7 నామినేషన్లు ఉపసంహరణ
టీఆర్‌ఎస్, టీడీపీ, రిజిస్టర్డ్ పార్టీల నుంచి ఒక్కొక్కరు
నలుగురు ఇండిపెండెంట్లు
సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ మంగళవారం ప్రారంభమైంది. తొలిరోజు ఏడుగురు అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. వీరిలో అధికార పార్టీ టీఆర్‌ఎస్ నుంచి ఒకరు... ప్రతిపక్ష టీడీపీ నుంచి ఒకరు ఉన్నారు. ఎన్నికల సంఘం వద్ద పేరు నమోదు చేసుకున్న పార్టీ నుంచి మరొకరు... ఇండిపెండెంట్లు నలుగురు ఉపసంహరించుకున్నారు. సరూర్‌నగర్ డివిజన్ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కందాడి లత... అక్బర్‌బాగ్ డివిజన్‌కు టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన మహ్మద్ అఫ్జల్ షా ఖాన్ ఉపసంహరించుకున్నారు. దత్తాత్రేయ నగర్ నుంచి రిజిస్టర్డ్ పార్టీకి చెందిన అభ్యర్థి, గచ్చిబౌలి నుంచి ఇద్దరు, ఉప్పుగూడ, కొండాపూర్‌ల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఇండిపెండెంట్లు నామినేషన్లు ఉపసంహరించుకున్నారని జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ సురేంద్ర మోహన్(ఎన్నికలు) తెలిపారు. మంగళవారం సాయంత్రం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ....మొత్తం 150 వార్డుల స్క్రూటినీ మంగళవారం మధ్యాహ్నానికి పూర్తయిందని చెప్పారు. వివరాలిలా ఉన్నాయి... మొత్తం 4,039 నామినేషన్లకుగాను 189 తిరస్కరించారు. మిగతా 3,850 నామినేషన్లను అధికారులు ఆమోదించారు. పార్టీల వారీగా పరిశీలిస్తే టీఆర్‌ఎస్- 839, టీడీపీ-658, కాంగ్రెస్-659, బీజేపీ-426, ఎంఐఎం- 85, బీఎస్‌పీ-106, సీపీఐ-29,సీపీఎం-41, లోక్‌సత్తా-47, రిజిస్టర్డు పార్టీలు-74, ఇండిపెండెంట్లు-886 ఉన్నాయి.
హోర్డింగుల తొలగింపు
ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో అమలులో భాగంగా ఇప్పటి వరకు 1,71,641 అనధికార ప్రచార హోర్డింగులు, ఫ్లెక్సీలు తొలగించామని సురేంద్రమోహన్ తెలిపారు. శాంతిభద్రతల అంశాల్లో భాగంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ 1,363 లెసైన్సుడు ఆయుధాలను స్వాధీనపరచుకున్నారని, 372 మందిని బైండోవర్ చేశారని తెలిపారు. ఇరవై మందికి నాన్‌బెయిలబుల్ వారెంట్లు జారీ చేసినట్లు చెప్పారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 182 మందిని బైండోవర్ చేసినట్లు తెలిపారు. సమావేశంలో జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్ శివకుమార్‌నాయుడు పాల్గొన్నారు.