
సాక్షి, అమరావతి: కేంద్రం త్వరలో నిర్వహించబోయే జనగణన–2021లో కులగణన కూడా చేపట్టాలని మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేయడంతోపాటు అసెంబ్లీలో కూడా తీర్మానం చేయాలని నిర్ణయించటంపై జాతీయ బీసీ సంక్షేమసంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఒక ప్రకటనలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు వైఎస్సార్‌సీపీ ఎంపీలు రాజ్యసభలో బీసీ బిల్లును ప్రవేశపెట్టి చరిత్ర స్పష్టించారని, 74 ఏళ్ల చరిత్రలో ఏ రాజకీయ పార్టీ బీసీ బిల్లు పెట్టలేదని పేర్కొన్నారు.
దేశంలో బీసీ పార్టీలుగా ముద్రపడినవి కూడా బీసీ బిల్లు పెట్టడానికి ముందుకు రాలేదని తెలిపారు. జగన్ తమ పార్టీ పరంగా బీసీ బిల్లు పెట్టి తాము బీసీల పక్షమని నిరూపించుకున్నారన్నారు. దేశ చరిత్రలోనే ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో 56 బీసీ కుల కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత జగన్‌దేనని తెలిపారు. రాష్ట్రంలో నామినేటెడ్ పదవులు, కాంట్రాక్టుల్లో 50% బీసీలకు ఇవ్వాలని అసెంబ్లీలో చట్టం చేశారని గుర్తుచేశారు.
జగన్ ప్రభుత్వం చేపట్టిన చర్యల కారణంగా పేద కులాల్లో ఒక మౌలికమైన మార్పునకు పునాదులు ఏర్పడ్డాయన్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలు దేశంలో అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నాయని తెలిపారు. ఇటీవల తాను సీఎం జగన్‌ను కలిసినప్పుడు లోకసభలో బీసీ బిల్లు పెట్టాలని కోరగా సుముఖంగా స్పందించారని, అందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.