బీసీ కమిషన్ కార్యాలయం ముందు నిరసన తెలుపుతున్న ఆర్.కృష్ణయ్య, టీజీటీ అభ్యర్థులు
హైదరాబాద్: రాజ్యాంగ బద్ధంగా ఏర్పడ్డ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిజర్వేషన్లు పాటించకపోవడం దారుణమని బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. గురుకుల టీచర్ల రిక్రూట్‌మెంట్‌లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను సక్రమంగా అమలు చేయలేదని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నిరుద్యోగులు ఖైరతాబాద్‌లోని బీసీ కమిషన్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు.
ఈ కార్యక్రమానికి ఆర్.కృష్ణయ్య మద్దతు తెలిపారు. అనంతరం బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులకు వినతిపత్రం ఇచ్చారు. నియామకాల్లో ఓపెన్ కాంపిటేషన్ లాస్ట్ కటాఫ్ మార్కుల తర్వాత రిజర్వేషన్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా.. ఓపెన్ కాంపిటేషన్‌లో రావాల్సిన మెరిట్ అభ్యర్థులను కూడా రిజర్వేషన్‌లో భర్తీ చేయడంతో రిజర్వేషన్లకు పూర్తిగా గండికొట్టినట్టయ్యిందన్నారు. ఈ విధానం వల్ల సుమారు 400 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, టీజీటీ జేఏసీ అధ్యక్షుడు శ్రీను పాల్గొన్నారు.
ఘంటా చక్రపాణిని పదవి నుంచి తొలగించాలి: టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణిని తక్షణమే ఆ పదవి నుంచి తొలగించాలని ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఆందోళన అనంతరం మీడియాతో మాట్లాడుతూ నష్టపోయిన విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతూ అభ్యర్థులు కమిషన్ వద్దకు వెళితే ముందస్తు అరెస్టులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఉద్యోగ నియామకాల భర్తీలో చక్రపాణి వైఫల్యం చెందారని మండిపడ్డారు. రిజర్వేషన్లను సక్రమంగా అమలు చేస్తూ రివైజ్డ్ సెలక్షన్ లిస్ట్‌ను ప్రకటించాలని టీఎస్‌పీఎస్సీని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment