సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ముందస్తుగా విడుదల చేయడం ద్వారా రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించిన భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)లో అసంతృప్త జ్వాల మాత్రం ఆరడం లేదు. జాబితా వెలువడి పది రోజులు గడిచినా టికెట్ ఆశించి భంగపడిన కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఇతర కీలక నేతలు అసంతృప్త స్వరాన్ని తగ్గించడం లేదు. నియోజకవర్గ ప్రజలు, తమ అనుచరవర్గంతో చర్చించిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్న అసంతృప్త నేతలు లోలోన తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఎన్నికల షెడ్యూలు వెలువడేందుకు మరో నెల రోజులకు పైగా వ్యవధి ఉండటంతో అభ్యర్థుల జాబితాలో మార్పులు చేర్పులు ఉంటాయని ఆశావహ దృక్పథంతో లెక్కలు వేసుకుంటున్నారు.
కేటీఆర్ రాక కోసం ఎదురుచూపులు
ఒకేసారి 115 మంది అభ్యర్థుల జాబితాను బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ విడుదల చేయగా, నేటికీ సుమారు డజనుకు పైగా నియోజకవర్గాల్లో అసమ్మతులు మెట్టు దిగడం లేదు. ప్రగతిభవన్ దిశా నిర్దేశం మేరకు బుజ్జగింపుల పర్వం కొనసాగుతున్నా పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు. కేటీఆర్ అమెరికా పర్యటనను నుంచి తిరిగి వచి్చన తర్వాత ఆయనతో భేటీ అయ్యేందుకు టికెట్ ఆశించి భంగపడిన నేతలు ఎదురు చూస్తున్నారు. ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంతరావు, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య, చిలుముల మదన్‌రెడ్డితో పాటు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తదితరులు వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నారు. జాబితా ప్రకటన తర్వాత బీఆర్‌ఎస్ అధినేత ఆదేశాల మేరకు పలు సర్వే సంస్థలు రంగంలోకి దిగి క్షేత్ర స్థాయిలో పరిస్థితిని మదింపు చేస్తున్నాయి. ఈ సర్వే ఫలితాల ఆధారంగా కొందరు అభ్యర్థులను మార్చక తప్పని సరి పరిస్థితి ఉంటుందని బీఆర్‌ఎస్ ఆశావహులు భావిస్తున్నారు.
ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు ఎవరో?
ఇక పార్టీ టికెట్ దక్కించుకున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఇతర అభ్యర్థులు తమపై పోటీ చేసే ప్రత్యర్థి పారీ్టల అభ్యర్థులపై ఆరా తీస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ నుంచి ఎవరికి టికెట్ దక్కుతుందనే ఉత్కంఠ మెజారిటీ బీఆర్‌ఎస్ అభ్యర్థులను వెంటాడుతోంది. విపక్ష పార్టీ అభ్యర్థుల బలాబలాలకు అనుగుణంగా తమ వ్యూహాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. మరోవైపు సొంత పారీ్టలో అసమ్మతి సుమారు 40కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో తీవ్ర స్థాయిలో ఉన్నట్లు బీఆర్‌ఎస్ గుర్తిస్తోంది. పార్టీ అభ్యర్థులకు చాలా చోట్ల సొంత పార్టీ నేతల నుంచే సహాయ నిరాకరణ ఎదురవుతుండటంతో వారిని బుజ్జగించేందుకు తంటాలు పడుతున్నారు. మరో వారం రోజుల్లో పార్టీ పరంగా కూడా పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలకు నియోజకవర్గాల వారీగా ఇన్‌చార్జిలుగా బాధ్యతలు అప్పగించేందుకు కసరత్తు జరుగుతోంది.
నియోజకవర్గాలకు ప్రచార సామగ్రి
అభ్యర్థుల జాబితా విడుదల చేసిన బీఆర్‌ఎస్ ప్రస్తుతం ప్రచార సామగ్రిని తరలించే పనిలో ఉంది. నియోజకవర్గాల వారీగా వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్దిపొందిన ఓటర్లు, గ్రామాలు, పథకాల వారీగా వారి వివరాలను పార్టీ అభ్యర్థులకు అందజేస్తున్నారు. పార్టీ జెండాలు, కండువాలు, టోపీలు, తోరణాలు తదితరాలను తొలి విడతలో తెలంగాణ భవన్ నుంచి చేరవేస్తున్నారు. తమ నియోజకవర్గంలో ప్రచారాన్ని ప్రారంభించాల్సిందిగా మంత్రి హరీష్‌రావు, కవితపై పార్టీ అభ్యర్థులు ఒత్తిడి తెస్తున్నారు. ఓ వైపు అక్టోబర్ 16న వరంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహణకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆలోగా ఎన్నికల ప్రచారాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్లేలా కేసీఆర్‌తో పాటు మంత్రులు కేటీఆర్, హరీ‹Ùరావు, కవిత ప్రచార షెడ్యూలుపైనా కసరత్తు జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment