పొత్తుల ఎత్తులు షురూ
గ్రేటర్‌లో టీడీపీ, బీజేపీ కూటమి సీట్ల పంపకాలపై చర్చ
సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కూటమిగా ఏర్పడిన టీడీపీ, బీజేపీ మధ్య పొత్తుల ఎత్తులు మొదలయ్యాయి. గురువారం సాయంత్రానికి ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయాలనే అంశంలో స్పష్టత రానుంది. ఇప్పటికే బీజేపీ నేతలు తాము పోటీ చేసేందుకు అనుకూలంగా ఉన్న డివిజన్ల జాబితాను టీడీపీ నేతలకు అందజేశారు.
బుధవారం రాత్రి రెం డో విడత చర్చలు ప్రారంభమయ్యాయి. ఇరు పార్టీల నేతలు సమావేశమై తొలుత సీట్ల లెక్క లు తేల్చుకొని తర్వాత ఎవరెవరు ఎక్కడ పోటీ చేయాలనే అంశంపై చర్చించనున్నట్టు సమాచారం. టీడీపీ నేతలు ఎల్.రమణ, ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవంత్‌రెడ్డి, బీజేపీ నేతలు జి.కిషన్‌రెడ్డి, కె.లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి తదితరులు సీట్ల పంపకంపై చర్చించారు.
2009లో గెలిచిన సీట్లు పోగా...
2009 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీడీపీ 150 సీట్ల లో ఒంటరిగా పోటీ చేసి 45 సీట్లు గెలిచింది. బీజేపీ ఆరింట నెగ్గింది. ఈ రెండు పార్టీలు.. 2009లో గెలిచిన సీట్లు పోగా మిగిలిన 99 సీట్లలో పొత్తులపై చర్చలుంటాయని రేవంత్ పేర్కొన్నారు. శివార్లలోని 50 డివిజన్లలోనే టీడీపీ గత ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు సాధించింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లోనూ గ్రేటర్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో టీడీపీ 10, బీజేపీ 5 స్థానాలు గెల్చుకున్నాయి. ఇది పొత్తుల్లో ముఖ్య పాత్ర పోషిస్తుందని టీడీపీ నేత ఒకరు పేర్కొన్నారు.
ఏ సీటు ఎవరికి?
సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలిచిన అంబర్‌పేట, ఖైరతాబాద్, గోషామహల్, ఉప్పల్, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో మెజారిటీ సీట్లు తీసుకోవాలని బీజేపీ యోచిస్తోంది. సనత్‌నగర్, జూబ్లీహిల్స్, కంటోన్మెంట్(ఒక్కసీటే)తో పాటు శివార్లలోని శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్, రాజేంద్రనగర్, మహేశ్వరంలో టీడీపీ అధిక సీట్లలో పోటీ చేసే అవకాశముంది. టీఆర్‌ఎస్ గెలిచిన సికింద్రాబాద్, మల్కాజిగిరిలో చెరి సగం పోటీ చేయవచ్చు.
ఎంఐఎం ప్రాబల్యం ఉన్న పాతబస్తీలో 7 నియోజకవర్గాల్లో పోటీ నామమాత్రమే కావడంతో సమానంగా పంచుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీ, బీజేపీ పొత్తు 3:1 ప్రాతిపదికన ఉంటుందని టీడీపీ నేతలు చెబుతున్నారు.