ఆదివారం బీసీల విస్తృత స్థాయి సమావేశంలో బీసీ సంఘాల నేతలు ఆర్.కృష్ణయ్య, ఎర్ర సత్యనారాయణ తదితరులు
హైదరాబాద్: బీసీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే రాజకీయ పక్షానికే బీసీల మద్దతు ఉంటుందని బీసీ సంక్షేమ సంఘం నేత, తాజా మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య స్పష్టం చేశారు. ఆదివారం నాంపల్లి పబ్లిక్‌గార్డెన్స్‌లోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ అధ్యక్షతన ‘‘బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు’’అనే అంశంపై సదస్సు జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన కృష్ణయ్య ప్రసంగించారు. రాజకీయ చైతన్యం ఉన్న రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక్క బీసీ కూడా ముఖ్యమంత్రి కాలేకపోయారని అసంతృప్తిని వ్యక్తం చేశారు. బీసీ జనాభా అధికంగా ఉన్న రాష్ట్రంలో బీసీలకు రాజ్యాధికారంలో చోటులేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు మినహా ఉత్తరప్రదేశ్, బిహార్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో బీసీ నేతలు సీఎంలు అయ్యారని గుర్తు చేశారు.
రాష్ట్రంలో బీసీలు అభివృద్ధి చెందాలంటే బీసీ ముఖ్యమంత్రి కావాల్సిందేనని అన్నారు. లేదంటే గొర్రెలు, మేకలు మేపుకోవాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు. వారికి కావాల్సింది గొర్రెలు, మేకలు కాదని చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు అని వ్యాఖ్యానించారు. అన్ని రాజకీయ పార్టీలు రాబోయే ఎన్నికల్లో బీసీలకు 65 ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ ఎన్నికల సంస్కరణలో భాగంగా రాజకీయ సంస్కరణలు జరగాలని, అందులో భాగంగా అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలను పెంచాలని డిమాండ్ చేశారు. పెంచిన సీట్లను నామినేటెడ్ పద్ధతిలో ఇప్పటి వరకు అసెంబ్లీలో అడుగుపెట్టని కులాలకు ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. రాజకీయ పార్టీలన్నీ తమ పంథాను మార్చుకోవాలని సూచించారు. లేదంటే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. దేశాన్ని సంస్కరించుకోవడంలో భాగంగా విప్లవాన్ని తీసుకువస్తామని అన్నారు. ఇప్పుడు రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యాన్ని ధనస్వామ్యంగా మార్చాయని విమర్శించారు. యువతరం తిరుగుబాటు చేయకముందే ఈ పద్ధతికి స్వస్తిపలకాలని అన్నారు.
నవంబర్ 4న బీసీల బహిరంగ సభ.....
బీసీ సమస్యల పరిష్కారానికి నవంబర్ 4న భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య వెల్లడించారు. హైదరాబాద్‌లోని నిజాం కాలేజ్‌లో గానీ, పరేడ్ గ్రౌండ్‌లో గానీ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వివరించారు. బీసీ ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. రూ.20వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ ఏర్పాటు చేయాలని, బీసీలకు 90 శాతం సబ్సిడీతో అర్హులైన వారందరికీ రుణాలు మంజూరు చేయాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, బీసీలపై విధించిన క్రీమీలేయర్‌ను ఎత్తివేయాలని కోరారు. బీసీల జనాభా దామాషా ప్రకారం 500 బీసీ గురుకుల పాఠశాలలను నెలకొల్పాలని కోరారు. విదేశీ విద్యకు వెళ్లే విద్యార్థులకు రూ.20 లక్షల స్టయిఫండ్‌ను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, కేజీ టు పీజీ విద్యా సంస్థల జేఏసీ కన్వీనర్ గౌరి సతీష్, బీసీ సంక్షేమ సంఘం నేతలు ఉపేందర్, రాజ్ కుమార్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment