మార్గదర్శకాలను జారీ చేయాలి | Guidelines should be issued | Sakshi
Sakshi News home page

మార్గదర్శకాలను జారీ చేయాలి

Published Mon, Oct 30 2017 2:35 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM

Guidelines should be issued - Sakshi

హైదరాబాద్‌: బీసీ రిజర్వేషన్లపైనే క్రీమీలేయర్‌ విధించడం దారుణమని, క్రీమీలేయర్‌ను ఎత్తివేసే వరకు ఐక్యంగా ఉద్యమించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ పిలుపునిచ్చారు. ‘బీసీలపై విధించిన క్రీమీలేయర్‌ విధానం– భవిష్యత్‌ కార్యాచరణ’అనే అంశంపై ఆదివారం ఇక్కడ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన బీసీ, ఓబీసీ ఉద్యోగ సంఘాల రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో బీసీల జనాభా 50 శాతానికిపైగా ఉండగా ఉద్యోగులు కేవలం 8 శాతం మాత్రమే ఉన్నారని అన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం క్రీమీలేయర్‌ వార్షిక ఆదాయ పరిమితిని ఆరు లక్షల రూపాయల నుంచి ఎనిమిది లక్షల రూపాయలకు పెంచినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇంతవరకు పెంచకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.

క్రీమీలేయర్‌పై రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను వెంటనే జారీ చేయాలని, నాన్‌ క్రీమీలేయర్‌ సర్టిఫికెట్లు పొందడానికి మహిళలకు తండ్రి లేదా భర్త ఆదాయం పరిగణనలోకి తీసుకునే అవకాశం కల్పించాలని శ్రీనివాస్‌గౌడ్‌ కోరారు. రాష్ట్ర జాబితాలో 112 కులాలుండగా కేంద్ర జాబితాలో కేవలం 87 కులాలే ఉన్నాయని, కేంద్ర జాబితాలో లేని 32 బీసీ కులాలవారికి కూడా ఓబీసీ సర్టిఫికెట్లు ఇచ్చి నాన్‌ క్రీమీలేయర్‌ను వర్తించే విధంగా చూడాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. బీసీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. క్రీమీలేయర్‌ను జనరల్‌ కోటాలోనూ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. బీసీల డిమాండ్లపై నవంబర్‌ 5న జిల్లాల కలెక్టర్లకు వినతిపత్రాలను ఇవ్వాలని, 14న అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో బీసీ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావా లని నిర్ణయించామని చెప్పారు. సమావేశంలో బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఇ.నిరంజన్, ప్రొఫెసర్‌ ఎం.చెన్నప్ప, డాక్టర్‌ బండి సాయన్న తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement