ధర్నాలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ ఎంపీలు మోపిదేవి, మస్తాన్‌రావు
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నోఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న బీసీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమంతో జంతర్‌మంతర్ హోరెత్తింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా మంగళవారం బీసీ సంక్షేమ సంఘం, రాష్ట్రీయ ఓబీసీ మహా సంఘ్ ఆధ్వర్యంలో ‘బీసీల మహాధర్నా’ జరిగింది. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీసీలంటే కేంద్ర ప్రభుత్వానికి చిన్నచూపు ఎందుకని ప్రశ్నించారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే బీసీ బిల్లు ప్రవేశపెట్టి.. చట్టసభల్లో 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి, కేంద్ర బడ్జెట్లో బీసీలకు కనీసం రూ.లక్ష కోట్లు కేటాయించాలని కోరారు. వైఎస్సార్ సీపీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు మాట్లాడుతూ బీసీ కులగణన, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు, జనాభా దామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్లను 27 శాతం నుండి 50%కి పెంచాలన్న డిమాండ్లపై పార్లమెంట్‌లో రోజూ పోరాడుతున్నామని చెప్పారు. సామాజిక న్యాయానికి వైఎస్సార్‌సీపీ కట్టుబడి ఉందన్నారు. బీసీల పోరాటానికి వైఎస్సార్‌సీపీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని పేర్కొన్నారు.
ప్రధాని మోదీ తాను బీసీ ప్రధానినని చెప్పుకొంటున్నా.. తొమ్మిదేళ్ల పాలనలో బీసీలకు చేసిందేమీ లేదని బీఆర్‌ఎస్ ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్ మండిపడ్డారు. బీసీలకు 50% రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. బీసీలంతా రాజకీయ పార్టీలకు అతీతంగా, ఐక్యంగా ముందుకు సాగితే కేంద్రం దిగిరాక తప్పదని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేశన శంకరరావు అన్నారు. ధర్నాను బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి కుమ్మర క్రాంతి కుమార్ యాదవ్ సమన్వయం చేయగా.. ప్రొఫెసర్ భవన్ రావు తైవాడే (మహారాష్ట్ర), ప్రొఫెసర్ జోగేంద్ర కవాడే, మాజీ ఎంపీ ఇంద్రజిత్ సింగ్ (పంజాబ్), హన్సరాజ్ (ఢిల్లీ) రాజేష్ షైనీ (హరియాణా), విక్రమ్ సాహా మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment