హైదరాబాద్ : పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై రెండు, మూడు రోజుల్లో బీసీ న్యాయ నిపుణులు, మేధావులు, బీసీ, కుల సంఘాలతో పాటు అన్ని రాజకీయ పార్టీలతో కలసి సమావేశం ఏర్పాటు చేసి శాశ్వతంగా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆల్ ఇండియా ఓబీసీ ఫెడరేషన్, తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అల్టిమేటం జారీ చేసింది. లేదంటే తెలంగాణ రాష్ట్ర సాధన స్ఫూర్తిగా బీసీ రిజర్వేషన్ల పరిరక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్‌ల ముట్టడి, రాస్తారోకో వంటి కార్యక్రమాలతో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని నేతలు హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్లపై కోర్టుల్లో ప్రశ్నించకుండా 9 వ షెడ్యూల్‌లో చేర్చి రాజ్యాంగబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను 34 శాతం నుంచి 23 శాతానికి తగ్గించడాన్ని నిరసిస్తూ ఆల్ ఇండియా ఓబీసీ ఫెడరేషన్, తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద గురువారం బీసీల మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నేషనల్ ఓబీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ వి.ఈశ్వరయ్య మాట్లాడుతూ పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలులో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని అన్నారు. ఓబీసీ రిజర్వేషన్లు కేంద్రం, బీసీ రిజర్వేషన్లు రాష్ట్రం పరిధిలోనివని, బీసీ ముస్లిం రిజర్వేషన్లను 12 శాతానికి పెంచి కేంద్ర ఆమోదానికి పంపడం బూటకమన్నారు. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పుపై ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేసి స్టేను పునరుద్ధరించాలని కోరారు.
రాజ్యాధికారం కోసం ఉద్యమిస్తాం: జాజుల
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల కుంపటి రాజుకుంటే రాయితీలు కాదని రాజ్యాధికారం కోసం ఉద్యమిస్తామన్నారు. గతంలో ఉన్న పటేల్, పట్వారీ వ్యవస్థను తీసుకు వస్తున్నారని, బీసీలను రాజకీయంగా ఎదగకుండా చేసే కుట్రలో ఇది భాగమన్నారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం ఎవరితో చర్చించకుండా మొండిగా ముందుకు పోతే జైలుకు వెళ్లడానికి, అఖరికి చావడానికైనా సిద్ధమేనన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె .లక్ష్మణ్ మాట్లాడుతూ బీజేపీ బీసీలకు సంబంధించిన 31 అంశాలను గుర్తించి సీఎం కేసీఆర్‌కు నివేదిస్తే ఏడాది గడిచినా ఒక్క అంశాన్ని అమలు చేయలేదని, కేసీఆర్‌కు సామాజిక స్పృహలేదన్నారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లపై కోర్టును సాకుగా చూపుతూ 34 శాతం నుంచి 23 శాతానికి తగ్గించడం శోచనీయమన్నారు. మాజీ ఎంపీ వి.హనుమంతరావు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లు తగ్గిస్తూ కేసీఆర్ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకు వస్తే ఆ పార్టీలోని కేశవరావు, డి. శ్రీనివాస్ వంటి నేతలు నోరు మెదపక పోవడం శోచనీయమన్నారు.శాసనమండలి పక్ష నేత షబ్బీర్‌అలీ మాట్లాడుతూ కేసీఆర్ పిట్టలదొర అని, ఎప్పుడు ఏ మాట చెబుతారో ఆయనకే తెలియదని అన్నారు. పీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ రాజకీయాలకతీతంగా బీసీ రిజర్వేషన్ల పరిరక్షణకు పోరాడాలన్నారు. కార్యక్రమంలో సాంబశివరావు, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, టీటీడీపీ నేతలు కూన వెంటేష్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు జి.భరత్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
23న భారీ ధర్నా: కృష్ణయ్య
హైదరాబాద్: గ్రామపంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీల్లో బీసీ రిజర్వేషన్లు 34% నుంచి 23%కు తగ్గిస్తూ పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవాలని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల తగ్గింపు ఆర్డినెన్సుకు వ్యతిరేకంగా ఈ నెల 23న భారీ ధర్నాను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. విద్యానగర్ బీసీ భవన్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గత పాతికేళ్లుగా 34% రిజర్వేషన్లు కొనసాగుతున్నాయని, అప్పుడులేని అభ్యంతరాలు ఇప్పుడు ఎందుకొచ్చాయని ప్రశ్నించారు.
34% రిజర్వేషన్ల ప్రకారమే...
ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలను 34% రిజర్వేషన్ల ప్రకారమే జరపాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లను జనాభా ప్రకారం 34% నుంచి 56% వరకు పెంచాలని బీసీలు డిమాండ్ చేస్తుంటే కోర్టులు, ప్రభుత్వాలు రిజర్వేషన్లను 23%కి తగ్గించాలనుకోవడం దుర్మార్గమన్నారు. సుప్రీంకోర్టు తీర్పు కొత్తేమీ కాదని, ఈ తీర్పు ఇచ్చిన తరువాత కూడా 2013లో గ్రామపంచాయతీ ఎన్నికలు, 2014లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించారని వివరించారు. ఈ కార్యక్రమంలో గుజ్జ కృష్ణ, జైపాల్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment