
సాక్షి,హైదరాబాద్: మెడికల్ కౌన్సెలింగ్‌లో రిజర్వేషన్లు పాటించకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు మెడికల్ సీట్లు దక్కకుండా చేశారని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. కాళోజీ హెల్త్ యూనివర్సిటీ అధికారులు, వీసీ ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
రిజర్వేషన్ల ప్రకారం సీట్లు కేటాయించకపోతే ఈనెల 17న కాళోజీ యూనివర్సిటీని ముట్టడిస్తామని జాజుల హెచ్చరించారు. 550 జీవోను అమలు చేయకుండా, యూనివర్సిటీ అధికారులకు వక్ర భాష్యం చెబుతూ ఉన్నతాధికారులను, సంబంధిత మంత్రిని తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. జరిగిన రెండో కౌన్సెలింగ్‌ను రద్దు చేసి, మూడో కౌన్సెలింగ్‌లో రిజర్వేషన్లు పూర్తిగా అమలయ్యేలా చూడాలని మంగళవారం ఒక ప్రకటనలో కోరారు.