హైదరాబాద్: రాష్ట్రంలో 56 శాతం ఉన్న బీసీల కోసం 2023 నాటికి ప్రత్యేక రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తామని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్), హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (హెచ్‌యూజే) ఆధ్వర్యంలో ‘మీట్ ది ప్రెస్’కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాజుల మాట్లాడుతూ.. ముందస్తు ఎన్నికల్లో బీసీలకు తీవ్రమైన అన్యాయం జరిగిందని, అన్ని రాజకీయ పార్టీలు మొండిచేయి చూపాయని విమర్శించారు.
బడుగుల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే పిడికెడు ఉన్న అగ్రకులాల వారే రాజ్యాన్ని ఏలుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు రాజ్యాధికారం వస్తే తప్ప వారి బతుకుల్లో మార్పు రాదని అన్నారు. 9 నెలల ముందే ఎన్నికలు రావటం వల్ల పార్టీని పెట్టలేకపోయామని తెలిపారు. తాను ఏ అగ్రకుల పార్టీ బీఫాంతో పోటీ చేయనని, స్వతహాగా పార్టీ పెట్టి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. అన్ని పార్టీలు 5 శాతం ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి అధిక సీట్లు కేటాయిస్తే.. బీఎల్‌ఎఫ్ మాత్రం బీసీలకు 59 సీట్లను కేటాయించిందని తెలిపారు. సామాజిక తెలంగాణ కాదు రెడ్ల తెలంగాణ వచ్చిందని ఎద్దేవా చేశారు.
ఏ పార్టీకి మద్దతు ఇవ్వబోం..
ఈ ఎన్నికల్లో తాము ఏ పార్టీకి మద్దతు ఇవ్వబోమని జాజుల స్పష్టం చేశారు. జెండాలు, పార్టీలకు అతీతంగా బీసీ బిడ్డలను గెలిపించుకుంటామని చెప్పారు. ఈ రాష్ట్రానికి బీసీ వ్యక్తి సీఎం అయ్యే వరకు ఉద్యమిస్తానని చెప్పారు. బీఎల్‌ఎఫ్ వస్తే బీసీని సీఎం చేస్తామన్న తమ్మినేని వీరభద్రాన్ని ముందు నీ పదవిని బీసీకి ఇవ్వాలని మంద కృష్ణమాదిగ అనటం సరైంది కాదని వ్యాఖ్యానించారు. బీసీలకు 59 సీట్లు ఇచ్చిన ఘనత వారిదే అని అన్నారు. టీడబ్ల్యూజేఎఫ్ అధ్యక్షుడు మామిడి సోమయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య, ఉపాధ్యక్షుడు పులిపలుపుల ఆనందం, హెచ్‌యూజే నాయకులు పాల్గొన్నారు.
బీసీల కోసం ప్రత్యేక పార్టీ: జాజుల
Published Wed, Dec 5 2018 3:45 AM | Last Updated on Wed, Dec 5 2018 3:45 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment