మా విజన్ హ్యాపీ హైదరాబాద్ | Our Vision Happy Hyderabad | Sakshi
Sakshi News home page

మా విజన్ హ్యాపీ హైదరాబాద్

Published Mon, Jan 25 2016 12:51 AM | Last Updated on Fri, Aug 10 2018 6:45 PM

మా విజన్ హ్యాపీ హైదరాబాద్ - Sakshi

మా విజన్ హ్యాపీ హైదరాబాద్

గ్రేటర్‌పై ఆశల జల్లు
టీఆర్‌ఎస్ చేసిందేమీ  లేదు
మేయర్ పీఠం కోసం ఎంఐఎంతో కుమ్మక్కు
టీడీపీ-బీజేపీ కూటమి విమర్శ


గ్రేటర్ పీఠంపై జెండా ఎగరేసేందుకు విపక్షాలు కంకణం కట్టుకున్నాయి. గెలుపు తమదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మహానగర ఓటర్లను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ-టీడీపీ కూటమి ఆదివారం గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టోలను ఆవిష్కరించాయి. వాటిలో పేదలకు వరాల జల్లు కురిపించాయి. హైదరాబాద్ నగరంలోని ప్రతి గృహానికి ఉచిత వంట గ్యాస్ పైప్‌లైన్ వేస్తామని, వచ్చే 25 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో డ్రైనేజీ వ్యవస్థలో మార్పు తెస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. పేదలకు పక్కా ఇళ్లు, మొబైల్ ఆస్పత్రులు, ప్రతి ఇంటికి ఉచిత రక్షిత మంచి నీరు అందిస్తామని  బీజేపీ-టీడీపీ కూటమి ప్రకటించింది.
 
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తమ కూటమిని గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రజలకు నాణ్యమైన సేవలు అందిస్తామని టీడీపీ-బీజేపీ కూటమి తెలిపింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులతోనే గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి చెందుతుంది తప్ప టీఆర్‌ఎస్ ప్రభుత్వం వల్ల కాదని ఆ పార్టీల నేతలు స్పష్టం చేశారు. నగరంలోని ఓ హోటల్‌లో టీడీపీ, బీజేపీ కూటమి ఎన్నికల మేనిఫెస్టో ‘విజన్ డాక్యుమెంట్ ఫర్ హ్యాపీ హైదరాబాద్’ను ఆదివారం ఆవిష్కరించారు. కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, ఆపార్టీ ఫ్లోర్ లీడర్ ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇతర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దత్తాత్రేయ మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్ సమగ్ర అభివృద్ధికి ఎన్‌డీఏ కూటమి కట్టుబడి ఉందన్నారు. హైదరాబాద్ కీర్తి ప్రపంచానికి చాటి చెప్పింది బీజేపీ-టీడీపీలేనన్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక హైదరాబాద్ అభివృద్ధి శూన్యమని విమర్శించారు. స్వచ్ఛ హైదరాబాద్ కోసం కేంద్రం రూ. 100 కోట్లు విడుదల చేసిందని, వందల కోట్ల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం సహకారం ఇస్తుందని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. ఎంఐఎంతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్న టీఆర్‌ఎస్.. విజయం కోసం జిమ్మిక్కులు చేస్తోందన్నారు. షేక్‌పేట, మాదాపూర్, ఒవైసీనగర్‌లో ఉగ్ర జాడలు అధికమయ్యాయని, ఎంఐఎం అండతోనే అసాంఘిక శక్తులు పెరుగుతున్నాయని ఆరోపించారు.

ఆస్తిపన్ను పెంచేశారు: కిషన్‌రెడ్డి
టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక ఆస్తిపన్ను పెంచారని, కట్టని వాళ్ల ఇళ్ల ముందు గుంతలు తవ్వించారని కిషన్‌రెడ్డి విమర్శించారు. కరెంటు నిలిపేయడం, నల్లా కనెక్షన్, డ్రైనేజీ లైన్‌ను తొలగించి ఇబ్బందులకు గురిచేసిన సంఘటనల్ని ప్రజలు మరిచిపోలేదన్నారు. టీడీ పీ, బీజేపీని గెలిపిస్తే జవాబుదారీగా ఉంటామని చెప్పారు. టీఆర్‌ఎస్‌కు గెలిచే బలం లేక ఇతర పార్టీల నాయకులను పోటీలో నిలిపిందని రమణ, ఎర్రబెల్లి అన్నారు. హైదరాబాద్‌ను అన్ని రంగాల్లో నిర్వీర్యం చేసేందుకు టీఆర్‌ఎస్, ఎంఐఎంలు కుమ్మక్కయ్యాయని మండిపడ్డారు. అభివృద్ధి కోసం టీడీపీ, బీజేపీని గెలిపించాలని, అన్ని వర్గాల ప్రజలు సామరస్యంగా కలిసి ఉండేందుకు తాము అండగా ఉంటామని అన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ రామచందర్ రావు, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి, బీజేపీ నేత మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
మేనిఫెస్టో ప్రధానాంశాలు
ప్రతి ఇంటికి మంచినీరు, పేదలకు ఉచిత నల్లా కనెక్షన్
వైఫై నగరంగా ైెహ దరాబాద్
ప్రతి ఇంటికి పైపులైన్ ద్వారా గ్యాస్ సరఫరా
ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు, పూర్తిస్థాయిలో డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి
ప్రతి డివిజన్‌లో మొబైల్ హాస్పిటల్స్, ఉచితంగా మందుల పంపిణీ
ప్రతి ఇంటికి ఉచితంగా సెట్‌టాప్ బాక్స్ పంపిణీ
50 జంక్షన్లలో ఫ్లై ఓవర్ల నిర్మాణం
మెట్రో రైలు విస్తరణ, ఎంఎంటీఎస్ రెండోదశ పూర్తి, మూడోదశకు కృషి
200 వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల ఏర్పాటు
మినీ ట్యాంకుబండ్లుగా 50 చెరువుల అభివృద్ధి
50 కోట్లతో జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం ఏర్పాటు
350 కోట్లతో జీవ వైవిధ్య పరిశోధన కేంద్రం ఏర్పాటు
రూ. 500 కోట్లతో ఎన్‌ఐపీఈఆర్‌కు శాశ్వత భవనం
రూ. 1200 కోట్లతో ఈఎస్‌ఐ మెడికల్ కాలేజీ,
రూ. 250 కోట్లతో నాచారంలో ఈఎస్‌ఐ ఆస్పత్రి
స్వచ్ఛ భారత్ పథకంలో భాగంగా స్వచ్ఛ హైదరాబాద్‌కు రూ.498 కోట్లు కేటాయింపు
అంబర్‌పేట చే నంబర్ చౌరస్తా నుంచి రామాంతపూర్ వరకు రూ.160 కోట్లతో ఫ్లైఓవర్ నిర్మాణం
కేంద్రం సహకారంతో హైదరాబాద్‌కు అవసరయమ్యే 600 మెగావాట్ల విద్యుత్ కేంద్రం నిర్మాణం
రూ. 50వేల కోట్ల పెట్టుబడులతో 10 లక్షల మందికి  ఉపాధి లభించే జాతీయ పెట్టుబడులు, ఉత్పాదక మండలి ఏర్పాటు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement