ఖైరతాబాద్
కారుకు స్పీడెక్కువ
ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు మాత్రం టీఆర్‌ఎస్‌కు బహ్మ్రారథం పట్టారు. ఈ స్థానంలో టీడీపీ బలపరిచిన బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నా, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఈ కూటమి ఒక్క సీటును కూడా గెలువ లేకపోయింది. నియోజకవర్గ పరిధిలోని ఆరు డివిజన్లలో టీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయం సాధించి , తిరుగులేని అధిక్యతను చాటారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 19,768 ఓట్లు రాగా, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 69,886 ఓట్లు సాధించి, గతం కంటె 50,118 ఓట్ల అధిక్యత సాధించింది. బీజేపీ-టీడీపీ కూటమికి గతంలో 53,102 ఓట్లు రాగా, ఈ ఎన్నికల్లో మాత్రం 35,793 ఓట్లతో సరిపెట్టుకోవాల్సివచ్చింది. కాంగ్రెస్ గత ఎన్నికల్లో 32,256 ఓట్లు రాగా, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మాత్రం 17,834 ఓట్లు వ చ్చాయి.
జూబ్లీహిల్స్‌లో...
సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కారు జోరుతో సైకిల్ పంక్చర్ కాగా, కమలం వాడిపోయింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో టీడీపీ-బీజేపీ కూటమికి ప్రజలు కోలుకోలేని షాక్ ఇచ్చారు. ఈ నియోజకవర్గాల్లో ఆయా పార్టీల ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్నా ఒక్క సీటును గెలిపించుకోలేక పోయారు. గ్రేటర్ హైదరాబాద్ టీడీపీ అధ్యక్షుడు మాగంటి గోపినాథ్ ప్రాతినిథ్యం వహిస్తున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయకు 50,898 ఓట్లు రాగా, టీఆర్‌ఎస్ 18,436 ఓట్లతో మూడవ స్థానంలో నిలిచింది. ఎంఐఎం 41,656 ఓట్లు సాధించి రెండవ స్థానంలో నిలిచింది. ప్రస్తుత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం 33,634 ఓట్లు సాధించి రెండవ స్థానాన్ని నిలుబెట్టుకున్నా, టీడీపీ-బీజేపి కూటమి 21,329 ఓట్ల చావుదెబ్బతింది. కాంగ్రెస్‌కు అసెంబ్లీ ఎన్నికల్లో 33,642 ఓట్లు రాగా, ఈ ఎన్నికల్లో మాత్రం 20,135 ఓట్లతో సరిపెట్టుకున్నా గ తంలో కంటే 13,507 ఓట్లు తగ్గాయి. ఈ నియోజకవర్గంలోని ఆరు డివిజన్లలో టీఆర్‌ఎస్ నాలుగు, ఎంఐఎం రెండు స్థానాల్లో విజయం సాధించాయి.
సికింద్రాబాద్ ఏకపక్ష తీర్పు
సికింద్రాబాద్: సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలు ఏకపక్ష తీర్పు ఇచ్చారు. తార్నాక మినహా మిగతా నాలుగు డివిజన్లలో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ అభ్యర్థులకు కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పద్మారావుగౌడ్‌కు 36, 600 మెజార్టీ కట్టబెట్టిన లష్కర్ ఓటర్లు ప్రస్తుత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 59,987ఓట్ల భారీ మెజారిటీ ఇచ్చారు.
నగరంలోనే రికార్డు
సీతాఫల్‌మండి టీఆర్‌ఎస్ అభ్యర్థి సామలహేమ భారీ మెజారిటీ సాధించారు. టీడీపీ అభ్యర్థి మేకల కీర్తికి 4208ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి ఆర్.వాణికి 1899ఓట్లు రాగా. సామలహేమ 19,279ఓట్లు సాధించి రికార్డు సృష్టించారు.
డిపాజిట్ దక్కించుకున్న మాజీ మేయర్
నియోజకవర్గ పరిధిలోని తార్నాక డివిజన్ నుంచి పోటీచేసిన గ్రేటర్ మాజీ మేయర్ బండ కార్తీకారెడ్డి మాత్రమే డిపాజిట్ దక్కించుకున్నారు. తార్నాక డివిజన్‌లో 29,367 ఓట్లు పోలవగా అధికార టీఆర్‌ఎస్ అభ్యర్థి ఆలకుంట సరస్వతికి 18,051 ఓట్లు పడగా, మాజీ మేయర్ బండ కార్తీకారెడ్డి కేవలం 5110 ఓట్లతో సరిపెట్టుకుని డిపాజిట్ దక్కించుకున్నారు.
మట్టికరిచిన మాజీలు
నియోజకవర్గంలోని రెండు డివిజన్ల నుంచి ముగ్గురు మాజీ కార్పొరేటర్లు పోటీచేసినా అందరూ పరాజయం పాలయ్యారు. తార్నాక డివిజన్ నుంచి పోటీచేసిన మాజీ మేయర్, కాంగ్రెస్ అభ్యర్థి బండ కార్తీకారెడ్డి, బౌద్దనగర్ డివిజన్ నుంచి ఇద్దరు మాజీ కార్పోటర్లు ఆదం ఉమాదేవి (కాంగ్రెస్), పీ.స్వరూపాగౌడ్ (బీజేపీ)లు పరాజయం పాలయ్యారు. ఐదు డివిజన్లలో విజయదుంధుభి మోగించిన ఐదుగురు మహిళలు రాజకీయాలకు కొత్త కావడం గమనార్హం.
ఎల్‌బీ నగర్... ఎల్‌బీనగ ర్‌లో కారు జోరు
ఎల్‌బీనగర్: ఎల్‌బీనగర్ నియోజకవర్గంలో కారు దూసుకెళ్లింది. ప్రత్యర్థి పార్టీలు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ కారు స్పీడును ఎక్క డా అందుకోలేకపోయాయి. 11 డివిజన్లకు గాను అన్ని డివిజన్లలో టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. కొన్ని డివిజన్లలో టీడీపీ అభ్యర్థులు అధికార టీఆర్‌ఎస్ పార్టీకి చెప్పుకోదగ్గ రీతిలో పోటీ ఇవ్వగలిగారు. సెటిలర్లు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, ఇళ్ల పట్టాల పంపిణీ, ఇంటి స్థలాల క్రమబద్దీకరణ తదితర హామీలు టీఆర్‌ఎస్ విజయం చేకూర్చాయని భావిస్తున్నారు. నియోజకవర్గంలో పార్టీ గెలుపు బాధ్యతలు తీసుకున్న మంత్రి జగదీష్‌రెడ్డి తమ అభ్యర్థులను గెలిపించుకోవడంలో సఫలీకృతులయ్యారు. కాగా 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 71791 ఓట్లు రాగా ఈసారి పార్టీ రెట్టింపు స్థాయిలో ఓట్లు దక్కించుకోవడం విశేషం. కాంగ్రెస్‌కు 56489 ఓట్లు, టీడీపీ, బీజేపీ కూటమికి 84,316 ఓట్లు దక్కాయి. తమ ఓటు బ్యాంకును కాపాడుకోవడంలో ఆయా పార్టీలు విఫలమయ్యాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
హస్తానికి షాక్..
ఇదిలా ఉండగా అన్ని డివిజన్లలోనూ కాంగ్రెస్‌పార్టీ మూడో స్థానానికి పరిమితం కావడం విశేషం. బీఎన్‌రెడ్డి నగర్‌లో ఆ పార్టీ వెయ్యి ఓట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఒక్క కార్పొరేటర్‌ను గెలిపించుకోని సిట్టింగ్ ఎమ్మెల్యే
ఎల్భీనగర్ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య నియోజకవర్గంలో ఒక్క డివిజన్‌లోనూ తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోకపోవడం గమనార్హం.
పరువు నిలబెట్టుకున్న రామ్మోహన్
గత సార్వత్రిక ఎన్నికల్లో 71791 ఓట్లు సాధించి ఓటమి పాలయినప్పటికీ బల్దియా ఎన్నికల్లో గణనీయంగా పుంజుకుంది. ఈ సారి 11 డివిజన్లలో పాగా వేయడంతో పరువును నిలబె ట్టుకున్నట్లైంది.
అంబర్‌పేట తారుమారు
అంబర్‌పేట: అంబర్‌పేట నియోజకవర్గంలో అనుహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాజకీయ పార్టీల బలాబలాలు పూర్తిగా మారిపోయాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుపొందగా, టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఆయన దరిదాపుల్లోకి కూడా రాలేకపోయారు. అయితే ప్రస్తుత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పరిస్థితి పూర్తిగా తారుమారైంది. నియోజకవర్గంలో 48 శాతం పోలింగ్ నమోదు కాగా, ఐదు డివిజన్లను టీఆర్‌ఎస్ కైవసం చేసుకోవడం గమనార్హం. 2009 బల్దియా ఎన్నికల్లో నియోజకవర్గ పరిధిలోని ఏడు డివిజన్లో మూడింటిలో కాంగ్రెస్, ఒకటి బీజేపీ, ఒకటి టీడీపీ, ఒకటి ఎంఐఎం, ఒకదానిలో స్వతంత్య్ర అభ్యర్థి గెలుపొందారు. ప్రస్తుత ఎన్నికల్లో అందుకు భిన్నంగా ఒకే పార్టీకి ఓటర్లు పట్టం కట్టడం విశేషం.
ముషీరాబాద్
అయ్యో... లక్ష్మణా..!
సిటీబ్యూరో; బీజేపీ శాసనసభ పక్షనేత లక్ష్మణ్ ప్రాతినిథ్యం వహిస్తున్న ముషీరాబాద్ నియోజకవర్గంలో కారు జోరందుకుంది. నియోజకవర్గ పరిధిలోని ఆరు డివిజన్లలో బీజేపీ ఒక్క సీటును కూడా గెలువలేకపోయింది. ఇందులో ఐదు డివిజన్లలో టీఆర్‌ఎస్ హవా కొనసాగగా, మిగిలిన మరో స్థానాన్ని ఎంఐఎం కైవసం చేసుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే..బీజేపీ-టీడీపీ కూటమి హోరంగా దెబ్బతినగా, టీఆర్‌ఎస్ మాత్రం రెట్టింపు బలాన్ని పుంజుకుంది. కాంగ్రెస్ పార్టీ చతికిలపడింది. ఎంఐఎం ఒక స్థానాన్ని గెలుచుకొని, నియోజకవర్గంలో పాగాకు ప్రయత్నిస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-టీడీపీ కూటమికి 65,209 ఓట్లు రాగా, ఈ ఎన్నికల్లో 28,762 ఓట్లతోనే సరి పెట్టుకోవాల్సివచ్చింది. ఎంఐఎం 12,122 ఓట్లు సాధించి ఉనికిని చాటుకుంది.
మల్కాజిగిరి కారుకు బ్రహ్మరథం
సిటీబ్యూరో : మల్కాజిగిరి నియోజకవర్గంలోని 9 డివిజన్లలోనూ టీఆర్‌ఎస్ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. మచ్చబొల్లారం, అల్వాల్, వెంకటాపురం, నేరేడ్‌మెట్, ఈస్ట్‌ఆనంద్‌బాగ్, మల్కాజిగిరి, వినాయక్‌నగర్, మౌలాలీ, గౌతమ్‌నగర్‌లలో టీఆర్‌ఎస్ ఘన విజయం సాధించింది. అల్వాల్‌లో పోటీ చేసిన టీఆర్‌ఎస్ అభ్యర్ధి, ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి కోడలు చింతల విజయశాంతి 10,616 ఓట్లతో సమీప ప్రత్యర్ధి బీజేపీ అభ్యర్ధిపైన విజయం సాధించారు. అల్వాల్‌లో బీజేపీ అభ్యర్ధికి 3,072 ఓట్లు మాత్రమే లభించడం గమనార్హం. మచ్చబొల్లారం డివిజన్ నుంచి పోటీ చేసిన టీఆర్‌ఎస్ అభ్యర్ధి జితేందర్‌నాగ్‌ను రెండవ సారి కూడా ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించారు. ఆయన ఏకంగా 13,557 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మొత్తంగా గత మెజారిటీని అధిగమించి ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయం సాధించింది. .2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 77,132 ఓట్లు లభించగా, ప్రస్తుత గ్రేటర్ ఎన్నికల్లో 90 వేలకు పైగా ఓట్లు లభించాయి.
శివార్లలోనూ... అదే హోరు!
Published Sat, Feb 6 2016 1:50 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM
Advertisement