సాక్షి, హైదరాబాద్: బీసీ సంక్షేమ సంఘం నేత, ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య త్వరలోనే తెలుగుదేశం పార్టీని వీడనున్నారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు కొంతకాలంగా తన విషయంలో, ఏపీలోని బీసీల విషయంలోనూ అనుసరిస్తున్న విధానాలపై గుర్రుగా ఉన్న కృష్ణయ్య ఇక టీడీపీకి రాంరాం చెప్పడమే మేలనే నిర్ణయానికి వచ్చారు. బీసీలంటే చంద్రబాబుకు చులకన భావం ఉందని, అందుకే ఆ పార్టీని వదిలిపెట్టాలని తాను భావిస్తున్నానని సన్నిహితులకు చెబుతున్నారు. ముఖ్యంగా తాను గౌరవాధ్యక్షుడిగా ఉన్న ఓ ఉద్యోగ సంఘానికి ఏపీలో అధికారిక గుర్తింపు ఇచ్చేందుకు అక్కడి ప్రభుత్వం నిరాకరించడంతోపాటు.. తనను ఆ పదవి నుంచి తొలగిస్తేనే గుర్తింపు ఇస్తామని మెలిక పెట్టడంపై కృష్ణయ్య తీవ్రంగా మండిపడుతున్నారు.
నాలుగేళ్లుగా నిశ్శబ్ద యుద్ధం
తెలంగాణలో టీడీపీ అధికారంలోకి వస్తే కృష్ణయ్యను ముఖ్యమంత్రి చేస్తానని ప్రకటించిన చంద్రబాబు.. తర్వాత ఆయనకు కనీసం పార్టీ శాసనసభాపక్ష నేత హోదా కూడా ఇవ్వలేదు. ఏ ముఖ్య పదవుల్లో కూడా ఆయన పేరును ప్రస్తావించలేదు. దీంతో బాబు వైఖరిపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎల్బీనగర్‌లో కానీ, ఇతరత్రా సమావేశాల్లో పాల్గొన్నా టీడీపీ కండువా ధరించకుండా, కేవలం బీసీల కండువా కప్పుకుంటూనే వచ్చారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన పలు సమస్యలపై మాట్లాడినప్పుడు కూడా తెలుగుదేశం ప్రస్తావన తీసుకురాకుండా స్వతంత్రంగానే ఉండేందుకు ప్రయత్నించారు. ఇలా టీడీపీ, కృష్ణయ్యల మధ్య నిశ్శబ్ద యుద్ధం నాలుగేళ్లుగా నడుస్తోంది.
బాబు వ్యాఖ్యలతో ముదిరిన వివాదం
రాష్ట్రంలో రాజకీయ పరిస్థితితోపాటు ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు బీసీలపై అనుసరిస్తున్న వైఖరి కూడా కృష్ణయ్యకు నచ్చడం లేదు. బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకపోవడం, నాలుగేళ్లలో బీసీలకు ఉపయోగకరమైన ఒక్క పథకం చేపట్టకపోవడంపై అక్కడి బీసీ సంఘాలు గుర్రుగా ఉన్నాయి. రెండుసార్లు రాజ్యసభ ఎన్నికలు జరిగినా ఒక్క బీసీకి కూడా అవకాశం ఇవ్వలేదు. ఏపీలోని బీసీలకు ఏమీ చేయకపోగా.. న్యాయమూర్తులుగా ఎంపికైన బీసీ న్యాయవాదులు పనికిరారని ఆయన ఓ నివేదిక ఇవ్వడం కృష్ణయ్యను ఆత్మరక్షణలో పడేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేసినా చంద్రబాబు కనీసం పట్టించుకోలేదు.
‘గుర్తింపు’విషయంలోనూ అంతే
మరోవైపు ఏపీలోని బీసీ విద్యుత్ ఉద్యోగుల సంఘానికి గుర్తింపు ఇచ్చే విషయంలోనూ చంద్రబాబు తీరు కృష్ణయ్య ఆగ్రహానికి కారణమైంది. కృష్ణయ్య గౌరవాధ్యక్షుడిగా ఉన్న సంఘానికి గుర్తింపు ఇవ్వకుండా వేరే సంఘానికి ఇవ్వడం.. కృష్ణయ్యను ఆ పదవి నుంచి తొలగిస్తే గుర్తింపు ఇస్తామంటూ మంత్రి కళా వెంకట్రావు వ్యాఖ్యానించడం వివాదం ముదిరిపాకాన పడేలా చేసింది. ‘మన సంఘానికి గుర్తింపు ఇవ్వలేదు. మన ప్రజల కోసం మేనిఫెస్టోలో పెట్టిన 18 అంశాల్లో ఒక్కటీ నెరవేర్చలేదు. పైగా బీసీలను అణచివేయ్.. తొక్కేయ్, చీల్చేయ్ అనే సిద్ధాంతంతో ఆయన ముందుకెళ్తున్నారు. పార్టీ ఎమ్మెల్యేగా నాకూ గౌరవం లేదు. కోట్లాది మంది బీసీల పక్షాన నిలబడాల్సిన నేను టీడీపీలో ఉండాలనుకోవడం లేదు. త్వరలోనే నిర్ణయం తీసుకుంటా’అని కృష్ణయ్య తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్టు సమాచారం.
టీటీడీపీకి కృష్ణయ్య రాంరాం!
Published Fri, May 4 2018 3:47 AM | Last Updated on Fri, Aug 10 2018 8:42 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment