
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు బీసీలకు తీవ్ర అన్యాయం చేశాయని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం బీసీ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాజకీయాల్లో బీసీలకు జరిగిన అన్యాయానికి నిరసనగా ఈ నెల 17న రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలు బీసీలకు అతి తక్కువ సీట్లిచ్చి అవమానపర్చాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలకతీతంగా బీసీ నాయకులంతా బంద్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కాలేజీ విద్యార్థులు ర్యాలీలు నిర్వహించాలని, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
12 సంఘాల మద్దతు..
ఈ బంద్‌కు 12 బీసీ సంఘాలు మద్దతిచ్చాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు పోటీ పడుతూ బీసీలకు టికెట్లివ్వకుండా అన్యాయం చేస్తున్నాయని చెప్పారు. బీసీ ఫ్రంట్, రాష్ట్ర బీసీ సంఘం, బీసీ యువజన సంక్షేమ సంఘం, రాష్ట్ర బీసీ ఉద్యోగుల సంఘం, రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం, రాష్ట్ర బీసీ సంఘర్షణ సమితి, రాష్ట్ర బీసీ హక్కుల పోరాట కమిటీ, రాష్ట్ర బీసీ సేన, రాష్ట్ర బీసీ ప్రజా సమితి, రాష్ట్ర బీసీ జన సమితి, రాష్ట్ర బీసీ కులాల ఐక్య వేదిక, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మొదలైన సంఘాలన్ని మద్దతు తెలిపాయని వెల్లడించారు. ఈ బంద్ ద్వారా బీసీల సత్తా చూపిస్తామని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో భిక్షపతి, నాగుల శ్రీనివాస్ యాదవ్, ప్రవీణ్ గౌడ్, వెంకటచారి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment