bc welfare society
-
కొత్తగా మూడు గురుకుల జూనియర్ కళాశాలలు మంజూరు
సాక్షి, అమరావతి: మహాత్మా జ్యోతిబా ఫూలే ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలో మరో మూడు కొత్త జూనియర్ కాలేజీలు మంజూరు అయ్యాయి. ఇప్పటికే రాష్ట్రంలో 14 జూనియర్ కాలేజీలు ఉండగా, కొత్తగా మంజూరైన వాటితో కలిపి ఆ సంఖ్య 17కు చేరింది. కొత్త జూనియర్ కాలేజీలను ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించారు. నంద్యాల జిల్లా డోన్ అసెంబ్లీ నియోజకవర్గంలోని బేతంచర్ల(బాలురు), చిత్తూరు జిల్లా పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని సదూం(బాలురు), శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస(బాలికలు) కాలేజీలు ప్రారంభమయ్యాయి. ఒక్కో కాలేజీలో ఎంపీసీ 40, బైపీసీ 40 సీట్లు చొప్పున కేటాయించారు. కాగా, రాష్ట్రంలో బీసీ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలో మొత్తం 105 గురుకులాలు ఉన్నాయి. వాటిలో 17 జూని యర్ కాలేజీలు కాగా, మిగిలిన 88 పాఠశాలల్లో 5 నుంచి 10వ తరగతి వరకు క్లాసులు నిర్వహిస్తున్నారు. మొత్తం 44 వేల మంది విద్యార్థులు వీటిలో చదువుతున్నారు. నీట్, జేఈఈలో బీసీ విద్యార్థుల ప్రతిభ నీట్, జేఈఈ పరీక్షల్లో బీసీ విద్యార్థులు ప్రతిభ చూపారని మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి కృష్ణమోహన్ తెలిపారు. వాటి ఫలితాలను అంచనా వేస్తే మెడికల్ సీట్లు నలుగురు, డెంటల్ ఒకరు, వెటర్నరీ నలుగురు, అగ్రికల్చర్ బీఎస్సీ సీట్లు నలుగురు సాధించే అవకాశం ఉందని చెప్పారు. ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ ఆరుగురు విద్యార్థులు, ఇంజినీరింగ్ సీట్లు 24 మంది సాధించనున్నారని వివరించారు. -
బీసీల మహాధర్నాతో హోరెత్తిన జంతర్‌మంతర్
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నోఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న బీసీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమంతో జంతర్‌మంతర్ హోరెత్తింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా మంగళవారం బీసీ సంక్షేమ సంఘం, రాష్ట్రీయ ఓబీసీ మహా సంఘ్ ఆధ్వర్యంలో ‘బీసీల మహాధర్నా’ జరిగింది. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీసీలంటే కేంద్ర ప్రభుత్వానికి చిన్నచూపు ఎందుకని ప్రశ్నించారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే బీసీ బిల్లు ప్రవేశపెట్టి.. చట్టసభల్లో 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి, కేంద్ర బడ్జెట్లో బీసీలకు కనీసం రూ.లక్ష కోట్లు కేటాయించాలని కోరారు. వైఎస్సార్ సీపీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు మాట్లాడుతూ బీసీ కులగణన, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు, జనాభా దామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్లను 27 శాతం నుండి 50%కి పెంచాలన్న డిమాండ్లపై పార్లమెంట్లో రోజూ పోరాడుతున్నామని చెప్పారు. సామాజిక న్యాయానికి వైఎస్సార్సీపీ కట్టుబడి ఉందన్నారు. బీసీల పోరాటానికి వైఎస్సార్సీపీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ తాను బీసీ ప్రధానినని చెప్పుకొంటున్నా.. తొమ్మిదేళ్ల పాలనలో బీసీలకు చేసిందేమీ లేదని బీఆర్ఎస్ ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్ మండిపడ్డారు. బీసీలకు 50% రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. బీసీలంతా రాజకీయ పార్టీలకు అతీతంగా, ఐక్యంగా ముందుకు సాగితే కేంద్రం దిగిరాక తప్పదని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేశన శంకరరావు అన్నారు. ధర్నాను బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి కుమ్మర క్రాంతి కుమార్ యాదవ్ సమన్వయం చేయగా.. ప్రొఫెసర్ భవన్ రావు తైవాడే (మహారాష్ట్ర), ప్రొఫెసర్ జోగేంద్ర కవాడే, మాజీ ఎంపీ ఇంద్రజిత్ సింగ్ (పంజాబ్), హన్సరాజ్ (ఢిల్లీ) రాజేష్ షైనీ (హరియాణా), విక్రమ్ సాహా మాట్లాడారు. -
పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ‘బీసీ బిల్లు’ పెట్టి బీసీలకు చట్ట సభల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద గురువారం నిరసన ప్రదర్శన చేపట్టారు. బీసీలకు గొర్రెలు–బర్రెలు కాదు, రాజ్యాధికారం కావాలంటూ నినాదాలు చేశారు. నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు సురేశ్, గుజ్జ కృష్ణ, లాకా వెంగళ్ రావు, లాల్ కృష్ణ, గుజ్జ సత్యం తదితరులు ప్రసంగించారు. ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీ బిల్లు పెట్టేందుకు వైఎస్సార్సీపీ, టీఆర్ఎస్, టీడీపీ, డీఎంకే, అన్నాడీఎంకే సహా 18 పార్టీలు మద్దతు ఇచ్చేందుకు అంగీకారం తెలిపాయన్నారు. బీజేపీ అంగీకరిస్తే ఒక్క రోజులోనే బిల్లు పాసవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కులగణన డిమాండ్‌తో ఓబీసీ సెమినార్.. దేశంలో వచ్చే జనాభా లెక్కల్లో కులగణన చేయాలనే డిమాండ్‌తో ఢిల్లీలోని ఏపీభవన్‌లో బీసీ సంఘాల నేత ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో ఆలిండియా ఓబీసీ సెమినార్ నిర్వహించారు. కార్యక్రమానికి వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, తలారి రంగయ్య, డా.సంజీవ్, రెడ్డెప్ప, అనురాధ, అయోధ్య రామిరెడ్డి, వంగా గీత హాజరయ్యారు. విజయసాయిరెడ్డి మాట్లాడుతూ..సామాజిక న్యాయ చరిత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలన సువర్ణాధ్యాయమన్నారు. బీసీల కోసం అనేక పథకాలు రూపొందించారని, సంక్షేమంతో పాటు అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఎస్సీ–ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తున్న తరహాలోనే చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల్లో 10 సీట్లు బీసీలకు ఇచ్చి పూర్తి ప్రాధాన్యత కల్పించారని వివరించారు. -
సీఎం జగన్ చర్యలు అన్ని రాష్ట్రాలకు ఆదర్శం
సాక్షి, అమరావతి: కేంద్రం త్వరలో నిర్వహించబోయే జనగణన–2021లో కులగణన కూడా చేపట్టాలని మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేయడంతోపాటు అసెంబ్లీలో కూడా తీర్మానం చేయాలని నిర్ణయించటంపై జాతీయ బీసీ సంక్షేమసంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఒక ప్రకటనలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ ఎంపీలు రాజ్యసభలో బీసీ బిల్లును ప్రవేశపెట్టి చరిత్ర స్పష్టించారని, 74 ఏళ్ల చరిత్రలో ఏ రాజకీయ పార్టీ బీసీ బిల్లు పెట్టలేదని పేర్కొన్నారు. దేశంలో బీసీ పార్టీలుగా ముద్రపడినవి కూడా బీసీ బిల్లు పెట్టడానికి ముందుకు రాలేదని తెలిపారు. జగన్ తమ పార్టీ పరంగా బీసీ బిల్లు పెట్టి తాము బీసీల పక్షమని నిరూపించుకున్నారన్నారు. దేశ చరిత్రలోనే ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో 56 బీసీ కుల కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత జగన్‌దేనని తెలిపారు. రాష్ట్రంలో నామినేటెడ్ పదవులు, కాంట్రాక్టుల్లో 50% బీసీలకు ఇవ్వాలని అసెంబ్లీలో చట్టం చేశారని గుర్తుచేశారు. జగన్ ప్రభుత్వం చేపట్టిన చర్యల కారణంగా పేద కులాల్లో ఒక మౌలికమైన మార్పునకు పునాదులు ఏర్పడ్డాయన్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలు దేశంలో అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నాయని తెలిపారు. ఇటీవల తాను సీఎం జగన్‌ను కలిసినప్పుడు లోకసభలో బీసీ బిల్లు పెట్టాలని కోరగా సుముఖంగా స్పందించారని, అందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. -
జాతీయ బీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా దాసు సురేశ్
సాక్షి, హైదరాబాద్/ముషీరాబాద్: జాతీయ బీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా దాసు సురేశ్ నియమితులయ్యారు. శుక్రవారం విద్యానగర్‌లోని బీసీ భవన్లో జరిగిన కార్యక్రమానికి బీసీ సంక్షేమసంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హాజరై.. సురేశ్‌ను జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా అధికారికంగా ప్రకటించి నియామకపత్రాన్ని అందజేశారు. అనంతరం కృష్ణయ్య మాట్లాడుతూ.. క్షేత్రస్థాయి నుంచి ఢిల్లీ వరకు అన్ని రాష్ట్రాల్లో బీసీలను బలోపేతం చేయడానికి సురేశ్‌ను నియమించామన్నారు. సురేశ్ మాట్లాడుతూ.. అన్ని బీసీ వర్గాలను బలోపేతం చేసి రాజ్యాధికారం దిశగా బీసీలను నడిపించనున్నట్లు వెల్లడించారు. అనంతరం జాతీయ బీసీ సేనా అధ్యక్షుడు బర్క కృష్ణయాదవ్ అధ్యక్షతన జరిగిన కార్యవర్గ సమావేశానికి కృష్ణయ్య హాజరయ్యారు. బీసీబంధు పథకం వెంటనే ప్రవేశపెట్టాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. -
ఓబీసీల హక్కులకు బాసటగా నిలవాలి
సాక్షి, హైదరాబాద్: వెనకబడిన తరగతుల హక్కుల రక్షణ బాధ్యత జాతీయ బీసీ కమిషన్(ఎన్సీబీసీ)పై ఉందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వ్యాఖ్యానించారు. బీసీల అభ్యున్నతికి ఈ కమిషన్ మరింత పాటుపడాలని సూచించారు. ఎన్సీబీసీ రెండేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆదివారం ఇక్కడి ఖైరతబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్లో ఆ కమిషన్ చైర్మన్ భగవాన్లాల్ సహానీ అధ్యక్షతన జరిగిన జాతీయ సదస్సులో తమిళిసై మాట్లాడారు. ఎన్సీబీసీ పనితీరు మెరుగ్గా ఉందని, దీంతో క్షేత్రస్థాయిలో ఓబీసీల్లో ధైర్యాన్ని నింపిందని కొనియాడారు. ప్రధాని మోదీ వల్లే ఎన్సీబీసీకి చట్టబద్ధత, రాజ్యాంగ హోదా దక్కాయని అన్నారు. కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి మాట్లాడుతూ మోదీ కేబినెట్లో 27 మం ది బీసీలకు ప్రాతినిధ్యం కల్పించి బీసీల పట్ల బీజేపీ తన ప్రేమను చాటుకుందన్నారు. రిజర్వేషన్ల అంశం కేంద్ర పరిధిలో కాకుండా రాష్ట్రాలకే ఇచ్చిందని, నాగాలాండ్‌లో గిరిజనులకు అక్కడ 85 %ఎస్టీ రిజర్వేషన్లు అమలవుతున్నాయని గుర్తుచేశారు. విద్యతోనే భవిష్యత్తు: దత్తాత్రేయ హరియాణ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ గొర్లు, బర్లు పంపిణీ చేస్తే లాభం ఉండదని, విద్యతోనే ఉత్తమ భవిష్యత్తుకు బాట వేసిన వాళ్లమవుతామని అభిప్రాయపడ్డారు. బీసీలకు కేటాయించిన 27 % రిజర్వేషన్లు పక్కాగా అమలయ్యేలా ఎన్సీబీసీ కఠినంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ రంగంతో సమానంగా ప్రైవేటు రంగంలో కూడా దళిత, బహుజనులు విజయం సాధించాలని ఆకాంక్షించారు. ప్రతి రంగంలో మహిళలకు సముచితస్థానం క ల్పించాల్సిన అవసరముందన్నారు.ఈ సందర్భంగా గవర్నర్ చేతుల మీదుగా ఎన్సీబీసీ రెండేళ్ల పురోగతి పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి ఎన్సీబీసీ రెండేళ్ల విజయాలను సభలో వివరించారు. బీసీ గణనపై రగడ జనగణనలో బీసీ కులాలవారీగా గణాంకాలు సేకరించాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం కార్యకర్తలు సభలో నినాదాలు చేశారు. దీంతో సభ కొంతసేపు గందరగోళంగా మారింది. పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనాకారులను అదుపులోకి తీసుకోవడంతో సభ సాఫీగా సాగింది. -
బీసీబంధు కోసం 8న రాష్ట్రవ్యాప్త ధర్నాలు
ముషీరాబాద్ (హైదరాబాద్): బీసీ బంధు పథకం ప్రవేశపెట్టి ప్రతీ కుటుం బానికి రూ.10 లక్షలు ఇవ్వాలని డి మాండ్ చేస్తూ ఈ నెల 8న అన్ని జిల్లా కలెక్టరేట్లను ముట్టడించాలని, ధర్నాలు చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్‌లోని బీసీ భవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం విడుదల చేయాలని కోరారు. -
పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ల బిల్లు పెట్టాలి
రాజమహేంద్రవరం సిటీ (సీటీఆర్ఐ)/పాలకొల్లు అర్బన్: చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు పార్లమెంట్లో బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 26న చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో 55 శాతం జనాభా కలిగిన బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించకుండా అణచివేస్తున్నారన్నారు. పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ల బిల్లు పెట్టడానికి 14 పార్టీలు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాయని చెప్పారు. బీజేపీ అంగీకరిస్తే ఒక్క రోజులోనే ఈ బిల్లు పాసవుతుందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా బీసీ కావడంతో ఆయనపైనే బీసీలు ఆశలు పెట్టుకున్నారని తెలిపారు. మోదీ హయాంలో ఈ బిల్లు పెట్టకపోతే చరిత్ర ఆయనను క్షమించదన్నారు. లోక్‌సభలో 94 మంది బీసీ ఎంపీలున్నారని, పార్టీలకతీతంగా వీరందరూ బిల్లుకు మద్దతివ్వాలని, లేకుంటే వారికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. 2021–22 జనగణనలో కులాల వారీగా బీసీ జనాభాను లెక్కించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలన్నారు. జాతీయ స్థాయిలో రూ.2 లక్షల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ ఏర్పాటు చేయాలని, జాతీయ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ రుణాలపై విధించిన షరతులను ఎత్తివేయాలని కోరారు. పంచాయతీరాజ్‌లో సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 52 శాతానికి పెంచాలి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశానికి ఆర్.కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పంచాయతీరాజ్ సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 52 శాతానికి పెంచాలని, వీటికి రాజ్యాంగ భద్రత కల్పించాలని కోరుతూ ఈ సమావేశంలో తీర్మానించారు. -
బోధనా సిబ్బంది నియామకాల్లో రిజర్వేషన్ల రద్దు వద్దు
సాక్షి, హైదరాబాద్: జాతీయ విద్యా సంస్థల్లో బోధనా సిబ్బంది నియామకాల్లో రిజర్వేషన్లు ఎత్తేయాలని నిపుణుల కమిటీ సూచించడంపై బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు అమలు చేయొద్దని కేంద్ర ప్రభుత్వం నియమించిన 8 మంది నిపుణుల కమిటీ సిఫార్సు చేయడం సరికాదని, వాటిని కేంద్రం తిరస్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం ప్రధానమంత్రి మోదీకి బీసీ సంక్షేమ సంఘం, బీసీ సంఘాల సమాఖ్య తరఫున ఆయన లేఖ రాశారు. రిజర్వేషన్లు ఎత్తివేయడమంటే దళిత, గిరిజన, బీసీ కులాలను అవమానించినట్లేనని పేర్కొన్నారు. ఇప్పటికే పలు ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటుపరం కావడంతో ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంతరాన్ని సరిచేయాల్సిన అవసరం కేంద్రంపై ఉందని గుర్తుచేశారు. -
ఈటలపై కుట్ర పన్నితే సహించం
సాక్షి, మహబూబ్‌నగర్(కొత్తకోట) : విప్లవ విద్యార్థి సంఘ నాయకుడిగా, సామాజిక ఉద్యమకారుడిగా, ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పని చేసిన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌పై కొన్ని వర్గాలు రాజకీయంగా ఎదగకుండా కుట్రలు పన్నుతున్నారని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతమైతే సహించమని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగంధర్‌గౌడ్ హెచ్చరించారు. శుక్రవారం మండల కేంద్రంలోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈటల రాజేందర్ బీసీలో అత్యున్నత స్థానంలో ఉన్నందున ఓర్వలేని కొందరు అగ్రకులాల వారు పనిగట్టుకొని లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారన్నారు. ప్రభుత్వ సమాచారాన్ని ఇతరులకు చేరవేస్తున్నారని అభూతకల్పనలు సృష్టిస్తూ ఆయనను మంత్రి వర్గం నుండి తొలగించాలని కుట్ర చేస్తున్నారని, అదే జరిగితే రాష్ట్రంలోని బడుగులు పిడుగులై పెద్ద ఎత్తున ఉద్యమిస్తారన్నారు. మూడు రోజుల్లో బీసీ యువజన, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలతో కలిసి భవిష్యత్ కార్యాచరణ రూపొందించి ఉద్యమిస్తామన్నారు. నాయకులు బాలరాజుగౌడ్,అంజన్నయాదవ్, కరాటే శివయాదవ్, రాఘవేందర్, ఆశోక్ కుమార్, శివ తదితరులు ఉన్నారు. -
రిజర్వేషన్లు పాటించకుంటే యూనివర్సిటీ ముట్టడి: జాజుల
సాక్షి,హైదరాబాద్: మెడికల్ కౌన్సెలింగ్‌లో రిజర్వేషన్లు పాటించకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు మెడికల్ సీట్లు దక్కకుండా చేశారని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. కాళోజీ హెల్త్ యూనివర్సిటీ అధికారులు, వీసీ ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రిజర్వేషన్ల ప్రకారం సీట్లు కేటాయించకపోతే ఈనెల 17న కాళోజీ యూనివర్సిటీని ముట్టడిస్తామని జాజుల హెచ్చరించారు. 550 జీవోను అమలు చేయకుండా, యూనివర్సిటీ అధికారులకు వక్ర భాష్యం చెబుతూ ఉన్నతాధికారులను, సంబంధిత మంత్రిని తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. జరిగిన రెండో కౌన్సెలింగ్‌ను రద్దు చేసి, మూడో కౌన్సెలింగ్‌లో రిజర్వేషన్లు పూర్తిగా అమలయ్యేలా చూడాలని మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. -
‘ఇంజనీరింగ్’ ఫీజులు పెంచకుండా చూడండి
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీలు ఫీజులను పెంచకుండా చర్యలు తీసుకోవాలని, పేద విద్యార్థులకు అన్యాయం జరగకుం డా చూడాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ కోరారు. ఈ మేరకు తెలంగాణ అడ్మిషన్, ఫీ రెగ్యులేటరీ కమిటీ చైర్మన్ జస్టిస్ స్వరూపరెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. ప్రస్తుతం దేశంలో ఏక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ఫీజును ఒకేసారి 40 శాతానికి పెంచుతున్నారన్నారు. దీంతో పేద బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు తీర్పును అడ్డం పెట్టుకుని ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేసేందుకు కొన్ని ప్రైవేటు కళాశాలలు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. వార్షిక ఫీజు కాకుండా, స్పెషల్ ఫీజు, యూనివ ర్సిటీ, అడ్మిషన్, రిజిస్ట్రేషన్ ఫీజు పేరుతో వేల రూపాయలు అక్ర మంగా వసూలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఇంజనీరింగ్ కాలేజీ లు ఫీజులు పెంచినా ప్రభుత్వం మాత్రం రూ.35 వేలు మాత్రమే ఇస్తుం దన్నారు. విద్య అనేది సామాజిక సేవ అనే భావనను తప్పించి ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల యజమాన్యాలు వ్యాపారం చేస్తు న్నాయన్నారు. ఇప్పటి వరకు ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ చేపట్టకుండా, కోర్టు తీర్పు కోసం ప్రభుత్వం ఎదురు చూడటం వల్ల విద్యార్థులు విద్యా అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందని, తక్షణమే కౌన్సెలింగ్, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభించాలన్నారు. యాజమాన్య కోటా సీట్లను ఆన్లైన్ ద్వారా భర్తీ చేయాలని కోరారు. -
ఏపీ మంత్రివర్గంలో సామాజిక న్యాయం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపు వర్గాలన్నింటి కీ న్యాయం జరిగిందని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గతంలో ఏ ప్రభుత్వంలోనూ దళిత, బహుజన వర్గాలకు ఈ స్థాయిలో మంత్రి పదవులు కేటాయించలేదన్నారు. ఇది నిజంగా చరిత్రాత్మక అంశమన్నారు. బీసీలకు స్పీకర్ పదవి ఇవ్వడం గొప్ప విషయమని, ఏపీ కేబినెట్లో బీసీలకు 7, ఎస్సీలకు 5, ఎస్టీ, మైనార్టీలకు 1, కాపులకు 4 మంత్రి పదవులు ఇచ్చారన్నారు. బడుగు, బలహీన వర్గాలకు ఎక్కువ పదవులు ఇవ్వడంతో వారి జీవితాల్లో తప్పకుండా మార్పు వస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు చూసి నేర్చుకోవాలన్నారు. తెలంగాణ మంత్రిమండలిలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని విమర్శించారు. -
తెలుగు రాష్ట్రాల్లో బీసీలకు అన్యాయం
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో బీసీలకు రాజకీయ పక్షాలు అన్యాయం చేస్తున్నాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆవేదన వ్యక్తపరిచారు. తెలంగాణ పార్లమెంట్, ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో బీసీ సంఘాలు అనుసరించాల్సిన వ్యూహంపై జాతీయ బీసీ సంఘం కోర్ కమిటీ సమావేశం విద్యానగర్‌లోని బీసీ భవన్లో శనివారం ఆర్.కృష్ణయ్య అధ్యక్షతన జరిగింది. ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు టికెట్లు కేటాయించకుండా అన్యాయం చేశా యని విమర్శించారు. వాస్తవానికి జనాభా ప్రకారం బీసీలకు 9 సీట్లు కేటాయించాలని, కానీ ఆ పార్టీలు వారిని ఓటు బ్యాంక్‌గానే చూస్తున్నాయని అన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ బీసీలకు కేవలం 4 ïసీట్ల చొప్పున కేటాయించి అన్యాయం చేశాయని విమర్శించారు. గ్రామాలలో బీసీ కులాల్లో విపరీతమైన రాజకీయ చైతన్యం వచ్చిందని, ఇష్టమొచ్చినట్లు టికెట్లు ఇస్తే గుడ్డిగా ఓట్లు వేయరని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు పెడితేనే రాజకీయంగా న్యాయం జరుగుతుందన్నారు. అందుకే ఎన్నికల మేనిఫెస్టోలో అన్ని రాజకీయ పార్టీలు రాజకీయ రిజర్వేషన్లు పెడతామని స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రత్యేకంగా బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించే పార్టీలకే బీసీలు అనుకూల నిర్ణయాలు తీసుకుంటారన్నారు. తటస్థంగా ఉంటే బీసీలకు ఇంకా 50 ఏళ్ల వరకు రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వరన్నారు. త్వరలో మరోసారి సమావేశమై విధాన ప్రకటన చేయాలని నిర్ణయించారు. పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభలలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్ల కల్పనకు ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలన్నారు. సమావేశంలో జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, నేతలు నీల వెంకటేష్, ఉపేందర్‌గౌడ్, శ్రీనివాస్, వేముల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
రాజ్యాంగ పరిరక్షణకు దేశ వ్యాప్తంగా సభలు: జాజుల
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగ పరిరక్షణకు దేశవ్యాప్తంగా సభలు నిర్వహించనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 12న నల్లగొండ, 13న విజయవాడ, 22న ఢిల్లీ, 27న ఒరిస్సాలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భారీ ఎత్తున సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తూ 48 గంటల్లో అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు ఇవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. జనా భాలో సగానికి పైగా ఉన్న బీసీలను పట్టించుకోకుండా కేవలం ఓట్ల లబ్ధి కోసం బీజేపీ ప్రభు త్వం కుట్ర చేసిందన్నారు. రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసినందుకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఈ సభలకు జాతీయ స్థాయి నాయకులు హాజరవుతారని తెలిపారు. -
బీసీలను ప్రభుత్వం మోసగించింది: జాజుల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం బీసీలను నమ్మించి మోసం చేసిందని బీసీ సం క్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అనంతరం మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన బీసీ సంఘాల అత్యవసర సమావేశంలో జాజుల పాల్గొని మాట్లాడారు. పంచాయతీరాజ్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, దీనిపై ప్రభుత్వానికి పెద్ద ఎత్తు న నిరసన తెలియజేస్తున్నట్లు చెప్పారు. బీసీ రిజర్వేషన్ ఉద్యమాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆప బోమని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజల్లో దోషిగా నిలబెట్టి రిజ ర్వేషన్లు దక్కించుకుంటామని తెలిపారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన సూర్యాపేట జిల్లా కలెక్టర్ సురేం ద్రను ఏకపక్షంగా బదిలీ చేసి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా అవమానించారన్నారు. రిజర్వేషన్ల కేసు హైకోర్టులో ఉండగానే ఎన్నికల నోటిఫికేషన్ ఎలా ఇస్తారని జస్టిస్ ఈశ్వరయ్య ప్రశ్నించారు. బీసీలకు మొదటి నుంచీ టీఆర్ఎస్ వ్యతిరేకమేనని ఇప్పుడు బీసీ రిజర్వేషన్లకు గండికొట్టి దాన్ని రుజువు చేసిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి బీసీల ఉసురు తగులుతుందని బీసీ యునైటెడ్ ఫ్రంట్ నాయకులు వీజీఆర్ నారగోని, పి.రామకృష్ణయ్య అన్నారు. -
రిజర్వేషన్ల సమస్యను పరిష్కరించండి
హైదరాబాద్ : పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై రెండు, మూడు రోజుల్లో బీసీ న్యాయ నిపుణులు, మేధావులు, బీసీ, కుల సంఘాలతో పాటు అన్ని రాజకీయ పార్టీలతో కలసి సమావేశం ఏర్పాటు చేసి శాశ్వతంగా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆల్ ఇండియా ఓబీసీ ఫెడరేషన్, తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అల్టిమేటం జారీ చేసింది. లేదంటే తెలంగాణ రాష్ట్ర సాధన స్ఫూర్తిగా బీసీ రిజర్వేషన్ల పరిరక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి, రాస్తారోకో వంటి కార్యక్రమాలతో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని నేతలు హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్లపై కోర్టుల్లో ప్రశ్నించకుండా 9 వ షెడ్యూల్లో చేర్చి రాజ్యాంగబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను 34 శాతం నుంచి 23 శాతానికి తగ్గించడాన్ని నిరసిస్తూ ఆల్ ఇండియా ఓబీసీ ఫెడరేషన్, తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద గురువారం బీసీల మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నేషనల్ ఓబీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ వి.ఈశ్వరయ్య మాట్లాడుతూ పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలులో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని అన్నారు. ఓబీసీ రిజర్వేషన్లు కేంద్రం, బీసీ రిజర్వేషన్లు రాష్ట్రం పరిధిలోనివని, బీసీ ముస్లిం రిజర్వేషన్లను 12 శాతానికి పెంచి కేంద్ర ఆమోదానికి పంపడం బూటకమన్నారు. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పుపై ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేసి స్టేను పునరుద్ధరించాలని కోరారు. రాజ్యాధికారం కోసం ఉద్యమిస్తాం: జాజుల బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల కుంపటి రాజుకుంటే రాయితీలు కాదని రాజ్యాధికారం కోసం ఉద్యమిస్తామన్నారు. గతంలో ఉన్న పటేల్, పట్వారీ వ్యవస్థను తీసుకు వస్తున్నారని, బీసీలను రాజకీయంగా ఎదగకుండా చేసే కుట్రలో ఇది భాగమన్నారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం ఎవరితో చర్చించకుండా మొండిగా ముందుకు పోతే జైలుకు వెళ్లడానికి, అఖరికి చావడానికైనా సిద్ధమేనన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె .లక్ష్మణ్ మాట్లాడుతూ బీజేపీ బీసీలకు సంబంధించిన 31 అంశాలను గుర్తించి సీఎం కేసీఆర్‌కు నివేదిస్తే ఏడాది గడిచినా ఒక్క అంశాన్ని అమలు చేయలేదని, కేసీఆర్‌కు సామాజిక స్పృహలేదన్నారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లపై కోర్టును సాకుగా చూపుతూ 34 శాతం నుంచి 23 శాతానికి తగ్గించడం శోచనీయమన్నారు. మాజీ ఎంపీ వి.హనుమంతరావు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లు తగ్గిస్తూ కేసీఆర్ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకు వస్తే ఆ పార్టీలోని కేశవరావు, డి. శ్రీనివాస్ వంటి నేతలు నోరు మెదపక పోవడం శోచనీయమన్నారు.శాసనమండలి పక్ష నేత షబ్బీర్‌అలీ మాట్లాడుతూ కేసీఆర్ పిట్టలదొర అని, ఎప్పుడు ఏ మాట చెబుతారో ఆయనకే తెలియదని అన్నారు. పీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ రాజకీయాలకతీతంగా బీసీ రిజర్వేషన్ల పరిరక్షణకు పోరాడాలన్నారు. కార్యక్రమంలో సాంబశివరావు, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, టీటీడీపీ నేతలు కూన వెంటేష్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు జి.భరత్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. 23న భారీ ధర్నా: కృష్ణయ్య హైదరాబాద్: గ్రామపంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీల్లో బీసీ రిజర్వేషన్లు 34% నుంచి 23%కు తగ్గిస్తూ పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవాలని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల తగ్గింపు ఆర్డినెన్సుకు వ్యతిరేకంగా ఈ నెల 23న భారీ ధర్నాను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. విద్యానగర్ బీసీ భవన్లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గత పాతికేళ్లుగా 34% రిజర్వేషన్లు కొనసాగుతున్నాయని, అప్పుడులేని అభ్యంతరాలు ఇప్పుడు ఎందుకొచ్చాయని ప్రశ్నించారు. 34% రిజర్వేషన్ల ప్రకారమే... ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలను 34% రిజర్వేషన్ల ప్రకారమే జరపాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లను జనాభా ప్రకారం 34% నుంచి 56% వరకు పెంచాలని బీసీలు డిమాండ్ చేస్తుంటే కోర్టులు, ప్రభుత్వాలు రిజర్వేషన్లను 23%కి తగ్గించాలనుకోవడం దుర్మార్గమన్నారు. సుప్రీంకోర్టు తీర్పు కొత్తేమీ కాదని, ఈ తీర్పు ఇచ్చిన తరువాత కూడా 2013లో గ్రామపంచాయతీ ఎన్నికలు, 2014లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించారని వివరించారు. ఈ కార్యక్రమంలో గుజ్జ కృష్ణ, జైపాల్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
బీసీల కోసం ప్రత్యేక పార్టీ: జాజుల
హైదరాబాద్: రాష్ట్రంలో 56 శాతం ఉన్న బీసీల కోసం 2023 నాటికి ప్రత్యేక రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తామని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్), హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (హెచ్‌యూజే) ఆధ్వర్యంలో ‘మీట్ ది ప్రెస్’కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాజుల మాట్లాడుతూ.. ముందస్తు ఎన్నికల్లో బీసీలకు తీవ్రమైన అన్యాయం జరిగిందని, అన్ని రాజకీయ పార్టీలు మొండిచేయి చూపాయని విమర్శించారు. బడుగుల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే పిడికెడు ఉన్న అగ్రకులాల వారే రాజ్యాన్ని ఏలుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు రాజ్యాధికారం వస్తే తప్ప వారి బతుకుల్లో మార్పు రాదని అన్నారు. 9 నెలల ముందే ఎన్నికలు రావటం వల్ల పార్టీని పెట్టలేకపోయామని తెలిపారు. తాను ఏ అగ్రకుల పార్టీ బీఫాంతో పోటీ చేయనని, స్వతహాగా పార్టీ పెట్టి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. అన్ని పార్టీలు 5 శాతం ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి అధిక సీట్లు కేటాయిస్తే.. బీఎల్ఎఫ్ మాత్రం బీసీలకు 59 సీట్లను కేటాయించిందని తెలిపారు. సామాజిక తెలంగాణ కాదు రెడ్ల తెలంగాణ వచ్చిందని ఎద్దేవా చేశారు. ఏ పార్టీకి మద్దతు ఇవ్వబోం.. ఈ ఎన్నికల్లో తాము ఏ పార్టీకి మద్దతు ఇవ్వబోమని జాజుల స్పష్టం చేశారు. జెండాలు, పార్టీలకు అతీతంగా బీసీ బిడ్డలను గెలిపించుకుంటామని చెప్పారు. ఈ రాష్ట్రానికి బీసీ వ్యక్తి సీఎం అయ్యే వరకు ఉద్యమిస్తానని చెప్పారు. బీఎల్ఎఫ్ వస్తే బీసీని సీఎం చేస్తామన్న తమ్మినేని వీరభద్రాన్ని ముందు నీ పదవిని బీసీకి ఇవ్వాలని మంద కృష్ణమాదిగ అనటం సరైంది కాదని వ్యాఖ్యానించారు. బీసీలకు 59 సీట్లు ఇచ్చిన ఘనత వారిదే అని అన్నారు. టీడబ్ల్యూజేఎఫ్ అధ్యక్షుడు మామిడి సోమయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య, ఉపాధ్యక్షుడు పులిపలుపుల ఆనందం, హెచ్‌యూజే నాయకులు పాల్గొన్నారు. -
‘17న బీసీలకు జరిగిన అన్యాయంపై గళమెత్తుదాం’
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు బీసీలకు తీవ్ర అన్యాయం చేశాయని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం బీసీ భవన్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాజకీయాల్లో బీసీలకు జరిగిన అన్యాయానికి నిరసనగా ఈ నెల 17న రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు బీసీలకు అతి తక్కువ సీట్లిచ్చి అవమానపర్చాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలకతీతంగా బీసీ నాయకులంతా బంద్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కాలేజీ విద్యార్థులు ర్యాలీలు నిర్వహించాలని, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. 12 సంఘాల మద్దతు.. ఈ బంద్‌కు 12 బీసీ సంఘాలు మద్దతిచ్చాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు పోటీ పడుతూ బీసీలకు టికెట్లివ్వకుండా అన్యాయం చేస్తున్నాయని చెప్పారు. బీసీ ఫ్రంట్, రాష్ట్ర బీసీ సంఘం, బీసీ యువజన సంక్షేమ సంఘం, రాష్ట్ర బీసీ ఉద్యోగుల సంఘం, రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం, రాష్ట్ర బీసీ సంఘర్షణ సమితి, రాష్ట్ర బీసీ హక్కుల పోరాట కమిటీ, రాష్ట్ర బీసీ సేన, రాష్ట్ర బీసీ ప్రజా సమితి, రాష్ట్ర బీసీ జన సమితి, రాష్ట్ర బీసీ కులాల ఐక్య వేదిక, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మొదలైన సంఘాలన్ని మద్దతు తెలిపాయని వెల్లడించారు. ఈ బంద్ ద్వారా బీసీల సత్తా చూపిస్తామని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో భిక్షపతి, నాగుల శ్రీనివాస్ యాదవ్, ప్రవీణ్ గౌడ్, వెంకటచారి తదితరులు పాల్గొన్నారు. -
జనాభా ప్రకారం టికెట్లివ్వకుంటే నిరసన దీక్ష చేస్తా: జాజుల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 56 శాతంపైగా ఉన్న బీసీలకు జనాభా దామాషా ప్రకారం అసెంబ్లీలో టికెట్లు ఇవ్వకుంటే 112 కులసంఘాలతో నిరసన దీక్ష చేస్తానని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. టీఆర్ఎస్, మహాకూటమి, బీజేపీ పార్టీలు బీసీలను రాజకీయంగా అణచివేయడంలో పోటీపడుతున్నాయని ధ్వజమెత్తారు. జాబితాలు ప్రకటిస్తున్నా ఆశించినమేర బీసీలకు టికెట్లు ఇవ్వట్లేదని వాపోయారు. మిగతా జాబితాలోనూ ఇదే వైఖరి అనుసరిస్తే రాష్ట్రంలోని అన్ని కులసంఘాల నేతలతో కలసి నిరసన దీక్ష చేసి పార్టీల మొండివైఖరిని ఎండగడతానన్నారు. ఇప్పటి వరకు టీఆర్ఎస్ 22, బీజేపీ 16 సీట్లను మాత్రమే బీసీలకు ఇచ్చిందని, మహాకూటమి ఇచ్చే జాబితాలో కూడా బీసీల జాడ కనిపించట్లేదన్నారు. జెండా మోసిన బీసీలను కాదని వ్యాపారవేత్తలు, రియల్ఎస్టేట్ దళారులు, సిట్టింగ్‌లు, సీనియర్లంటూ కేవలం రెండు అగ్రకులాలకు మాత్రమే టికెట్లు కేటాయించడం ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ ప్రజలకు రాజకీయ న్యాయం జరుగుతుందని ఆశపడ్డామన్నారు. పిడికెడు శాతంలేని వాళ్ల చేతిలో రాష్ట్రం మొత్తం ఉండటం దురదృష్టకరమన్నారు. -
4న బీసీ బహిరంగ సభ: ఆర్.కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: బీసీ డిమాండ్ల సాధనలో భాగంగా నవంబర్ 4న హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. శనివారం బీసీ భవన్లో బీసీ ఉద్యోగ సంఘాలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో సమాన వాటా దక్కినప్పుడే ఎదుగుతారన్నారు. అందుకు ఉద్యమించాల్సిన సమయం వచ్చిందని, బహిరంగ సభతో బీసీల డిమాండ్లను రాజకీయ పార్టీలకు తెలపాలన్నారు. ఈ సభకు బీసీలు ఇంటికొక్కరు చొప్పున హాజరు కావాలని పిలుపునిచ్చారు. -
బీసీని సీఎం అభ్యర్థిగా ప్రకటించే పార్టీకే మద్దతు
హైదరాబాద్: బీసీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే రాజకీయ పక్షానికే బీసీల మద్దతు ఉంటుందని బీసీ సంక్షేమ సంఘం నేత, తాజా మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య స్పష్టం చేశారు. ఆదివారం నాంపల్లి పబ్లిక్‌గార్డెన్స్‌లోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ అధ్యక్షతన ‘‘బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు’’అనే అంశంపై సదస్సు జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన కృష్ణయ్య ప్రసంగించారు. రాజకీయ చైతన్యం ఉన్న రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక్క బీసీ కూడా ముఖ్యమంత్రి కాలేకపోయారని అసంతృప్తిని వ్యక్తం చేశారు. బీసీ జనాభా అధికంగా ఉన్న రాష్ట్రంలో బీసీలకు రాజ్యాధికారంలో చోటులేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు మినహా ఉత్తరప్రదేశ్, బిహార్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో బీసీ నేతలు సీఎంలు అయ్యారని గుర్తు చేశారు. రాష్ట్రంలో బీసీలు అభివృద్ధి చెందాలంటే బీసీ ముఖ్యమంత్రి కావాల్సిందేనని అన్నారు. లేదంటే గొర్రెలు, మేకలు మేపుకోవాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు. వారికి కావాల్సింది గొర్రెలు, మేకలు కాదని చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు అని వ్యాఖ్యానించారు. అన్ని రాజకీయ పార్టీలు రాబోయే ఎన్నికల్లో బీసీలకు 65 ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ ఎన్నికల సంస్కరణలో భాగంగా రాజకీయ సంస్కరణలు జరగాలని, అందులో భాగంగా అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలను పెంచాలని డిమాండ్ చేశారు. పెంచిన సీట్లను నామినేటెడ్ పద్ధతిలో ఇప్పటి వరకు అసెంబ్లీలో అడుగుపెట్టని కులాలకు ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. రాజకీయ పార్టీలన్నీ తమ పంథాను మార్చుకోవాలని సూచించారు. లేదంటే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. దేశాన్ని సంస్కరించుకోవడంలో భాగంగా విప్లవాన్ని తీసుకువస్తామని అన్నారు. ఇప్పుడు రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యాన్ని ధనస్వామ్యంగా మార్చాయని విమర్శించారు. యువతరం తిరుగుబాటు చేయకముందే ఈ పద్ధతికి స్వస్తిపలకాలని అన్నారు. నవంబర్ 4న బీసీల బహిరంగ సభ..... బీసీ సమస్యల పరిష్కారానికి నవంబర్ 4న భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య వెల్లడించారు. హైదరాబాద్‌లోని నిజాం కాలేజ్‌లో గానీ, పరేడ్ గ్రౌండ్లో గానీ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వివరించారు. బీసీ ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. రూ.20వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ ఏర్పాటు చేయాలని, బీసీలకు 90 శాతం సబ్సిడీతో అర్హులైన వారందరికీ రుణాలు మంజూరు చేయాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, బీసీలపై విధించిన క్రీమీలేయర్‌ను ఎత్తివేయాలని కోరారు. బీసీల జనాభా దామాషా ప్రకారం 500 బీసీ గురుకుల పాఠశాలలను నెలకొల్పాలని కోరారు. విదేశీ విద్యకు వెళ్లే విద్యార్థులకు రూ.20 లక్షల స్టయిఫండ్‌ను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, కేజీ టు పీజీ విద్యా సంస్థల జేఏసీ కన్వీనర్ గౌరి సతీష్, బీసీ సంక్షేమ సంఘం నేతలు ఉపేందర్, రాజ్ కుమార్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా మార్చాలి
హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాతో ఎన్నికలకు వెళితే ఓటమి తప్పదని, అభ్యర్థుల జాబితాను మార్పు చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో సామాజిక న్యాయం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నాంపల్లి తెలుగు విశ్వవిద్యాలయంలో ఆదివారం జరిగిన బీసీల రాజకీయ భవిష్యత్తు కార్యాచరణ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీసీలకు రాజకీయ వాటా కల్పించకుండా అన్యాయం చేసిన పార్టీల్లో టీఆర్ఎస్ తొలిస్థానంలో ఉందని ఆరోపించారు. అన్ని రాజకీయ పార్టీలు జనాభా దామాషా ప్రకారం బీసీలకు టికెట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తామంటూ అసెంబ్లీలో చేసిన తీర్మానం ఏమైందని జాజుల ప్రశ్నించారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల్లోనే సామాజిక న్యాయం ఉంది తప్ప ఆచరణలో లేదని ఎద్దేవా చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 24 మంది బీసీ ప్రజాప్రతినిధులు ఉంటే ప్రత్యేక రాష్ట్రం వచ్చాక 2014లో వారి శాతం 19 మందికి పడిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నది ఇందుకోసమేనా అని ప్రశ్నించారు. ఓటు మాదే సీటు మాదే బీసీల రాజకీయ నిర్మాణం జరిగే దిశగా ఓటు మాదే సీటు మాదే అన్న నినాదంతో బీసీ సంక్షేమ సంఘం ఇక నుంచి బీసీల రాజకీయ సమితి పేరిట రాజకీయ వేదికను ఏర్పాటు చేస్తున్నట్లు జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. బీసీ రాజకీయ యుద్ధభేరి పేరిట ఈ నెల 7వ తేదీన సరూర్‌నగర్ స్టేడియంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సభలో బీసీల రాజకీయ ప్రణాళికను ప్రకటిస్తామని వెల్లడించారు. ఈ సభకు దేశవ్యాప్తంగా ఉన్న 28 రాష్ట్రాల బీసీ ఉద్యమ ప్రతినిధులు, సామాజిక ఉద్యమకారులు హాజరవుతున్నట్లు తెలిపారు. ఉద్యోగులు, మహిళలు, విద్యావంతులు, సామాజిక తత్వవేత్తలు, ప్రజలందరూ విచ్చేసి సభను విజయవంతం చేయాలని జాజుల పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలు కుల సంఘాల నేతలు, విద్యార్థి సంఘాల నేతలు, మహిళా నేతలు తదితరులు పాల్గొన్నారు. -
మునుగోడుపై బీసీ జెండా ఎగురవేస్తాం: జాజుల
చౌటుప్పల్/మునుగోడు/చండూరు: నల్లగొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గంపై బీసీ జెండా ఎగురవేస్తామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శుక్రవారం నియోజకవర్గంలోని వివిధ పార్టీలకు చెందిన బీసీ నాయకుల ఆధ్వర్యంలో చౌటుప్పల్ నుంచి సంస్థాన్‌నారాయణపురం, మునుగోడు మీదుగా చండూరు వరకు బహుజనుల బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మునుగోడులో త్వరలో లక్ష మందితో బహుజనుల ఆత్మగౌరవ సభ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో మునుగోడులో బీసీ అభ్యర్థిని గెలిపించి అసెంబ్లీలో తమ వాణిని వినిపిస్తామని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు బహుజనులకు రాష్ట్ర వ్యాప్తంగా 60 అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 9 స్థానాలు ఇస్తేనే ఆ పార్టీలకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు. లేదంటే అన్ని నియోజకవర్గాల్లో ఉమ్మడి బీసీ అభ్యర్థులను బరిలో నిలిపి సత్తా చాటుతామన్నారు. -
‘28న కలెక్టరేట్ల ముట్టడి ’
సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకారవేతనాల విడుదల కోసం ఈనెల 28న బీసీ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముట్టడి చేపట్టనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ తాజా మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య తెలిపారు. 2017–18 విద్యా సంవత్సరం ముగిసినా ఇప్పటికీ ఉపకారవేతనాలు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం బకాయిలను విడుదల చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కలెక్టరేట్ల ముట్టడికి విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. -
పల్లకీ మోసే కూలీలు కావొద్దు: కృష్ణయ్య
హైదరాబాద్: ప్రతి ఒక్కరూ ఓటు వేసే ముందు ఆలోచించుకోవాలని, ఇష్టం వచ్చినట్లు ఓటు వేసి పల్లకీ మోసే కూలీలు కావొద్దని విద్యార్థులకు బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య సూచించారు. శుక్రవారం బషీర్‌బాగ్‌లోని దేశోద్ధారక భవన్లో నూతనంగా ఏర్పాటైన తెలంగాణ బీసీ సంఘం ఆవిర్భావ సభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులంతా ఏకమై ఓటు అనే ఆయుధంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు. విద్య, ఉద్యోగ రిజర్వేషన్లల్లో అమలవుతున్న బీసీ క్రీమీలేయర్‌ను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పారిశ్రామిక పాలసీలో బీసీలకు 50శాతం కోటాతో పాటు రూ.20వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. గుజ్జ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
‘బీసీలకు సీట్లివ్వకుంటే దాడులే’
హైదరాబాద్: బీసీలకు సీట్లు కేటాయించడంలో అన్ని రాజకీయ పార్టీలు మోసం చేస్తున్నాయని, జనాభా ప్రాతిపదికన 65 సీట్లు కేటాయించని పార్టీల ఆఫీసులపై దాడులు చేస్తామని బీసీ సంక్షేమ సంఘం నేత, మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. శనివారం ఇక్కడ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ గంగపుత్ర మహాసభ నిర్వహించిన రాజకీయ చైతన్య సదస్సులో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రకటించిన 105 సీట్లలో 20 మంది, కాంగ్రెస్ కేటాయించిన 65 సీట్లలో 15 మంది బీసీలకు మాత్రమే సీట్లిచ్చారని విమర్శించారు. పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో వారికి 50 శాతం రిజర్వేషన్లు కల్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ముఠా గోపాల్, బీసీ కమిషన్ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్, ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, నాయకులు గుజ్జ కృష్ణ, పద్మ, సాయి, సూర్యప్రకాశ్ పాల్గొన్నారు. -
అన్ని కుల సంఘాలకూ భవనాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్న అన్ని కుల సంఘాలకు ప్రభుత్వం పదెకరాల చొప్పున భూమి కేటాయించి, భవనాలు నిర్మించి ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం నేత, టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య కోరారు. శుక్రవారం ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. కొన్ని కులాలకు మాత్రమే స్థలాలు కేటాయిస్తామని సీఎం తన హామీల్లో పేర్కొన్నారని, దీంతో ఇతర కులాలకు ప్రాధాన్యత ఇవ్వలేదన్న అపవాదు వస్తుందన్నారు. అలా రాకుండా అన్ని కులాలకు సంఘ భవనాల నిమిత్తం పదెకరాల చొప్పున భూమి కేటాయించి రూ.10 కోట్లు విడుదల చేయాలన్నారు. రాష్ట్రంలో బీసీ కేటగిరీలో 112 కులాలు, ఎస్సీ కేటగిరీలో 58 కులాలు, ఎస్టీ కేటగిరీలో 35 కులాలున్నాయని పేర్కొన్నారు. కులాల వారీగా సంఘ భవనాలు నిర్మిస్తే ఆయా సామాజిక వర్గాల అభివృద్ధికి వీలుంటుందన్నారు. -
‘బీసీలకు 400 హాస్టళ్లను మంజూరు చేయాలి’
హైదరాబాద్: మైనార్టీలు, క్రైస్తవులు, బుద్ధులు, జైన మతస్తులకు మంజూరు చేస్తున్న మాదిరిగానే హిందువులకూ పూర్తి ఫీజులు మంజూరు చేయాలని బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీసీలకు అదనంగా 400 కాలేజీ హాస్టళ్లను మంజూరు చేయాలని కోరారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం రాష్ట్రస్థాయి సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కృష్ణయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో 6 వేల కాలేజీల్లో 8 లక్షల మంది బీసీ విద్యార్థులు చదువుతుంటే.. వారిలో 250 కాలేజీ హాస్టళ్లలో 26 వేల మందే హాస్టల్ సౌకర్యం పొందుతున్నారని తెలిపారు. కాలేజీ కోర్సులు చదివే బీసీ, ఈబీసీ విద్యార్థులకు పూర్తి స్థాయిలో పీజులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. బీసీలకు అన్యాయం చేస్తే సహించబోమని హెచ్చరించారు. కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు జిల్లపల్లి అంజి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, తెలంగాణ అధ్యక్షుడు ఎర్ర సత్యం, యూత్ రాష్ట్ర నాయకుడు నీల వెంకటేశ్, బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు ఆకుల విజయ తదితరులు పాల్గొన్నారు. -
మాకు అన్యాయం జరిగితే ఖబడ్దార్
సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్ రిజర్వేషన్లలో బీసీలకు అన్యాయం జరిగితే ఎవరినీ వదిలిపెట్టేది లేదని బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 56 శాతం పెంచాలని తాము పోరాడుతుంటే ప్రభుత్వం మాత్రం 34 నుంచి 27 శాతానికి తగ్గించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. బీసీ వ్యతిరేక వైఖరిని విడనాడకపోతే ప్రభుత్వానికి తమ తడాఖా చూపిస్తామని హెచ్చరించారు. గురువారం హైదరాబాద్‌లో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలుపై అఖిలపక్ష పార్టీల సమావేశం సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది. ఆ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ, 70 ఏళ్లుగా బీసీలకు దక్కాల్సిన రాజకీయ వాటాను అగ్రకులాలే అనుభవిస్తున్నాయని, ఇప్పుడు బీసీలకు జనాభా దమాషా ప్రాతిపదికన రిజర్వేషన్ల అమలును అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. బీసీలు సర్పంచులైతే వీళ్ల జాగీర్లు పోయినట్టు జడ్జిమెంట్ ఇప్పించారని మండిపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 28 మంది అగ్రకులాల వారే ముఖ్యమంత్రులు అయ్యారని, తాము కనీసం సర్పంచ్‌లు అవుతామంటే అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తామన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, అయితే సుప్రీంలో స్టే వచ్చేలా వాదనలు వినిపించాలని ప్రభుత్వాన్ని కోరారు. పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలుపై అఖిలపక్ష సమావేశాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేసేలా ప్రధానిపై ఒత్తిడి తేవాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈసారి బీసీల వాటా బీసీలకివ్వాల్సిందే, అదేమీ భిక్ష కాదని, ప్రజాస్వామిక హక్కు అని పేర్కొన్నారు. బీసీలకు జనాభా దామాషా పద్ధతిన రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. బీసీలను కేసీఆర్ మోసం చేశారు: ఉత్తమ్ ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీలను మోసం చేశారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. బీసీల సంక్షేమానికి బడ్జెట్ కేటాయింపుల నుంచి పంచాయతీరాజ్ రిజర్వేషన్ల వరకు అదే వైఖరి అవలంబించారని పేర్కొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో బీసీల సంక్షేమానికి రూ.25 వేల కోట్లు ఖర్చు చేస్తామని చెప్పారని, అధికారంలోకి వచ్చాక కనీసం 20 శాతం కూడా ఖర్చు చేయలేదన్నారు. బర్రెలు, గొర్రెలు, చేపలు ఇచ్చి అసలు విషయాల్లో బీసీలను విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్ చట్టాన్ని ఆమోదించే సమయంలో కాంగ్రెస్ పార్టీని అసెంబ్లీ నుంచి గెంటివేశారని, బీసీ ఓట్ల గణన కూడా సరిగా చేయలేదన్నారు. బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల అమలుకు కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని, పీసీసీ అధ్యక్షులుగా పనిచేసిన 37 మందిలో 27 మంది బీసీలే ఉన్నారని, టీఆర్ఎస్లో అది సాధ్యమవుతుందా అని ఉత్తమ్ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ కుట్ర పూరితంగా కొన్ని ఉత్తర్వులు ఇస్తారని, ఆ ఉత్వర్వులను కోర్టు కొట్టివేస్తే ఆ నెపాన్ని కాంగ్రెస్‌పై నెట్టడం అలవాటుగా మారిందని విమర్శించారు. బీసీలకు పంచాయతీరాజ్‌లో 54 శాతం రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తే తాము సంపూర్ణ మద్దతిస్తామన్నారు. ఎన్నికల వాయిదాకు కేసీఆర్ కుట్ర... పంచాయతీ ఎన్నికల వాయిదాకు సీఎం కేసీఆర్ కుట్ర పన్నారని టీడీపీ ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి ఆరోపించారు. కోర్టులో ప్రభుత్వం తరఫున సరైన వాదనలు కూడా వినిపించలేకపోయారని ఎద్దేవా చేశారు. ఈ అంశంలో ప్రథమ ముద్దాయి రాష్ట్ర ప్రభుత్వమేనని, ఇందుకు టీఆర్ఎస్ తగిన మూల్యం చెల్లించుకుంటుందని చెప్పారు. బీసీల న్యాయమైన డిమాండ్లకు తమ పార్టీ మద్దతిస్తుందన్నారు. సమావేశంలో బాలమల్లేశ్ (సీపీఐ), బీజేపీ రాష్ట్రీయ జనతాదళ్, సమాజ్‌వాదీ పార్టీల నేతలు హాజరై తమ మద్దతు ప్రకటించారు. బీసీ సంఘాల నేతలు గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
‘బీసీ రిజర్వేషన్లపై శాశ్వత పరిష్కారం కావాలి’
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై శాశ్వత పరిష్కారం చూపాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య, సంఘం ప్రతినిధులు గుజ్జకృష్ణ, జైపాల్, రాజ్ కిరణ్ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును కలిశారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇస్తేనే అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందన్నారు. స్థానిక సంస్థల్లో 50శాతం రిజర్వేషన్లు దాటొద్దని హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపిందని, ఈ సందర్భంలో సుప్రీంకోర్టు నుంచి స్టే కోసం కాకుండా శాశ్వతంగా పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. -
‘రిజర్వేషన్ల అమలుపై సమగ్ర విచారణ చేయాలి’
హైదరాబాద్: రాజ్యాంగ బద్ధంగా ఏర్పడ్డ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిజర్వేషన్లు పాటించకపోవడం దారుణమని బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. గురుకుల టీచర్ల రిక్రూట్మెంట్లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను సక్రమంగా అమలు చేయలేదని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నిరుద్యోగులు ఖైరతాబాద్‌లోని బీసీ కమిషన్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆర్.కృష్ణయ్య మద్దతు తెలిపారు. అనంతరం బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులకు వినతిపత్రం ఇచ్చారు. నియామకాల్లో ఓపెన్ కాంపిటేషన్ లాస్ట్ కటాఫ్ మార్కుల తర్వాత రిజర్వేషన్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా.. ఓపెన్ కాంపిటేషన్‌లో రావాల్సిన మెరిట్ అభ్యర్థులను కూడా రిజర్వేషన్లో భర్తీ చేయడంతో రిజర్వేషన్లకు పూర్తిగా గండికొట్టినట్టయ్యిందన్నారు. ఈ విధానం వల్ల సుమారు 400 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, టీజీటీ జేఏసీ అధ్యక్షుడు శ్రీను పాల్గొన్నారు. ఘంటా చక్రపాణిని పదవి నుంచి తొలగించాలి: టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణిని తక్షణమే ఆ పదవి నుంచి తొలగించాలని ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఆందోళన అనంతరం మీడియాతో మాట్లాడుతూ నష్టపోయిన విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతూ అభ్యర్థులు కమిషన్ వద్దకు వెళితే ముందస్తు అరెస్టులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఉద్యోగ నియామకాల భర్తీలో చక్రపాణి వైఫల్యం చెందారని మండిపడ్డారు. రిజర్వేషన్లను సక్రమంగా అమలు చేస్తూ రివైజ్డ్ సెలక్షన్ లిస్ట్‌ను ప్రకటించాలని టీఎస్పీఎస్సీని డిమాండ్ చేశారు. -
‘విద్యుత్ సంస్థల్లో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలి’
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సంస్థల సాధారణ బదిలీల్లో బీసీ ఉద్యోగులను ప్రాధాన్యతా స్థానాల్లో నియమించాలని బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం కృష్ణయ్య నేతృత్వంలో విద్యుత్ బీసీ సంక్షేమ సంఘం నాయకులు టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డిని కలసి వినతిపత్రం సమర్పించారు. ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కంలలో సీఎండీ, డైరెక్టర్ స్థానాల్లో బీసీలకు ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల వారికి తీవ్ర అన్యాయం జరుగుతోందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకుని బీసీలను సీఎండీలుగా, డైరెక్టర్లుగా నియమించాలని కోరారు. ఆర్.కృష్ణయ్య వెంట విద్యుత్ బీసీ సంక్షేమ సంఘం నాయకులు కుమారస్వామి, వెంకన్నగౌడ్, యాదగిరి, చంద్రుడు, గుజ్జ కృష్ణ తదితరులు ఉన్నారు. -
‘జాతీయ స్థాయిలో బీసీ ఉద్యమం’
సాక్షి, హైదరాబాద్: చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లకు జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని తీవ్రతరం చేసినట్లు బీసీ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య స్పష్టం చేశారు. శుక్రవారం ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో బీసీ సంఘాల ప్రతినిధులు పుదుచ్చేరి సీఎం నారాయణస్వామిని కలిశారు. బీసీల సమస్య లపై గంటన్నరపాటు చర్చించారు. బీసీలకు చట్టసభలు, పదోన్నతుల్లో రిజర్వేషన్లతో పాటు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలనే ప్రధాన డిమాండ్‌పై జాతీయ స్థాయిలో ఉద్యమం మొదలు పెట్టామని, ఇందులో భాగంగా పుదుచ్చేరి సీఎంని కలిశా మని కృష్ణయ్య పేర్కొన్నారు. బీసీ సంక్షేమ సంఘం చేసిన ప్రతిపాదనలపై సీఎం నారాయణ స్వామి సానుకూలంగా స్పందించారని, వచ్చే వారంలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. -
ఫీజులను ప్రభుత్వమే చెల్లించాలి: జాజుల
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, మెడిసిన్ ఇతర వృత్తి విద్యా కోర్సుల్లో చదువుతోన్న బీసీ విద్యార్థుల పూర్తి ఫీజులను ప్రభుత్వమే చెల్లించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ర్యాంకుతో సంబంధం లేకుండా విద్యార్థులందరికీ పూర్తి ఫీజు చెల్లిస్తున్నట్లు ప్రభుత్వం జీవో జారీ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో విద్యార్థులతో కలసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. గత డిసెంబర్లో హైదరాబాద్‌లో నిర్వహించిన బీసీ మహాగర్జనలో బీసీ మంత్రులు మొత్తం ఫీజులను చెల్లిస్తామని ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. బీసీల్లో ఏ, బీ, సీ, డీ కేటగిరీలకు మొత్తం ఫీజును ఇవ్వకుండా ఈ కేటగిరీ వారికి మొత్తం ఫీజును ఇవ్వడం బీసీల పట్ల వివక్ష చూపడం కాదా అని జాజుల ప్రశ్నించారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ జోక్యం చేసుకుని తగు చర్యలు తీసుకోవాలని కోరారు. -
టీటీడీపీకి కృష్ణయ్య రాంరాం!
సాక్షి, హైదరాబాద్: బీసీ సంక్షేమ సంఘం నేత, ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య త్వరలోనే తెలుగుదేశం పార్టీని వీడనున్నారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు కొంతకాలంగా తన విషయంలో, ఏపీలోని బీసీల విషయంలోనూ అనుసరిస్తున్న విధానాలపై గుర్రుగా ఉన్న కృష్ణయ్య ఇక టీడీపీకి రాంరాం చెప్పడమే మేలనే నిర్ణయానికి వచ్చారు. బీసీలంటే చంద్రబాబుకు చులకన భావం ఉందని, అందుకే ఆ పార్టీని వదిలిపెట్టాలని తాను భావిస్తున్నానని సన్నిహితులకు చెబుతున్నారు. ముఖ్యంగా తాను గౌరవాధ్యక్షుడిగా ఉన్న ఓ ఉద్యోగ సంఘానికి ఏపీలో అధికారిక గుర్తింపు ఇచ్చేందుకు అక్కడి ప్రభుత్వం నిరాకరించడంతోపాటు.. తనను ఆ పదవి నుంచి తొలగిస్తేనే గుర్తింపు ఇస్తామని మెలిక పెట్టడంపై కృష్ణయ్య తీవ్రంగా మండిపడుతున్నారు. నాలుగేళ్లుగా నిశ్శబ్ద యుద్ధం తెలంగాణలో టీడీపీ అధికారంలోకి వస్తే కృష్ణయ్యను ముఖ్యమంత్రి చేస్తానని ప్రకటించిన చంద్రబాబు.. తర్వాత ఆయనకు కనీసం పార్టీ శాసనసభాపక్ష నేత హోదా కూడా ఇవ్వలేదు. ఏ ముఖ్య పదవుల్లో కూడా ఆయన పేరును ప్రస్తావించలేదు. దీంతో బాబు వైఖరిపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎల్బీనగర్లో కానీ, ఇతరత్రా సమావేశాల్లో పాల్గొన్నా టీడీపీ కండువా ధరించకుండా, కేవలం బీసీల కండువా కప్పుకుంటూనే వచ్చారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన పలు సమస్యలపై మాట్లాడినప్పుడు కూడా తెలుగుదేశం ప్రస్తావన తీసుకురాకుండా స్వతంత్రంగానే ఉండేందుకు ప్రయత్నించారు. ఇలా టీడీపీ, కృష్ణయ్యల మధ్య నిశ్శబ్ద యుద్ధం నాలుగేళ్లుగా నడుస్తోంది. బాబు వ్యాఖ్యలతో ముదిరిన వివాదం రాష్ట్రంలో రాజకీయ పరిస్థితితోపాటు ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు బీసీలపై అనుసరిస్తున్న వైఖరి కూడా కృష్ణయ్యకు నచ్చడం లేదు. బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోవడం, నాలుగేళ్లలో బీసీలకు ఉపయోగకరమైన ఒక్క పథకం చేపట్టకపోవడంపై అక్కడి బీసీ సంఘాలు గుర్రుగా ఉన్నాయి. రెండుసార్లు రాజ్యసభ ఎన్నికలు జరిగినా ఒక్క బీసీకి కూడా అవకాశం ఇవ్వలేదు. ఏపీలోని బీసీలకు ఏమీ చేయకపోగా.. న్యాయమూర్తులుగా ఎంపికైన బీసీ న్యాయవాదులు పనికిరారని ఆయన ఓ నివేదిక ఇవ్వడం కృష్ణయ్యను ఆత్మరక్షణలో పడేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేసినా చంద్రబాబు కనీసం పట్టించుకోలేదు. ‘గుర్తింపు’విషయంలోనూ అంతే మరోవైపు ఏపీలోని బీసీ విద్యుత్ ఉద్యోగుల సంఘానికి గుర్తింపు ఇచ్చే విషయంలోనూ చంద్రబాబు తీరు కృష్ణయ్య ఆగ్రహానికి కారణమైంది. కృష్ణయ్య గౌరవాధ్యక్షుడిగా ఉన్న సంఘానికి గుర్తింపు ఇవ్వకుండా వేరే సంఘానికి ఇవ్వడం.. కృష్ణయ్యను ఆ పదవి నుంచి తొలగిస్తే గుర్తింపు ఇస్తామంటూ మంత్రి కళా వెంకట్రావు వ్యాఖ్యానించడం వివాదం ముదిరిపాకాన పడేలా చేసింది. ‘మన సంఘానికి గుర్తింపు ఇవ్వలేదు. మన ప్రజల కోసం మేనిఫెస్టోలో పెట్టిన 18 అంశాల్లో ఒక్కటీ నెరవేర్చలేదు. పైగా బీసీలను అణచివేయ్.. తొక్కేయ్, చీల్చేయ్ అనే సిద్ధాంతంతో ఆయన ముందుకెళ్తున్నారు. పార్టీ ఎమ్మెల్యేగా నాకూ గౌరవం లేదు. కోట్లాది మంది బీసీల పక్షాన నిలబడాల్సిన నేను టీడీపీలో ఉండాలనుకోవడం లేదు. త్వరలోనే నిర్ణయం తీసుకుంటా’అని కృష్ణయ్య తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్టు సమాచారం. -
‘ప్రైవేట్ వర్సిటీలకు వ్యతిరేకంగా ఉద్యమించాలి’
సాక్షి, హైదరాబాద్: పేద విద్యార్థులను చదువుకు దూరం చేసేందుకే ప్రైవేట్ వర్సిటీ బిల్లును ప్రభుత్వం పాస్ చేసిందని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్లు లేని ప్రైవేట్ వర్సిటీలకు వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. గురువారం బీసీ భవన్లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పటికే 12 యూనివర్సిటీలు ఉండగా కొత్తగా ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లు తేవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ప్రైవేట్ వర్సిటీల్లో ఫీజులు లక్షల్లో ఉంటాయని, ఫీజు రీయింబర్స్ మెంట్ చేసే అవకాశం లేదన్నారు. -
ఫీజుల నియంత్రణ చట్టం తేవాలి
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు విద్యాసంస్థల ఫీజుల దోపిడీని నియంత్రించడానికి చట్టం తేవాలని బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం విద్యానగర్ బీసీ భవన్లో జరిగిన పలు బీసీ సంఘాల విస్తృత స్థాయి సమావేశానికి ఆయన హాజరయ్యారు. కృష్ణయ్య మాట్లాడుతూ.. కార్పొరేటు విద్యాసంస్థలు వ్యాపార దృక్పథంతో మాత్రమే పనిచేస్తున్నాయని, వాటి వల్ల ప్రజలు అప్పుల పాలవుతున్నారని విమర్శించారు. తమ పిల్లలకు మంచి నాణ్యమైన విద్య అందించాలని రైతులు అప్పులు చేసి కార్పొరేటు కాలేజీల్లో చేర్పిస్తున్నారని చెప్పారు. కార్పొరేటు విద్యాసంస్థలను కట్టడి చేసేందుకు ఒక యాజమాన్యం కింద ఒకే విద్యాసంస్థ ఉండేలా నిబంధనలను రూపొందించాలన్నారు. ఇంటర్ అడ్మిషన్లకు ఈ సారి నుంచే ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టాలని కోరారు. సమావేశంలో గుజ్జ కృష్ణ, నీలం వెంకటేశ్, భూపేశ్ సాగర్ పాల్గొన్నారు. -
బ్యాంకింగ్ అక్రమాలపై కఠిన చర్యలు
సాక్షి, హైదరాబాద్: దేశంలో వెలుగు చూసిన బ్యాంకింగ్ అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం నేత, టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య మంగళవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు కేసులో బ్యాంకు సిబ్బంది కూడా కుమ్మక్కైనట్లుందని ఆయన ఆరోపించారు. బ్యాంకుకు రూ.3,695 కోట్లు ఎగ్గొట్టిన రొటోమ్యాక్ కంపెనీ ప్రమోటర్ విక్రమ్ కొఠారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పేదలకు రూ.లక్ష రుణం కావాలంటే అనేక కొర్రీలు పెట్టే బ్యాంకులు వ్యాపారులకు వేల కోట్ల అప్పు ఎలా ఇచ్చాయని ప్రశ్నించారు. కేంద్రం ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా వీటిపై విచారణ జరిపించాలని లేకపోతే బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజలు విశ్వాసం కోల్పోతారని, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని హెచ్చరించారు. -
నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యమివ్వండి
సాక్షి, హైదరాబాద్: నామినేటెడ్ పదవుల్లో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఉన్నత స్థాయి పోస్టుల్లో బీసీలు నిర్లక్ష్యానికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. జనాభాలో సగభాగం ఉన్న బీసీలకు ఎలాంటి పోస్టులూ దక్కడం లేదని పేర్కొంటూ బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య బుధవారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. జనాభా ప్రాతిపదికన సగం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు బీసీలను గవర్నర్లుగా నియమించాలని కోరారు. 244 ప్రభుత్వ రంగ సంస్థలు, జాతీయ వాణిజ్య బ్యాంకుల చైర్మన్లుగా బీసీలకు అవకాశమివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ యాక్టు మాదిరిగా బీసీ యాక్టును అమల్లోకి తీసుకురావాలని కృష్ణయ్య కోరారు. -
మార్గదర్శకాలను జారీ చేయాలి
హైదరాబాద్: బీసీ రిజర్వేషన్లపైనే క్రీమీలేయర్ విధించడం దారుణమని, క్రీమీలేయర్‌ను ఎత్తివేసే వరకు ఐక్యంగా ఉద్యమించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. ‘బీసీలపై విధించిన క్రీమీలేయర్ విధానం– భవిష్యత్ కార్యాచరణ’అనే అంశంపై ఆదివారం ఇక్కడ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన బీసీ, ఓబీసీ ఉద్యోగ సంఘాల రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో బీసీల జనాభా 50 శాతానికిపైగా ఉండగా ఉద్యోగులు కేవలం 8 శాతం మాత్రమే ఉన్నారని అన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం క్రీమీలేయర్ వార్షిక ఆదాయ పరిమితిని ఆరు లక్షల రూపాయల నుంచి ఎనిమిది లక్షల రూపాయలకు పెంచినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇంతవరకు పెంచకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. క్రీమీలేయర్‌పై రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను వెంటనే జారీ చేయాలని, నాన్ క్రీమీలేయర్ సర్టిఫికెట్లు పొందడానికి మహిళలకు తండ్రి లేదా భర్త ఆదాయం పరిగణనలోకి తీసుకునే అవకాశం కల్పించాలని శ్రీనివాస్‌గౌడ్ కోరారు. రాష్ట్ర జాబితాలో 112 కులాలుండగా కేంద్ర జాబితాలో కేవలం 87 కులాలే ఉన్నాయని, కేంద్ర జాబితాలో లేని 32 బీసీ కులాలవారికి కూడా ఓబీసీ సర్టిఫికెట్లు ఇచ్చి నాన్ క్రీమీలేయర్‌ను వర్తించే విధంగా చూడాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. బీసీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. క్రీమీలేయర్‌ను జనరల్ కోటాలోనూ అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీల డిమాండ్లపై నవంబర్ 5న జిల్లాల కలెక్టర్లకు వినతిపత్రాలను ఇవ్వాలని, 14న అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో బీసీ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావా లని నిర్ణయించామని చెప్పారు. సమావేశంలో బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఇ.నిరంజన్, ప్రొఫెసర్ ఎం.చెన్నప్ప, డాక్టర్ బండి సాయన్న తదితరులు పాల్గొన్నారు. -
బీసీ రిజర్వేషన్లు సాధిస్తేనే విజయం
హైదరాబాద్: చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ల సాధనే అసలు విజయమని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అధ్యక్షతన బుధ వారం ‘అసెంబ్లీ సమావేశాల్లో బీసీ డిమాండ్లపై చర్చ’అనే అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ... బీసీ ఫెడరేషన్లు ఉంటాయని సీఎం కేసీఆర్‌హామీ ఇచ్చారని, వాటికి నిధులు కేటాయించేలా చర్యలు తీసుకుంటామన్నారు. చట్టసభల్లో రిజర్వేషన్లు పొందితేనే అన్ని సమస్యలు పరిష్కరించుకోవచ్చన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఆకుల లలిత మాట్లాడుతూ.. బీసీలంతా పార్టీలకతీతంగా ఐకమత్యంగా ఉండాలని, బీసీలు ఏ రంగంలో ఉన్నా వారిని ప్రోత్సహించాలన్నారు. నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలి: జాజుల ఇప్పటి వరకూ అసెంబ్లీలో అడుగుపెట్టని కులాలకు నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. అన్ని రంగాల్లోనూ జనా భా ఆధారంగా బీసీలకు వాటాను కల్పించాలన్నారు. సమావేశంలో టీటీడీపీ ప్రధాన కార్యదర్శి బొల్లం మల్లయ్య యాదవ్, ఎంబీసీ కులాల అధ్యక్షుడు దాసన్న, గంగపుత్ర సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎ.ఎల్ మల్లయ్య, విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు గణేశ్ చారి, తెలంగాణ సగర ఉప్పర సంఘం అధ్యక్షుడు నర్సింహ్మ సాగర్, బోయ వాల్మీకి సంఘం అధ్యక్షుడు గోపి, బీసీ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. -
ఫీజు బకాయిలు విడుదల చేయండి: ఆర్.కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, మెడిసిన్ విద్యార్థుల గత సంవత్సరం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.1600 కోట్లు వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం వివిధ జిల్లా కేంద్రాల్లో వేలాది మంది విద్యార్థులు కలెక్టరేట్లు ముట్టడించారు. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ గత సంవత్సరపు ఫీజు బకాయిలు రాకపోవడంతో కాలేజీ యాజ మాన్యాలు విద్యార్థులను వేధిస్తున్నాయన్నారు. వారి నుంచి బలవంతంగా ఫీజు లు వసూలు చేస్తున్నారని, కోర్సులు పూర్తయినా ఫీజులు కట్టేవరకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రీయింబర్స్‌మెంటు స్కీము ప్రవేశపెట్టినప్పుడు పూర్తి ట్యూషన్ ఫీజులు, స్పెషల్ ఫీజులు, పరీక్షా ఫీజులతోసహా మంజూరు చేశారని గుర్తు చేశారు. అదే విధంగా ప్రైవేటు కాలేజీ లలో చదివే ఇంటర్ విద్యార్థుల ఫీజులు 8 వేల నుంచి 12 వేలవరకు ఉంటేæ ప్రభు త్వం 2 వేలు మాత్రమే మంజూరు చేస్తుందని, బ్యాలెన్సు ఫీజులు కట్టే పరిస్థితి లేక విద్యార్థుల తల్లిదండ్రులు అప్పుల పాలవుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో గుజ్జ కృష్ణ, ఎర్ర సత్యనారాయణ, నీల వెంకటేష్, గుజ్జ రమేష్, భూపేష్, నరేష్, అనంతయ్య, అభిలాష్, రామకృష్ణ, లక్ష్మి, రమ్య పాల్గొన్నారు. -
‘కాపులను బీసీల్లో చేర్చితే యుద్ధమే’
సాక్షి, హైదరాబాద్: కాపులను బీసీల్లో చేర్చొద్దని బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ శాసనసభ్యులు ఆర్.కృష్ణయ్య స్పష్టం చేశారు. ఈ చర్యతో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. బుధవారం బీసీ భవన్లో జరిగిన బీసీ సంఘాల కోర్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీలో కాపులను బీసీల్లో చేర్చుతామని, విద్య, ఉద్యోగాల్లో మాత్రమే రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పడం ఆచరణలో అమలు కాదన్నారు. రాజకీయ ఒత్తిళ్లు, లబ్ధికోసం రిజర్వేషన్లు నిర్ణయించవద్దని, అలాచేస్తే బీసీ కులాలన్నీ ప్రభుత్వంపై యుద్ధం చేస్తాయన్నారు. సమావేశంలో బీసీ సంఘం నేతలు ర్యాగ అరుణ్, సత్యనారాయణ, గుజ్జ కృష్ణ పాల్గొన్నారు. -
6న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి
బీసీ సంక్షేమ సంఘం పిలుపు సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాలన్న డిమాండ్‌తో ఈనెల 6న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడికి బీసీ సంక్షేమ సంఘం పిలుపునిచ్చింది. ఈమేరకు బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. రెండేళ్లుగా విద్యార్థుల కు ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు విడుదల చేయడం లేదని, కాలేజీ యాజమాన్యాలు సైతం ఒత్తిడి పెంచడంతో విద్యార్థుల పరిస్థితి ఆందోళనకరంగా మారిందన్నారు.