ఫాంహౌస్ పాలనను తిరస్కరిస్తారు | MLA R. Krishnaiah interview | Sakshi
Sakshi News home page

ఫాంహౌస్ పాలనను తిరస్కరిస్తారు

Published Sat, Jan 30 2016 1:02 AM | Last Updated on Fri, Aug 10 2018 6:45 PM

ఫాంహౌస్ పాలనను తిరస్కరిస్తారు - Sakshi

ఫాంహౌస్ పాలనను తిరస్కరిస్తారు

ఎవరెన్ని చెప్పినా...మాదే గెలుపు
ప్రజలు మా వైపే ఉన్నారు
టీఆర్‌ఎస్ పాలనపై విసిగిపోయారు
కేసీఆర్ నిరంకుశ వైఖరి మారాలి
టీడీపీ కూటమికి 70-80 స్థానాలు ఖాయం
ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య

 
 ఆర్.కృష్ణయ్య అంటే...బీసీ సంఘాల ఉద్యమ నాయకుడిగా ప్రజలకు సుపరిచితుడు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు, ఉద్యోగ నియామకాల కోసం ఆందోళనలు, ధర్నాలు చేసే వ్యక్తిగా విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు గుర్తుండే నాయకుడు. రెండు దశాబ్దాలకు పైగా అణగారిన వర్గాలు, వెనుబడిన కులాల హక్కుల కోసం సమరశీల ఉద్యమాలు నెరపిన వ్యక్తిగా కృష్ణయ్యకు పేరుంది. యూనివ ర్శిటీ స్థాయి నుంచే పోరాటాలకు కేరాఫ్‌గా పని చేశారు. బీసీలకు ముఖ్యమంత్రి పదవిని కట్టబెడతానన్న చంద్రబాబు నాయుడు నినాదంతో టీడీపీలో చేరిన ఆయన ఎల్బీనగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాజకీయాల పట్ల భిన్నాభిప్రాయాలున్నప్పటికీ... జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలుపు తథ్యమని పేర్కొంటున్నారు. ఎందరు నేతలు పార్టీలు మారినా...ప్రజలు మాత్రం మా వైపే ఉన్నారని చెబుతున్నారు.  ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో పూర్తిగా నిమగ్నమైన ఆర్.కృష్ణయ్యతో ‘సాక్షి’  ఇంటర్వ్యూ..
 - సాక్షి, సిటీబ్యూరో
 
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మీ కూటమి ఎన్ని స్థానాల్లో గెలువబోతోంది?
 గ్రేటర్‌లో టీడీపీ-బీజేపీ కూటమి 70-80 స్థానాల్లో గెలుస్తుంది. ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. టీఆర్‌ఎస్ హామీలను ప్రజలు నమ్మరు. జీహెచ్‌ఎంసీ అటానమస్ బాడీ. ప్రజల నుంచి వసూలయ్యే పన్నులు, ఇతరత్రా వనరుల ద్వారా వచ్చే ఆదాయం కలిపి రూ.8 వేల కోట్ల బడ్జెట్ ఉంది. ఈ నిధులతో నగరాభివృద్ధితోపాటు, ప్రజలకు కావలసిన  కనీస సౌకర్యాలను కల్పించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ నిధులు అవసరమే లేదు. ఎంతో మంది నేతలు పార్టీలు మారుతున్నారు. రాత్రికి రాత్రే ప్లేటు ఫిరాయిస్తున్నారు. కానీ ప్రజలు అంత సులువుగా మారరు. వారు మా వైపే ఉన్నారు.

 అభ్యర్థుల ఎంపిక ఎలా జరిగింది. కొందరు సీట్లు అమ్ముకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై మీరేమంటారు?
 మా పార్టీలో గెలుపు ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేసినా.. కొన్ని లోటుపాట్లు జరిగి ఉంటాయి. బీసీలకు ఎక్కువ సీట్లు ఇప్పించగలిగాం. ఒక్కో సీటుకు 6-7గురు పోటీ పడినప్పుడు ఇలాంటి ప్రచారం జరగటం సహజమే. కానీ సీట్లు అమ్ముకున్న పరిస్థితులు లేవు. అలాంటివేమీ జరగలేదు.

 ఏం హామీలిచ్చి ప్రజలను ఓటు అడుగుతున్నారు.. గెలిస్తే ఏం చేస్తారు?
 కూటమి గెలిస్తే జీహెచ్‌ఎంసీ నిధులతో నగర సమగ్రాభివృద్ధికి పక్కా ప్రణాళిక రూపొందిస్తాం. కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చి 90 శాతం ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలన్నీ తీరుస్తాం. ఇక టీఆర్‌ఎస్ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలకు భంగం కలిగించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్‌హౌస్ పరిపాలన సాగిస్తున్నారు. సచివాలయానికి రావటం లేదు. 20 నెలల కాలంలో  ఒక్కరినీ కలువలేదు. ఇంటర్వ్యూలు ఇవ్వటం లేదు. చివరికి ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులనూ కలవడం లేదు. లంచాలిచ్చే కాంట్రాక్టర్లు, పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులను మాత్రమే కలుస్తున్నారు. ఇదేనా పాలన? ప్రజలు కావాలో...కాంట్రాక్టర్లు కావాలో  కేసీఆర్ తేల్చుకోవాలి. 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే..15 వేల ఉద్యోగాలు మాత్రమే ఇస్తున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తామని చెప్పినా..ఒక్కటి కట్టలేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించడం లేదు. రైతులకు రుణ మాఫీ లేదు. దీంతో ఆయా వర్గాలు ఆగ్రహంతో ఉన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి ప్రజలను ఓట్లు అడుగుతున్నాం.

 కేసీఆర్ విజయం మాదే అంటున్నారు. అవసరమైతే ఎంఐఎం మిత్ర పక్షంగా ఉంటుందంటున్నారు. దీనిపై మీరేమంటారు?
 అధికార పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న  ప్రజలు ఈ ఎన్నికల్లో వ్యతిరేక ఓటుద్వారా కసి తీర్చుకోవాలని భావిస్తున్నారు. హైదరాబాద్ ప్రజలు చాలా తెలివైనవారు. నాయకులను కొంటున్న టీఆర్‌ఎస్... ప్రజలను అంతసులువుగా తన వైపు తిప్పుకోలేదు. నాయకులు పార్టీలు మారినంత మాత్రాన విజయం తథ్యమనుకోవడం వారి భ్రమ. ఎంఐఎం కలిసినా జీహెచ్‌ఎంసీలో టీఆర్‌ఎస్ అధికారంలోకి రావటం కష్టం. ప్రజలను వంచించటానికి అధికార పార్టీ నేతలు ఎత్తుగడలు, వ్యూహాలు పన్నుతున్నారు.

 హెచ్‌సీయూలో రోహిత్ వేముల ఆత్మహత్య సంఘటనపై మీ వైఖరి ఏమిటి?
 రోహిత్ ఆత్మహత్యపై ఇద్దరు ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్ర బాబు నాయుడు కూడా స్పందించాల్సిన స్థాయిలో స్పందించ లేదు. కేంద్రంతో ఉన్న సత్ సంబంధాల రీత్యా చంద్రబాబు విషయ పరంగానే స్పందించినట్లు తెలుస్తున్నది. రోహిత్ ఆత్మహత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని మేము కోరాం.

 రాష్ట్రంలో కేసీఆర్, కేంద్రంలో మోదీ పాలన ఎలా ఉంది. మీరెన్ని మార్కులు వేస్తారు?
 దేశంలో మోదీ పరిపాలన బాగా ఉంది. నిజాయితీగా, అంకిత భావంతో పని చేస్తున్నారు. ప్రపంచ దేశాలు మెచ్చుకునే స్థాయికి దేశాన్ని తీసుకెళ్తున్నారు. అవినీతికి తావులేకుంగా దేశం బాగు కోసం పని చేస్తున్నారు. ఇలాంటి ప్రధాని దొరకడం అదృష్టంగా భావిస్తున్నాం. కేసీఆర్‌కు కొత్త ఆలోచనలు ఉన్నాయి. చేయాలనే తపన ఉంది. కానీ ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తున్నారు. పేదలు, నిరుద్యోగులను పట్టించుకోవడం లేదు. నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. ఈ పద్ధతి మార్చుకుంటే కేసీఆర్‌కు మంచిది.  
 
 ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో కేసీఆర్‌ను పల్లెత్తు మాట కూడా అనటం లేదన్న అభిప్రాయాలపై మీ కామెంట్....

 ‘ఓటుకు నోటు’ ఆరోపణలతో ఏపీ సీఎం చంద్రబాబు, ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. జడ్జిమెంట్ వచ్చిన తర్వాతే ఇద్దరి సీఎంలపై నా అభిప్రాయం చెబుతాను. ఇరు రాష్ట్రాల ప్రజలకు మాత్రం ఈ విషయంపై  స్పష్టత ఉంది. ఇప్పటికి ఇంతకు మించి ఏమీ మాట్లాడలేను.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement