సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, మెడిసిన్ ఇతర వృత్తి విద్యా కోర్సుల్లో చదువుతోన్న బీసీ విద్యార్థుల పూర్తి ఫీజులను ప్రభుత్వమే చెల్లించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ర్యాంకుతో సంబంధం లేకుండా విద్యార్థులందరికీ పూర్తి ఫీజు చెల్లిస్తున్నట్లు ప్రభుత్వం జీవో జారీ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో విద్యార్థులతో కలసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
గత డిసెంబర్‌లో హైదరాబాద్‌లో నిర్వహించిన బీసీ మహాగర్జనలో బీసీ మంత్రులు మొత్తం ఫీజులను చెల్లిస్తామని ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. బీసీల్లో ఏ, బీ, సీ, డీ కేటగిరీలకు మొత్తం ఫీజును ఇవ్వకుండా ఈ కేటగిరీ వారికి మొత్తం ఫీజును ఇవ్వడం బీసీల పట్ల వివక్ష చూపడం కాదా అని జాజుల ప్రశ్నించారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ జోక్యం చేసుకుని తగు చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment