీలో చక్రపాణి వైఫల్యం చెందారని మండిపడ్డారు. రిజర్వేషన్లను సక్రమంగా అమలు చేస్తూ రివైజ్డ్ సెలక్షన్ లిస్ట్‌ను ప్రకటించాలని టీఎస్పీఎస్సీని డిమాండ్ చేశారు. -
‘చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు’
సాక్షి, హైదరాబాద్: బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రమంత్రి హన్స్‌రాజ్ గంగారామ్‌ను బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య కోరారు. బుధ వారం హైదరాబాద్‌కు వచ్చిన కేంద్రమంత్రిని కలసి బీసీల సమస్యల గురించి చర్చించారు. పార్లమెంట్ లో బీసీ బిల్లును ప్రవేశపెట్టి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు 50% స్థానాలు కేటాయించాలని కోరినట్లు తెలిపారు. బీసీ విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లపై ఉన్న క్రీమీలేయర్‌ను తీసివేయాలన్నారు. బీసీ అట్రాసిటీ యాక్ట్ తేవాలని కోరామన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీల నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కల్పించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపారు. 8న పాండిచ్చేరిలో పర్యటించి అక్కడి అసెంబ్లీలో బీసీ బిల్లు ప్రవేశపెట్టడానికి సీఎంపై ఒత్తిడి తెస్తామన్నారు. -
బీసీలకు 50 శాతం సీట్లు కేటాయించాలి: కృష్ణయ్య
మహేశ్వరం: 2019 అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు 50 శాతం టికెట్లు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం నేత, ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని తుక్కుగూడ సత్యనారాయణ ఫంక్షన్ హాల్లో జరిగిన కురుమ మహాసభలో ఆయన మాట్లాడారు. 70 ఏళ్ల నుంచి రాజకీయ పార్టీలు బీసీలను ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు రాజకీయవాటా ఇవ్వకుండా ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా నియోజకవర్గంలో ఉన్న బీసీ నేతలకు పార్టీలు సీట్లు ఇచ్చి గెలిపించాలన్నారు. బీసీలను విస్మరిస్తే తెలంగాణ, ఏపీలో బీసీ పార్టీలు పుట్టుకొస్తాయని స్పష్టం చేశారు. సంబరాలు తప్ప ఉద్యోగాలేవీ..? సాక్షి, హైదరాబాద్: నాలుగేళ్లుగా రాష్ట్రంలో సంబరాలు తప్ప ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు పెద్దగా లేవని బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య విమర్శించారు. నాలుగేళ్లుగా రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించుకుంటూ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని, అయితే ఆచరణలో మాత్రం అవేవీ కనిపించడం లేదన్నారు. -
ఇంటర్ అడ్మిషన్లు ఆన్లైన్లో చేపట్టాలి: ఆర్.కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ అడ్మిషన్ల మాదిరిగా ఇంటర్మీడియెట్ అడ్మిషన్లను ఆన్లైన్లో ప్రభుత్వమే చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య సూచించారు. శనివారం బీసీ భవన్లో బీసీ విద్యార్థి సంఘం కో ఆర్డినేటర్ ర్యాగ అరుణ్ కుమార్ అధ్యక్షతన బీసీ విద్యార్థి రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో కార్పొరేట్ కాలేజీలు విద్యార్థులను దోచుకున్నాయని, రాష్ట్రం వచ్చిన తర్వాత వాటిని కృష్ణానది అవతలికి తరిమికొడతానన్న కేసీఆర్ ప్రకటన ఏమైందని ప్రశ్నించారు. కార్పొరేట్ సంస్థల్లో బట్టీ్ట చదువుల వల్ల విద్యార్థులు ఒత్తిడికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. సమావేశంలో గుజ్జ కృష్ణ, మల్లేశ్ యాదవ్, నీల వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఫీజుల నియంత్రణ చట్టం తేవాలి
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు విద్యాసంస్థల ఫీజుల దోపిడీని నియంత్రించడానికి చట్టం తేవాలని బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం విద్యానగర్ బీసీ భవన్లో జరిగిన పలు బీసీ సంఘాల విస్తృత స్థాయి సమావేశానికి ఆయన హాజరయ్యారు. కృష్ణయ్య మాట్లాడుతూ.. కార్పొరేటు విద్యాసంస్థలు వ్యాపార దృక్పథంతో మాత్రమే పనిచేస్తున్నాయని, వాటి వల్ల ప్రజలు అప్పుల పాలవుతున్నారని విమర్శించారు. తమ పిల్లలకు మంచి నాణ్యమైన విద్య అందించాలని రైతులు అప్పులు చేసి కార్పొరేటు కాలేజీల్లో చేర్పిస్తున్నారని చెప్పారు. కార్పొరేటు విద్యాసంస్థలను కట్టడి చేసేందుకు ఒక యాజమాన్యం కింద ఒకే విద్యాసంస్థ ఉండేలా నిబంధనలను రూపొందించాలన్నారు. ఇంటర్ అడ్మిషన్లకు ఈ సారి నుంచే ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టాలని కోరారు. సమావేశంలో గుజ్జ కృష్ణ, నీలం వెంకటేశ్, భూపేశ్ సాగర్ పాల్గొన్నారు. -
బీసీ డిక్లరేషన్ ఏమైంది?: ఆర్.కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 4 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. రైతులకు గిట్టుబాటు ధర లేదు. బీసీ డిక్లరేషన్ ఏమైందని ప్రశ్నించారు. బడ్జెట్‌పై ఆయన స్పందిస్తూ.. ‘215 డిమాండ్లు ప్రభుత్వం ముందు పెట్టాం. ఒక్కటీ పట్టించుకోలేదు. ఎంబీసీకి ఇచ్చిన రూ.వెయ్యి కోట్లలో రూపాయి ఖర్చు పెట్టలేదు. బీసీ కార్పొరేషన్ రూ.10 వేల కోట్లు, బీసీ డిక్లరేషన్ చేసి రూ.20 వేల కోట్లు ఇవ్వాలి’ అని అన్నారు. బీసీలకు ఒక్క కొత్త పథకమూ లేదు: జాజుల సాక్షి, హైదరాబాద్: బడ్జెట్లో బీసీలకు కేటాయింపులు అంతంతే అని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. ‘బీసీల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని తూతూమంత్రంగా కేటాయింపులు చేశారు. సబ్ ప్లాన్ తీసుకొస్తామన్నారు. కానీ బడ్జెట్లో ఆ ఊసే ఎత్తలేదు. బీసీ కార్పొరేషన్లకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఈ విద్యా సంవత్సరం 119 బీసీ గురుకులాలు ఏర్పాటు చేస్తామన్నారు. కానీ నిధులు కేటాయించలేదు. బడ్జెట్లో బీసీలకు ఒక్క కొత్త పథకమూ లేదు. ఇప్పటికైనా సీఎం స్పందించి బీసీలకు నిధులు రూ.5,920 కోట్ల నుంచి రూ.10 వేల కోట్లకు పెంచాలి’ అని అన్నారు. -
బీసీలకు 50 శాతం టికెట్లు ఇవ్వాలి: కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు 50 శాతం టికెట్లు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. శనివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన బీసీ సంఘం సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయని విమర్శించారు. జనాభాలో సగభాగం బీసీలున్నారని, వారి ఓట్లతోనే ఏ పార్టీకైనా అధికారం సాధ్యమవుతుందని చెప్పారు. ప్రలోభాల రాజకీయాలకు కాలం చెల్లిందని, ఇకపై బీసీలకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీలకే ఓట్లు పడతాయన్నారు. ఇప్పటివరకు పార్లమెంటులో బీసీలకు సముచిత న్యాయం జరగలేదని.. వందల కులాలకు ప్రాతినిధ్యం దక్కలేదని ఆరోపించారు. తెలుగు రాష్ట్రాల్లో బీసీ ఎమ్మెల్యేలు తక్కువ సంఖ్యలో ఉన్నారని చెప్పారు. -
6న నిరాహార దీక్షలు: ఆర్. కృష్ణయ్య
హైదరాబాద్: వచ్చే నెల 6న రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద సామూహిక నిరాహార దీక్షలు చేపట్టనున్నామని బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య తెలిపారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని, బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజులను ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ దీక్షలు చేస్తున్నామన్నారు. శనివారం హైదరాబాద్ విద్యానగర్‌లోని బీసీ భవన్లో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఉత్తర తెలంగాణ జిల్లాల సంస్థాగత నిర్మాణ సమీక్ష జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అఖిలపక్షాలతో ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీని కలసి పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టించాలని డిమాండ్ చేశారు. సంఘ అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గుజ్జ కృష్ణ, శారద గౌడ్, నీల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్. కృష్ణయ్య సంఘ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొండేటి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా జి. రాధాకృష్ణారావు, మంచిర్యాల జిల్లా చైర్మన్‌గా చిట్ల సత్యనారాయణ, అధ్యక్షుడిగా కర్రె లచ్చన్న, మంచిర్యాల నియోజకవర్గ ఇన్చార్జ్గా భేరి సత్యనారాయణలను నియమించారు. -
29న కాంట్రాక్టు ఉద్యోగుల మహా సభ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించాలని బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగుల ను కాంట్రాక్టు విధానంలోకి మార్చాలని కోరుతూ ఈ నెల 29న హైదరాబాద్‌లో మహా సభను నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ప్రకటించారు. ఈ రెండు కేటగిరీలకు చెందిన వారు రాష్ట్రంలో 2.20లక్షల మంది ఉన్నట్లు తెలిపారు. బుధవారం బీసీ భవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారని చెప్పారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్న వారిని అర్హతల ఆధారంగా క్రమబద్ధీకరించాలన్నారు. ఔట్సోర్సింగ్ వారి పరిస్థితి దారుణమన్నారు.. ప్రభుత్వం నెలవారీగా వేతనాలు ఇసున్నా ఔట్సోర్సింగ్ సంస్థలు చెల్లింపుల్లో తీవ్ర జాప్యం చేస్తున్నాయని ఆరోపించారు. బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు జి.కృష్ణ, అంజి, ఎస్.రామలింగం, భూపేశ్ సాగర్ తదితరులు పాల్గొన్నారు. -
బీసీ సంక్షేమ సంఘం ‘బీసీ డిక్లరేషన్’
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన కులాల సమగ్రాభివృద్ధికి బీసీ ప్రత్యేక ప్రణాళికే ఏకైక మార్గమని బీసీ సంక్షేమ సంఘం స్పష్టం చేసింది. విద్య, ఉపాధి, ఆర్థిక, రాజకీయ అంశాల్లో జనాభా ప్రాతిపాదికన ప్రాధాన్యత కల్పిస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుందని పేర్కొంది. బీసీ ప్రణాళిక కోసం ప్రభు త్వం బీసీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మె ల్యేలతో బీసీ కమిటీ వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 10 రోజులుగా వివిధ అంశాలపై చర్చలు జరుపుతూ ప్రణాళిక తయారీలో కమిటీ బీజీ అయింది. ఈ నేపథ్యంలో బీసీ కమిటీ సభ్యుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ సంఘం సరికొత్తగా నివేదిక రూపొందించింది. బీసీల అభివృద్ధికి రాజకీయ పాలసీ అవసరమని బీసీ సంక్షేమ సంఘం పేర్కొంది. 22 అంశాలతో రాజకీయ పాలసీని తయారు చేసింది. బీసీ సంక్షేమ సంఘంతోపాటు అనుబంధ సంఘాల ప్రతినిధు లు, మేధావుల ఆలోచనలతో 68 అంశాలతో కూడి న నివేదిక రూపొందించినట్లు తెలిపారు. ఈ నివేదికను రెండ్రోజుల్లో సీఎం కేసీఆర్‌కు ఇవ్వనున్నట్లు చెప్పారు. బీసీ సంక్షేమ సంఘం రూపొందించిన నివేదికలోని పలు అంశాలు ఇవీ... రాజకీయ విధానం: రూ.20 వేల కోట్లతో బీసీ ప్రత్యేక ప్రణాళిక ఏర్పాటు చేయాలి. చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్ల అమలుకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. అన్ని పార్టీలు 50% టిక్కెట్లు ఇవ్వాలి. విద్య, ఉద్యోగాల్లో 52% రిజర్వేషన్ల అమలుతోపాటు క్రీమీలేయర్ తొలగించాలి. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 32 నుంచి 52 శాతానికి పెంచాలి. నామినేటెడ్ పోస్టుల్లోనూ 50% కేటాయించాలి. ప్రభుత్వ శాఖల్లోని లూప్‌లైన్ పోస్టులు కాకుండా ఉన్నత పదవుల్లో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలి. బీసీ సంక్షేమ శాఖ కమిషనర్, ముఖ్య కార్యదర్శి, గురుకులాల కార్యదర్శి పోస్టులు బీసీలకే కేటాయించాలి. ఇందులోనే పారిశ్రామిక పాలసీని ప్రత్యేకంగా రూపొందించాలి. కాంట్రాక్టుల్లో డిపాజిట్ లేకుండా 50 శాతం కోటా ఇవ్వాలి. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ మాదిరిగా బీసీ యాక్టు తీసుకురావాలి. తొలగించిన 26 కులాలను తిరిగి బీసీల్లో కలపాలి. ఆర్థిక విధానం: బీసీ ఆర్థిక విధానాన్ని 23 అంశాలతో రూపొందించారు. బీసీ కార్పొరేషన్‌కు ఏటా రూ.5 వేల కోట్లు కేటాయించాలి. కులవృత్తులకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఫెడరేషన్లకు జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించి ఖర్చు చేయాలి. ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా వెయ్యి కోట్లు పూర్తిస్థాయిలో ఖర్చు చేయాలి. ఆరె కటిక, మున్నూరుకాపు, పెరిక ఫెడరేషన్లు ఏర్పాటు చేయాలి. అన్ని ఫెడరేషన్లకు పాలక మండళ్లను సకాలంలో నియమించాలి. ఫెడరేషన్ల ద్వారా గ్రూపు రుణాల స్థానంలో వ్యక్తిగత రుణాలే ఇవ్వాలి. ఉద్యోగ, ఉపాధి పాలసీ: ఇందులో ఆరు అంశాలను పొందుపర్చారు. పూర్తి వసతులతో జిల్లాకో స్టడీ సర్కిల్‌ను ఏర్పాటు చేయాలి. సివిల్స్‌తోపాటు గ్రూప్స్ తదితర పోటీ పరీక్షలకు 10 బ్యాచ్‌లకు శిక్షణ ఇవ్వాలి. కాలేజీ విద్యార్థులకు స్టడీ సర్కిళ్ల ద్వారా స్పోకెన్ ఇంగ్లిష్, కెరీర్ గైడెన్స్, పర్సనాలిటీ, స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు నిర్వహించాలి. విద్యా పాలసీ: ఇందులో 17 అంశాలను పొందుపర్చారు. బీసీ విద్యార్థులకు ర్యాంకుతో నిమిత్తం లేకుండా పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ చేయాలి. సకాలంలో ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకారవేతనాలు విడుదల చేయాలి. ఐఐటీ, ఐఐఎం, ట్రిపుల్ ఐటీల్లో చదివే బీసీ విద్యార్థులకూ ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయాలి. అడ్మిషన్ల సమస్య లేకుండా అదనంగా 80 కాలేజీ హాస్టళ్లను తెరవాలి. ప్రతి నియోజకవర్గంలో బాల, బాలికల గురుకులాలు ఏర్పాటు చేయాలి. ఈ ఏడాది 119 ఏర్పాటు చేసినప్పటికీ జనాభా ప్రాతిపదికన అవి చాలకపోవడంతో వచ్చే ఏడాది మరో 119 గురుకులాలు తెరవాలి. పూర్తిస్థాయిలో బోధన సిబ్బందిని నియమించి, అన్ని సౌకర్యాలు కల్పించాలి. పోటీ పరీక్షల్లో ఎస్సీ, ఎస్టీలతో సమానంగా బీసీ విద్యార్థుల వయస్సును సమం చేస్తూ అవకాశం కల్పించాలి. -
మన పథకాలను పొరుగుకు విస్తరిద్దాం
గవర్నర్ విద్యాసాగర్‌రావును కలసిన బీసీ సంఘం నేతలు సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో అమలవుతున్న ఫీజు రీయింబర్స్మెంట్, గురుకుల పాఠశాలలు, స్టడీ సర్కిల్స్ లాంటి కార్యక్రమాలను మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో అమలు చేసేందుకు కృషి చేస్తానని ఆ రాష్ట్రాల గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు. బీసీ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో తెలుగు రాష్ట్రాల బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు ఆదివారం ఆయనతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో బీసీల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో అమలు చేయాలని ఆర్.కృష్ణయ్య సూచించగా, గవర్నర్ సానుకూలంగా స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచి నియోజకవర్గానికో గురుకులాన్ని ప్రారంభించడం అభినందనీయమన్నారు. దీంతో పేదలకు ఉచిత విద్య మరింత చేరువవుతుందని గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు పేర్కొన్నట్లు బీసీ సంఘ ప్రతినిధులు తెలిపారు. గవర్నర్‌ను కలసిన వారిలో సంఘ ప్రతినిధులు ఆర్.అరుణ్, నందగోపాల్, మారేశ్ తదితరులున్నారు. -
అధికారంతోనే పేద కులాలకు గౌరవం: కృష్ణయ్య
హైదరాబాద్: పేద కులాలకు అధికారంతోనే గౌరవం పెరుగుతుందని, ఆ దిశగా బీసీ సంక్షేమ సంఘం ఉద్యమిస్తుందని టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య తెలిపారు. తెలంగాణ బీసీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం హైదరాబాద్‌లో జరిగింది. 4,689 ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే ఆలోచనను సీఎం కేసీఆర్ విరమించుకోవాలని సమా వేశంలో కృష్ణయ్య హెచ్చరించారు. ప్రభుత్వ శాఖల్లోని 2 లక్షల ఉద్యోగాలతో పాటు 40 వేల ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. బీసీలకు క్రీమీలేయర్‌ను ఎత్తివేయాలని కోరారు. జనాభా దామాషా ప్రకారం విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేయాల న్నారు. ఏకీకృత సర్వీసుల్లో జనాభాకు అనుగుణంగా ఉద్యోగాల్లో ప్రమోషన్లు, పాత పింఛన్ విధానాన్ని అమలుచేయాలన్నారు. కార్యక్రమంలో బీసీ ఉపాధ్యాయ సంఘం నాయకులు కృష్ణుడు, కోటేశ్వర్రావు, గురుప్రసాద్, సురేశ్, నర్సింహాచారి, విజయ్‌కుమార్, రాష్ట్ర బీసీ ఫ్రంట్ చైర్మన్ మల్లేశ్‌యాదవ్, రాష్ట్ర బీసీ హక్కుల పోరాట కమిటీ ప్రెసిడెంట్ రాజేందర్, ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. -
'బీసీలకు రిజర్వేషన్లు దక్కాలి'
- మోదీ వద్దకు అఖిల పక్షాన్ని తీసుకెళ్లాలి - తెలుగు రాష్ట్రాల సీఎంలను డిమాండ్ చేసిన ఆర్.కృష్ణయ్య జహీరాబాద్: జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు దక్కినప్పుడే తగిన న్యాయం చేకూరుతుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. గురువారం మెదక్ జిల్లా జహీరాబాద్ వచ్చిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. 70వ స్వాతంత్య్ర వేడుకలు జరుపుకున్నా దేశంలోని 70కోట్ల మంది బీసీలకు తగిన ఫలాలు దక్కలేదన్నారు. విద్య, ఉద్యోగ రంగాల్లో తప్ప ఇతర రంగాల్లో కోటా దక్కడం లేదన్నారు. బీసీలకు సరైన వాటా కోసం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చొరవ తీసుకుని అఖిలపక్షం, బీసీ సంఘాలను ప్రధాని మోదీ వద్దకు తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా బీసీలకు ఏ రంగంలో కూడా తగిన న్యాయం జరగడం లేదన్నారు. రాజకీయ రంగంలో కేవలం 12 శాతం మంది ఉన్నారన్నారు. ఉద్యోగ రంగంలో 9 శాతమే దక్కిందన్నారు. పార్లమెంట్లో బీసీ బిల్లును ప్రవేశ పెట్టాలన్నారు. విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లను 50 శాతానికి పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఆంగ్లో ఇండియన్లకు ఇస్తున్నట్లుగానే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులను అత్యంత వెనుకబడిన కులాల వారిని నామినేట్ చేయాలని కోరారు. 90 శాతం కులాలకు చట్ట సభల్లో ప్రాతినిధ్యం లేకుండా పోయిందన్నారు. బీసీలకు పారిశ్రామిక పాలసీని ప్రకటించాలని, 500 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయాలన్నారు. 12 బీసీ కార్పొరేషన్లు, ఫెడరేషన్లు ఉన్నా బీసీలకు రుణాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో బీసీ సంఘం నాయకులు బీరయ్య యాదవ్, జి.గుండప్ప, ఎంజీ రాములు, జి.భాస్కర్, శ్రీనివాస్ ఖన్న, సుభాష్, విశ్వనాథ్ యాదవ్, రమేష్ బాబు, సుధీర్ భండారీ పాల్గొన్నారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై జాప్యాన్ని సహించం
టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో జనాభా దామాషా ప్రకారం వాటా దక్కడం లేదని, కేవలం 9 శాతం మాత్రమే బీసీ ఉద్యోగులు ఉన్నారని... ఇదెక్కడి ప్రజాస్వామ్యమని టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బుధవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో నిర్వహించిన బీసీ ఉద్యోగుల మహా ధర్నాలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం కేంద్ర కమిటీ అధ్యక్షుడు పావులూరి హనుమంతరావు అధ్యక్షత జరిగిన ఈ ధర్నాకు ఎంపీలు కె.మునియప్ప, నంది ఎల్లయ్య, కె.చంద్రప్ప సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ జనాభా దామాషా ప్రకారం ఉద్యోగుల శాతం లేకుంటే పదోన్నతుల్లో రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలని సుప్రీం కోర్టు ఇటీవల తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు. ఏ వర్గానికి లేని రీతిలో బీసీలకు క్రీమిలేయర్‌ను రుద్దుతున్నారని విమర్శించారు. ధర్నాలో బీసీ నేతలు శ్రీనివాస్ గౌడ్, గుజ్జకృష్ణ, రుషిఅరుణ్, జి.మల్లేష్‌యాదవ్, రమేశ్ తదితరులు ప్రసంగించారు. -
ఫాంహౌస్ పాలనను తిరస్కరిస్తారు
ఎవరెన్ని చెప్పినా...మాదే గెలుపు ప్రజలు మా వైపే ఉన్నారు టీఆర్ఎస్ పాలనపై విసిగిపోయారు కేసీఆర్ నిరంకుశ వైఖరి మారాలి టీడీపీ కూటమికి 70-80 స్థానాలు ఖాయం ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ఆర్.కృష్ణయ్య అంటే...బీసీ సంఘాల ఉద్యమ నాయకుడిగా ప్రజలకు సుపరిచితుడు. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు, ఉద్యోగ నియామకాల కోసం ఆందోళనలు, ధర్నాలు చేసే వ్యక్తిగా విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు గుర్తుండే నాయకుడు. రెండు దశాబ్దాలకు పైగా అణగారిన వర్గాలు, వెనుబడిన కులాల హక్కుల కోసం సమరశీల ఉద్యమాలు నెరపిన వ్యక్తిగా కృష్ణయ్యకు పేరుంది. యూనివ ర్శిటీ స్థాయి నుంచే పోరాటాలకు కేరాఫ్‌గా పని చేశారు. బీసీలకు ముఖ్యమంత్రి పదవిని కట్టబెడతానన్న చంద్రబాబు నాయుడు నినాదంతో టీడీపీలో చేరిన ఆయన ఎల్బీనగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాజకీయాల పట్ల భిన్నాభిప్రాయాలున్నప్పటికీ... జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలుపు తథ్యమని పేర్కొంటున్నారు. ఎందరు నేతలు పార్టీలు మారినా...ప్రజలు మాత్రం మా వైపే ఉన్నారని చెబుతున్నారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో పూర్తిగా నిమగ్నమైన ఆర్.కృష్ణయ్యతో ‘సాక్షి’ ఇంటర్వ్యూ.. - సాక్షి, సిటీబ్యూరో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మీ కూటమి ఎన్ని స్థానాల్లో గెలువబోతోంది? గ్రేటర్లో టీడీపీ-బీజేపీ కూటమి 70-80 స్థానాల్లో గెలుస్తుంది. ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. టీఆర్ఎస్ హామీలను ప్రజలు నమ్మరు. జీహెచ్ఎంసీ అటానమస్ బాడీ. ప్రజల నుంచి వసూలయ్యే పన్నులు, ఇతరత్రా వనరుల ద్వారా వచ్చే ఆదాయం కలిపి రూ.8 వేల కోట్ల బడ్జెట్ ఉంది. ఈ నిధులతో నగరాభివృద్ధితోపాటు, ప్రజలకు కావలసిన కనీస సౌకర్యాలను కల్పించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ నిధులు అవసరమే లేదు. ఎంతో మంది నేతలు పార్టీలు మారుతున్నారు. రాత్రికి రాత్రే ప్లేటు ఫిరాయిస్తున్నారు. కానీ ప్రజలు అంత సులువుగా మారరు. వారు మా వైపే ఉన్నారు. అభ్యర్థుల ఎంపిక ఎలా జరిగింది. కొందరు సీట్లు అమ్ముకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై మీరేమంటారు? మా పార్టీలో గెలుపు ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేసినా.. కొన్ని లోటుపాట్లు జరిగి ఉంటాయి. బీసీలకు ఎక్కువ సీట్లు ఇప్పించగలిగాం. ఒక్కో సీటుకు 6-7గురు పోటీ పడినప్పుడు ఇలాంటి ప్రచారం జరగటం సహజమే. కానీ సీట్లు అమ్ముకున్న పరిస్థితులు లేవు. అలాంటివేమీ జరగలేదు. ఏం హామీలిచ్చి ప్రజలను ఓటు అడుగుతున్నారు.. గెలిస్తే ఏం చేస్తారు? కూటమి గెలిస్తే జీహెచ్ఎంసీ నిధులతో నగర సమగ్రాభివృద్ధికి పక్కా ప్రణాళిక రూపొందిస్తాం. కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చి 90 శాతం ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలన్నీ తీరుస్తాం. ఇక టీఆర్ఎస్ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలకు భంగం కలిగించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్‌హౌస్ పరిపాలన సాగిస్తున్నారు. సచివాలయానికి రావటం లేదు. 20 నెలల కాలంలో ఒక్కరినీ కలువలేదు. ఇంటర్వ్యూలు ఇవ్వటం లేదు. చివరికి ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులనూ కలవడం లేదు. లంచాలిచ్చే కాంట్రాక్టర్లు, పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులను మాత్రమే కలుస్తున్నారు. ఇదేనా పాలన? ప్రజలు కావాలో...కాంట్రాక్టర్లు కావాలో కేసీఆర్ తేల్చుకోవాలి. 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే..15 వేల ఉద్యోగాలు మాత్రమే ఇస్తున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తామని చెప్పినా..ఒక్కటి కట్టలేదు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించడం లేదు. రైతులకు రుణ మాఫీ లేదు. దీంతో ఆయా వర్గాలు ఆగ్రహంతో ఉన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి ప్రజలను ఓట్లు అడుగుతున్నాం. కేసీఆర్ విజయం మాదే అంటున్నారు. అవసరమైతే ఎంఐఎం మిత్ర పక్షంగా ఉంటుందంటున్నారు. దీనిపై మీరేమంటారు? అధికార పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ప్రజలు ఈ ఎన్నికల్లో వ్యతిరేక ఓటుద్వారా కసి తీర్చుకోవాలని భావిస్తున్నారు. హైదరాబాద్ ప్రజలు చాలా తెలివైనవారు. నాయకులను కొంటున్న టీఆర్ఎస్... ప్రజలను అంతసులువుగా తన వైపు తిప్పుకోలేదు. నాయకులు పార్టీలు మారినంత మాత్రాన విజయం తథ్యమనుకోవడం వారి భ్రమ. ఎంఐఎం కలిసినా జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ అధికారంలోకి రావటం కష్టం. ప్రజలను వంచించటానికి అధికార పార్టీ నేతలు ఎత్తుగడలు, వ్యూహాలు పన్నుతున్నారు. హెచ్‌సీయూలో రోహిత్ వేముల ఆత్మహత్య సంఘటనపై మీ వైఖరి ఏమిటి? రోహిత్ ఆత్మహత్యపై ఇద్దరు ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్ర బాబు నాయుడు కూడా స్పందించాల్సిన స్థాయిలో స్పందించ లేదు. కేంద్రంతో ఉన్న సత్ సంబంధాల రీత్యా చంద్రబాబు విషయ పరంగానే స్పందించినట్లు తెలుస్తున్నది. రోహిత్ ఆత్మహత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని మేము కోరాం. రాష్ట్రంలో కేసీఆర్, కేంద్రంలో మోదీ పాలన ఎలా ఉంది. మీరెన్ని మార్కులు వేస్తారు? దేశంలో మోదీ పరిపాలన బాగా ఉంది. నిజాయితీగా, అంకిత భావంతో పని చేస్తున్నారు. ప్రపంచ దేశాలు మెచ్చుకునే స్థాయికి దేశాన్ని తీసుకెళ్తున్నారు. అవినీతికి తావులేకుంగా దేశం బాగు కోసం పని చేస్తున్నారు. ఇలాంటి ప్రధాని దొరకడం అదృష్టంగా భావిస్తున్నాం. కేసీఆర్‌కు కొత్త ఆలోచనలు ఉన్నాయి. చేయాలనే తపన ఉంది. కానీ ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తున్నారు. పేదలు, నిరుద్యోగులను పట్టించుకోవడం లేదు. నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. ఈ పద్ధతి మార్చుకుంటే కేసీఆర్‌కు మంచిది. ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో కేసీఆర్‌ను పల్లెత్తు మాట కూడా అనటం లేదన్న అభిప్రాయాలపై మీ కామెంట్.... ‘ఓటుకు నోటు’ ఆరోపణలతో ఏపీ సీఎం చంద్రబాబు, ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. జడ్జిమెంట్ వచ్చిన తర్వాతే ఇద్దరి సీఎంలపై నా అభిప్రాయం చెబుతాను. ఇరు రాష్ట్రాల ప్రజలకు మాత్రం ఈ విషయంపై స్పష్టత ఉంది. ఇప్పటికి ఇంతకు మించి ఏమీ మాట్లాడలేను. -
'2 లక్షల మందితో అసెంబ్లీ ముట్టడి'
నాగర్‌కర్నూల్ (మహబూబ్ నగర్) : విద్యార్థుల స్కాలర్‌షిప్‌ల బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూలులో జరిగిన బీసీల సింహగర్జన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రూ.1,800 కోట్ల రూపాయల బకాయి ఉన్న స్కాలర్షిప్లను 8 రోజుల్లో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే రెండు లక్షల మంది విద్యార్థులతో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. కల్యాణ లక్ష్మి పథకాన్ని తెల్లరేషన్ కార్డు ఉన్న వారందరికీ వర్తింపజేయాలన్నారు. ఈ పథకం కింద ప్రభుత్వ సాయాన్ని రూ.2 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. -
భగవంతుడు టీడీపీ నేతలకు సిగ్గు పెట్టలా...
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి, ఎమ్మెల్యే ఆర్కే పట్నంబజారు(గుంటూరు) : భగవంతుడు తెలుగుదేశం పార్టీ నేతలకు సిగ్గుఎగ్గు పెట్టలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు బందిపోట్లుగా మారి ప్రభుత్వ వనరులను దోచుకుతింటున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఇచ్చిన హమీలను పక్కన పెట్టి వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న సమరదీక్షను దొంగ దీక్ష అనడం సిగ్గుచేటని మండిపడ్డారు. అరండల్‌పేటలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఐదు హామీల విషయంలో టీడీపీ నేతలు జనంలోకి వచ్చి నిజం చెప్పే ధైర్యం ఉందా అని సవాల్ విసిరారు. జగన్ అవినీతిపరుడని వ్యాఖ్యలు చేస్తున్న నేతలు, తెలంగాణలో రేవంత్‌రెడ్డి విషయాన్ని సైతం పరిశీలించాలన్నారు. నేరుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడే డబ్బులు ఇవ్వాలని చెప్పడం సిగ్గుచే టన్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల ఆర్కే మాట్లాడుతూ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులను ప్రలోభాలకు గురి చేయడం టీడీపీ నేతలకు కొత్తేమీ కాదన్నారు. రాష్ట్రంలోని ప్రతిపక్ష నేతలను రాక్షసులుగా, తెలంగాణ నేతలను గొర్రెలుగా అభివర్ణించిన చంద్రబాబు నైతిక విలువలు మరచి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డిపై నమోదైన కేసులో చంద్రబాబును ఏ 2గా పెట్టాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పలు విభాగాల నేతలు గుదిబండి చిన వెంకటరెడ్డి, కావటి మనోహర్‌నాయుడు, కొత్తా చిన్నపరెడ్డి, మండేపూడి పురుషోత్తం, మొగిలి మధు, బండారు సాయిబాబు, శిఖా బెనర్జీ, ఉప్పుటూరి నర్సిరెడ్డి, ముత్యాలరాజు పాల్గొన్నారు. -
ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలి
లేకుంటే సచివాలయం ముట్టడిస్తాం: ఆర్.కృష్ణయ్య హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు రావని ఉద్యమంలో ఉపన్యాసాలు ఇచ్చి తెలంగాణ ఏర్పడ్డాక ఒక్క ఉద్యోగానికీ నోటిఫికేషన్ ఇవ్వలేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. తెలంగాణలో ఖాళీగా ఉన్న 2లక్షలు, ఏపీలో లక్షన్నర ఉద్యోగాలకు జూన్ 2లోగా ఆయా ప్రభుత్వాలు నోటిఫికేషన్లు విడుదల చేయకపోతే లక్షమంది నిరుద్యోగులతో సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు నీలవెంకట్ అధ్యక్షతన ఆదివారం దిల్‌సుఖ్‌నగర్‌లోని అన్నపూర్ణ కల్యాణమండపంలో సమావేశం జరిగింది. పలు జిల్లాల నుంచి వచ్చిన నిరుద్యోగులనుద్దేశించి కృష్ణయ్య మాట్లాడారు. భారీ సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నా ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయకపోవటంతో అనేక మంది నిరుద్యోగుల వయోపరిమితి దాటి పోయి నష్టపోతున్నారన్నారు. అధికారంలోకి వచ్చిన కేసీఆర్ నెలలోపు లక్ష, 6నెలల్లో 2లక్షల ఉద్యోగాలు ఇస్తామని వాగ్దానం చేసి అసెంబ్లీలో కూడా ప్రకటించి ఏడాదైనా ఎటువంటి స్పందనలేదని ఆయన విమర్శించారు. ఆంధ్రాలో కూడా ఇలాంటి పరిస్థితే ఉందన్నారు. బతుకునిచ్చే తెలంగాణ కావాలే: విమలక్క అన్ని వర్గాల ప్రజలు పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఎవరి అయ్య జాగీరు కాదనీ అరుణోదయ కళామండలి అధ్యక్షురాలు, ప్రజాగాయని విమలక్క అన్నారు. మిలియనీర్లను బ్రాండ్ అంబాసిడర్లుగా చేయటం కాదనీ రైతుల సమస్యలు పరిష్కరించాలన్నారు. ప్రజలు కోరుకునేది బంగారు తెలంగాణ కాదని బతుకునిచ్చే తెలంగాణ అని అన్నారు. కార్యక్రమంలో గుజ్జ కృష్ణ, శారద, దుర్గయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.