రె‘బెల్స్’
► ‘తిరుగుబాటుదారులదే’ హవా
► అధికారిక అభ్యర్థులకు అవస్థలు
► గ్రేటర్ పోరులో అనూహ్య మలుపులు
► ప్రధాన పార్టీల్లో గుబులు
సిటీబ్యూరో: గ్రేటర్ పోరులో ప్రధాన పార్టీల అభ్యర్థుల గుండెల్లో రె‘బెల్స్’ మోగుతున్నాయి. అధికారిక అభ్యర్థులను ‘తిరుగుబాటుదారులు’ ముచ్చెమటలు పట్టిస్తూ ముందుకు వెళుతున్నారు. వీరి దూకుడుతో నగరంలో సుమారు 15 డివిజన్లలో పరిస్థితి తారుమారయ్యేలా కనిపిస్తోంది. సొంత పార్టీలు టికెట్లు నిరాకరించిన నేపథ్యంలో ఆయా పార్టీల జెండాలు, నినాదాలతో వారు ప్రచారంలో దూసుకు వెళుతున్నారు. దీంతో సంబంధిత డివిజన్లలో అధికారిక అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిలో బీఎన్‌రెడ్డి నగర్, అల్వాల్, నల్లకుంట, మచ్చబొల్లారం, సూరారం, మల్కాజిగిరి, ఫతేనగర్, అడ్డగుట్ట, తార్నాక, ఈస్ట్ ఆనంద్‌బాగ్ లతో రెబల్స్ అధికారిక అభ్యర్థులతో ఢీ అంటే ఢీ అంటున్నారు. ముఖ్యంగా బీఎన్‌రెడ్డి నగర్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి లక్ష్మీప్రసన్నతో పోలిస్తే రెబల్ అభ్యర్థి మాధవరం నర్సింహారావు భిన్నరీతిలో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. అక్కడ మొదటి నుంచీఉద్యమంలో ఉన్న వ్యక్తి కావటంతో టీఆర్‌ఎస్ శ్రేణులు సైతం మాధవరాన్ని బలపరుస్తున్నారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి కోడలు విజయశాంతి పోటీ పడుతున్న అల్వాల్ డివిజన్‌లో తోట సుజాతరెడ్డి సైతం భారీగానే ఓట్లు చీల్చే పరిస్థితి కనిపిస్తోంది. ఈస్ట్ ఆనంద్‌భాగ్‌లో అధికారిక అభ్యర్థి నర్సింగ్‌రావుకు ఆయన సోదరుని కుమారుడు, మొన్నటి వరకు టీఆర్‌ఎస్ నేతగా కొనసాగిన ఆకుల రాజేందర్ కుమారుడు ఆకుల శ్రవణ్ బీఎస్పీ అభ్యర్థిగా గట్టి పోటీగా మారారు. మిగి లిన ప్రాంతాల్లోనూ అధికారిక అభ్యర్థులను ఇబ్బంది పెట్టే రీతిలో రెబల్స్‌వ్యూహరచన చేస్తున్నారు.
‘దేశం’-బీజేపీల్లోనూ.. వారిదే జోరు
తెలుగుదేశం-బీజేపీల్లోనూ రెబల్స్ మోత మోగి స్తున్నారు. సూరారంలో అధికారిక అభ్యర్థుల కంటే తిరుగుబాటుఅభ్యర్థుల హవా ఎక్కువగా కనిపిస్తోంది. టీడీపీ రెబల్, మాజీ కార్పోరేటర్ పాల కృష్ణ, బీజేపీ రెబల్ శంకర్‌రెడ్డిలు అధికారిక టీడీపీ అభ్యర్థి విజయావకాశాలకు గండికొట్టే దిశ గా పయనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఉప్పల్‌లో అధికారిక అభ్యర్థి కంటే తిరుగుబాటు అభ్యర్థి రజిత ప్రచారాన్ని జోరెక్కించారు.